ఇక మిగిలింది నెంబర్ వనే.. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దూకుడు
x

ఇక మిగిలింది నెంబర్ వనే.. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దూకుడు

పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాజాలో హమాస్ ఉగ్రవాదుల ఏరివేత ఓ కొలిక్కి వచ్చినట్లు భావించిన టెల్ అవీవ్ తన దృష్టిని లెబనాన్..


పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ గాజాలో సొరంగాల్లో దాక్కుంటూ నరమేధం సృష్టించిన ఉగ్రవాద సంస్థ హమాస్ భరతం పట్టిన ఐడీఎఫ్ తాజాగా లెబనాన్ లో ఉండి చికాకు పుట్టిస్తున్న షియా ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్లా పై దాడులు మొదలు పెట్టింది. తాజాగా బీరూట్ లో ఓ భవనంపై జరిపిన వైమానిక దాడిలో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ ఇబ్రహీం అకిల్‌ను చంపినట్లు ప్రకటించింది.

హిజ్బుల్లా కోట దక్షిణ బీరుట్‌లోని ఎత్తైన భవనాన్ని ధ్వంసం చేసిన వైమానిక దాడిలో 10 మంది సీనియర్ కార్యకర్తలతో సహా కనీసం 14 మంది మరణించారని వెల్లడించింది. సీనియర్ కమాండర్ల సమావేశానికి అకిల్ వస్తున్నారనే సమాచారంతో దాడులు జరిపింది. దాంతో వారంతా అసువులు బాశారు. హిజ్బుల్లాహ్ అకిల్ మరణాన్ని ధృవీకరించింది. అతన్ని "గొప్ప జిహాదీ నాయకుడు" అని అభివర్ణించింది.
1983 US ఎంబసీ బాంబు పేలుళ్లలో..
1983లో బీరుట్‌లోని యుఎస్ ఎంబసీ, మెరైన్ బ్యారక్‌లపై జరిగిన బాంబు దాడుల్లో వందలాది మంది అమెరికన్లను చంపినందుకు అకిల్‌పై యునైటెడ్ స్టేట్స్ $7 మిలియన్ల బహుమతిని ప్రకటించింది. 1980లలో అనేక మంది US, యూరోపియన్ బందీలను కిడ్నాప్ చేసిన ఘటనలో కూడా అతనే కీలక సూత్రధారి.
ఇజ్రాయెల్‌లోని ఉత్తర భూభాగాలపై దాడితో సహా ఇజ్రాయెల్‌పై దాడులను ప్లాన్ చేయడానికి అకిల్ ఒక సమావేశంలో హజరైనప్పుడు చంపబడ్డాడని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ కమ్యూనిటీలలోకి చొరబడేందుకు ఉద్దేశించిన హిజ్బుల్లా “కాంకర్ ది గెలీలీ” ప్రణాళికలో భాగంగా వారు ఈ సమావేశాన్ని నిర్వహించారు.
హిజ్బుల్లాకు పెద్ద దెబ్బ
పేజర్, వాకీ-టాకీ పేలుళ్ల కారణంగా దాని సభ్యుల్లో 37 మంది మరణించారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు. ఇందులో దాదాపు 200 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ చేసిన ఈ తాజా హత్య హిజ్బుల్లాకు పెద్ద దెబ్బ, ఈ ఉగ్రవాద సంస్థలో అతను నెంబర్ టూ స్థానంలో ఉన్నాడు. ఇంతకుముందు ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో నెంబర్ త్రీ స్థానంలో ఉన్న మరొక సీనియర్ కమాండర్ ఫుడ్ షుక్రుద్ మరణించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని ఖండించింది. అయితే ఈ ఆపరేషన్ తన జాతీయ భద్రతకు అవసరమని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి తెలిపారు. అకిల్ మరణానికి ప్రతీకారంగా, హిజ్బుల్లా ఇజ్రాయెల్ సైనిక స్థానాలపై పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు.
ఈ వైమానిక దాడిలో 14 మంది మరణించారని, 66 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలిసింది. కాగా హిజ్బుల్లా దగ్గర దాదాపు 1.50 లక్షల మంది ఫైటర్లు ఉన్నారని అంచనా. వీరి ద్వారా తన సార్వభౌమత్వానికి నష్టం అని ఇజ్రాయెల్ ముందస్తు దాడులు నిర్వహిస్తోంది. తాజాగా మొస్సాద్, ‘యూనిట్ 8200’ జరిపిన దాడులతో వేలాది పేజర్లు, వాకీటాకీలు, సౌర ఫలకాలు పేల్చివేసింది. దీనితో హిజ్బుల్లా ఉగ్రవాదులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని వణికిపోతున్నారు.


Read More
Next Story