అవసరమైతే భూతల దాడులు చేస్తాం: ఇజ్రాయెల్
పశ్చిమాసియాలో సైనిక ఘర్షణలు విస్తరిస్తున్నాయి. తమపై నిరంతరంగా రాకెట్లు, డ్రోన్ దాడులు చేస్తున్న హిజ్బుల్లాపైకి వైమానిక దాడులు ప్రారంభించిన ఐడీఎఫ్ అవసరమైతే భూతల
పశ్చిమాసియాలో మరో యుద్దం ప్రారంభమైంది. ఇప్పటికే హమాస్ పై విరుచుకుపడిన ఐడీఎఫ్ తాజాగా లెబనాన్ కేంద్రంగా తనపై దాడులు చేస్తున్న హిజ్బుల్లా పై భీకర దాడులకు దిగింది. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 90 మంది మహిళలు, కొంతమంది పిల్లలతో సహ 490 మందికి పైగా మరణించారు. 2006 ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన దాడి ఇదేనని లెబనీస్ అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు వ్యతిరేకంగా విస్తృత వైమానిక దాడులకు పాల్పడబోతున్నట్లు ప్రకటించింది. దాడులకు ముందే టెల్ అవీవ్ దక్షిణ, తూర్పు ప్రాంతాలను ఖాళీ చేయమని స్థానికులను హెచ్చరించింది.దీనితో వేలాది మంది లెబనీస్ దక్షిణ ప్రాంతాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. సిడాన్ నగరం నుంచి బీరూట్ వైపు వెళ్తున్న వాహనాలతో ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి.
లెబనీస్ అధికారుల ప్రకారం, ప్రజలను ఖాళీ చేయమని కోరుతూ దేశానికి 80,000 కంటే ఎక్కువ అనుమానిత ఇజ్రాయెలీ కాల్‌లు వచ్చాయి. టెలికాం కంపెనీ ఒగెరో అధిపతి ఇమాద్ క్రీడీహ్ ఈ పరిణామాన్ని వార్తా సంస్థ రాయిటర్స్‌కి ధృవీకరించారు, ఇటువంటి కాల్‌లు "వినాశనం మరియు గందరగోళానికి కారణమయ్యే మానసిక యుద్ధం" అని అన్నారు.
మృతుల్లో పిల్లలు, మహిళలు
ఈ దాడుల్లో 35 మంది చిన్నారులు, 58 మంది మహిళలు సహా 492 మంది మరణించారని, 1,645 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడులపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. లెబనీస్ పౌరులు తమ ప్రాంతాలను ఖాళీ చేయమని కోరిన ఐడీఎఫ్ పిలుపును తీవ్రంగా తీసుకోవాలని కోరాడు.
"దయచేసి మీరు ఇప్పుడు ఈ హానికర మార్గం నుంచి బయటపడండి" అని నెతన్యాహు కోరారు. "మా ఆపరేషన్ పూర్తయిన తర్వాత, మీరు సురక్షితంగా మీ ఇళ్లకు తిరిగి రావచ్చు." అంతర్జాతీయ వార్త సంస్థ ప్రకారం.. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి, రియర్ అడ్మ్. డేనియల్ హగారి, ఇజ్రాయెల్‌తో లెబనాన్ సరిహద్దు నుంచి హిజ్బుల్లాను నెట్టడానికి సైన్యం "అవసరమైనదంతా" చేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు.
నష్టం అపారం..
సోమవారం నాటి విస్తృత వైమానిక దాడులు హిజ్బుల్లాకు భారీ నష్టాన్ని కలిగించాయని హగారి పేర్కొన్నారు. కానీ అతను ఆపరేషన్ కోసం టైమ్‌లైన్ ఇవ్వడం లేదని, అవసరమైతే లెబనాన్‌పై భూ దండయాత్ర ప్రారంభించడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని చెప్పారు.
“మేము యుద్ధాల కోసం వెతకడం లేదు. కానీ మా రక్షణ కోసం మాత్రం అన్నింటికి సిద్ధంగా ఉన్నాం' అని అన్నారు. "ఈ లక్ష్యాన్ని సాధించడానికి మేము ఏమి చేయాలో అది చేస్తాము." అని వివరించారు.
హిజ్బుల్లా గత అక్టోబరు నుంచి ఇజ్రాయెల్‌లోకి దాదాపు 9,000 రాకెట్లు, డ్రోన్‌లను ప్రయోగించిందని, అందులో సోమవారం ఒక్కరోజే 250 ఉన్నాయని హగారి చెప్పారు. "హిజ్బుల్లా దక్షిణ లెబనాన్‌ను యుద్ధ ప్రాంతంగా మార్చింది" అని ఆయన ఒక వార్తా సమావేశంలో అన్నారు.
ఇజ్రాయెల్ అంచనా ప్రకారం హిజ్బుల్లా వద్ద దాదాపు 1,50,000 రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి, వీటిలో గైడెడ్ క్షిపణులు, అలాగే ఇజ్రాయెల్‌లో ఎక్కడైనా దాడి చేయగల సుదూర ఆయుధాలు ఉన్నాయి.
పాలస్తీనియన్లకు మద్దతు
హిజ్బుల్లా ప్రతిరోజూ ఇజ్రాయెల్‌లోకి వందలాది రాకెట్‌లను ప్రయోగించడం కొనసాగించడంతో లెబనాన్‌తో ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో చిన్నపాటి ఘర్షణలు, వాగ్వివాదాలు రోజువారీగా జరుగుతుంటాయి. గాజాలో ఇజ్రాయెల్ సైనిక దాడులకు నిరసనగా లెబనాన్ ఉగ్రవాద సంస్థ ప్రతిరోజు యూదులపైకి రాకెట్లు, డ్రోన్లు ప్రయోగిస్తోంది.
జూలైలో ఇజ్రాయెల్ తన టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్‌ను చంపినందుకు ప్రతీకారంగా హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్‌లను ప్రయోగించడంతో ఆగస్టులో ఉద్రిక్తతలు పెరిగాయి. వందలాది పేజర్లు, రేడియోలు వరుస పేలుళ్లలో లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదులు వణికిపోయారు. తర్వాత ఇజ్రాయెల్‌తో "ఓపెన్-ఎండ్ బ్యాటిల్ ఆఫ్ రికకనింగ్" ప్రకటించినందున ఆదివారం, మిలిటెంట్ గ్రూప్ మళ్లీ 100 కంటే ఎక్కువ రాకెట్‌లను ప్రయోగించింది. హిజ్బుల్లా సభ్యులను లక్ష్యంగా చేసుకున్న సంఘటనకు లెబనాన్ ఇజ్రాయెల్, దాని అగ్ర గూఢచారి సంస్థ మొసాద్‌ను నిందించింది.
హిజ్బుల్లా దాడులను ఆపడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమవుతున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. దాని ఉత్తర సరిహద్దులపై దాడులను ఆపడానికి, పౌరులు వారి ఇళ్లకు తిరిగి రావడానికి పూర్తిస్థాయి యుద్ధం మాత్రమే మార్గమని పేర్కొంది.
Next Story