ఐపీఎల్ పేరును ధోనీ ప్రీమియర్ లీగ్ గా మార్చాలేమో!
సినిమాల్లో చిరంజీవిలాగా క్రికెట్ లో ధోనీ ఉంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుందా.. అతడు బ్యాట్ పట్టినా, పట్టకపోయినా ఫ్యాన్స్ ను ఆపడం ఎవరి తరం కావడం లేదు, ఎందుకంటారు?
ఇప్పుడతని వయసు 42. ఇంకో 8 ఏళ్లలో 50 నిండుతాయి. అయినా తను వస్తుంటే స్టేడియం దద్దరిల్లుతుంది. బ్యాట్ పట్టుకుంటే చప్పట్లు, ఈలలు మోతమోగుతాయి. ఏ ఫోరో, సిక్సో బాదితే ఇక చెవులు మూసుకోవాల్సిందే.. అతడెవరో మీకీ పాటికి తెలిసే ఉంటుంది. అతడే ఎంఎస్ ధోనీ. ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ మినహా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోని ఇప్పుడు ఐపీఎల్ లో పెద్ద యట్రాక్షన్. ధోనీ వస్తున్నాడంటేనే ఆయా స్టేడియాలు పసుపుమయం అవుతున్నాయి. ధోనీ, ధోనీ అని అరుపులు హోరెత్తుతున్నాయి. సరిగ్గా రాత్రి అదే జరిగింది. లక్నో, చెన్నై జట్ల మధ్య ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఏకనా స్టేడియంలో మ్యాచ్ జరిగింది. చివర్లో చటుక్కున వచ్చి నాలుగైదు ఫోర్లో, సిక్సులో కొట్టేసి స్టేడియంను ఓ రేంజ్ లో ఉర్రూతలూపాడు. అప్పుడు చూడాలి నా సామిరంగా.. స్టేడియం ధోనీ నామస్మరణతో హోరెత్తింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ బదులు ధోనీ ప్రీమియర్ లీగ్ అని మార్చాలేమో అనిపించింది. ఈ ‘కెప్టెన్ కూల్’ కోసం ప్రతి స్టేడియం మాదిరే ఈ ఏకనా స్టేడియం కూడా పసుపుమయమైంది.
ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టును ఓడించి లక్నో జట్టు గెలిచినందుకు క్రీడాభిమానులు చేసిన సందడి కన్నా మ్యాచ్ చివర్లో ప్రేక్షకులకు చేయి ఊపుతూ హెల్మెట్ చేతబట్టుకుని చేయి ఊపినపుడు వచ్చిన స్పందన మాటల్లో చెప్పనలవి కాదు. తన జట్టు బ్యాటింగ్ సమయంలో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి ఫ్యాన్స్‌ను అలరించాడు. అతడు క్రీజ్‌లోకి వస్తుంటే మైదానమంతా హోరెత్తిపోయింది. అంతా ధోనీ నామస్మరణే. ఆ క్రేజ్‌ను ప్రత్యక్షంగా చూసిన లక్నో స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ భార్య సాషా అయితే ఆశ్చర్యానికి గురైంది. ధోనీకి ఇంత క్రేజేమిటంటూ ముక్కున వేలేసుకుందట. ఆమె తన సోషల్ మీడియా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. దానర్థం ఏమిటంటే ... ‘‘ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు.. నా స్మార్ట్ వాచ్‌లో నమోదైన చిత్రమిది. హోరెత్తిన నినాదాలతో స్టేడియంలో నమోదైన సౌండ్ లెవెల్ ఎంతుందంటే 95 డెసిబల్స్. ఇలాగే ఓ పది నిమిషాలు కొనసాగితే నాకు చెవుడు వచ్చేదేమో’’ అని సాషా పేర్కొంది. దాంతోపాటు ఆ ఫొటోను షేర్ చేసింది. ధోనీ మైదానంలోకి వస్తుంటే.. ఈ సౌండ్ లెవెల్ ఒక్కోసారి 125కుపైగా నమోదవుతున్నట్లు టీవీ తెరలపై కనిపిస్తోంది.
లక్నో మ్యాచ్లో 18వ ఓవర్ చివరి బంతికి ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడు. కేవలం 9 బంతుల్లోనే 28 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశారు. అతడు దూకుడుగా ఆడటంతో చెన్నై 176/6 స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేదనలో లక్నో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే 180 పరుగులు చేసి విజయం సాధించింది. అదే ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై గెలిచి ఉంటే ఆ స్టేడియం తలుపులు జనం అరుపులకే బద్ధలయ్యేవేమోనని ఓ క్రీడాభిమాని వ్యాఖ్యానించడం గమనార్హం. ధోనీ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 313 బంతుల్ని ఆడాడు. 772 పరుగులు చేశారు. ఇందులో 53 ఫోర్లు, 65 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో 16 బంతుల్లోనే 57 రన్స్ కొట్టాడు. స్ట్రైక్‌రేట్ 356.25 కావడం విశేషం.