మోదీపై పుతిన్ ప్రశంసలు.. మీ జీవితం అంతా వారికోసమేనా..
x

మోదీపై పుతిన్ ప్రశంసలు.. మీ జీవితం అంతా వారికోసమేనా..

భారత ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు. మీ జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారని కొనియాడారు.


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మీ జీవితం అంతా మీ ప్రజల కోసమే కేటాయించారని ప్రశంసించారు. సోమవారం రాత్రి నోవో ఒగారియోవోలోని తన అధికారిక నివాసంలో ప్రధానితో పుతిన్ ప్రైవేట్ గా సంభాషించారు. ఈ సందర్భంగా దేశ పురోగతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

'మళ్లీ ఎన్నికలు..'
“మీరు మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు నేను మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను. ఇది రాత్రికి రాత్రి జరిగిన విషయం కాదని, ఎన్నో ఏళ్లుగా మీరు చేసిన కృషికి ఫలితం అని నేను భావిస్తున్నాను” అని అనధికారిక సమావేశం నిర్వహించినప్పుడు పుతిన్, మోదీకి చెప్పారు.
"మీకు మీ స్వతంత్ర ఆలోచనలు ఉన్నాయి. మీరు చాలా శక్తివంతమైన వ్యక్తి, దేశం, భారతీయ ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైన ఫలితాలను సాధించగలరు” అని పుతిన్ అన్నారు. "ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం దృఢంగా ఎదిగింది, ” అని పుతిన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాస్ వార్తా సంస్థ ఉటంకిస్తూ పేర్కొంది.
"మాతృభూమికి సేవ చేసే అవకాశం"
ప్రధాని మోదీ తన జీవితమంతా తన ప్రజలకు సేవ చేసేందుకు అంకితం చేశారని, ప్రజలు ఈ అనుభూతి చెందుతున్నారని పుతిన్ అన్నారు. మాస్కో వెలుపల ఉన్న అధికారిక నివాసంలో ఇద్దరు దేశాధినేతలు ఒక కప్పు టీ తాగుతూ తమ తమ దేశాల రాజకీయాలను ముచ్చటించుకున్నారు.

మోదీ దేశంలో జరిగిన ఇటీవల ఎన్నికలను గుర్తు చేసుకున్నారు. ‘‘ భారత ప్రజలు మరోసారి నాకు మాతృభూమికి సేవ చేసే అవకాశం కల్పించారు’’ అని చెప్పారు. దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. మీరు మీ జీవితం మొత్తాన్ని భారతీయ ప్రజలకు సేవ చేయడానికి అంకితం చేసారు. ఇప్పుడు ప్రజలు ఆ ఫలాలను అనుభవిస్తున్నారు. ’’ అని బదులిచ్చారు. "మీరు చెప్పింది నిజమే, నాకు ఒకే ఒక లక్ష్యం ఉంది, వీళ్లు నా ప్రజలు ఇది నా దేశం" అని ప్రధాని చిరునవ్వుతో చెప్పారని టాస్ నివేదిక పేర్కొంది.
ప్రైవేట్ గా షికారు
అనంతరం నోవో-ఒగారియోవోలోని పుతిన్ నివాసం చుట్టూ అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ షికారు చేశారు. ఇద్దరు ఎలక్ట్రిక్ కారు లో డ్రైవ్ చేశారు.ఇద్దరి మధ్య చాలా సేపు ఆంగ్లంలో సంభాషణ జరిగిందని టాస్ నివేదిక పేర్కొంది. ఏం మాట్లాడుకున్నారో ఇరుదేశాల అధికారులు మాత్రం వెల్లడించలేదు. బహుశా ప్రపంచ రాజకీయాల గురించి చర్చించుకుని ఉంటారని విశ్లేషణలు భావిస్తున్నారు.
"ఇద్దరు సన్నిహితుల సమావేశం"
నోవో-ఒగారియోవోలో తనకు ఆతిథ్యమిచ్చినందుకు ప్రెసిడెంట్ పుతిన్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. "రేపు కూడా మా చర్చల కోసం ఎదురు చూస్తున్నాము. ఇది ఖచ్చితంగా భారత్ - రష్యా మధ్య స్నేహ బంధాలను మరింత సుస్థిరం చేయడంలో చాలా దూరం వెళ్తుంది" అని ఆయన అన్నారు.
అంతకుముందు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రైవేట్ ఈవెంట్‌ను "ఇద్దరు సన్నిహితులు, విశ్వసనీయ భాగస్వాముల సమావేశం"గా అభివర్ణించింది. "PM @narendramodiకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నోవో-ఒగారియోవోలోని తన అధికారిక నివాసంలో ప్రైవేట్ మీటింగ్ కోసం స్వాగతం పలికారు" అని అది సమావేశానికి సంబంధించిన కొన్ని ఛాయాచిత్రాలను పంచుకుంది. ఇరువురు నేతలు భారత్-రష్యా స్నేహబంధాన్ని గౌరవించుకోవడానికి ఇది ఒక అపూర్వ సందర్భమని పేర్కొంది.
భారత్ "సహాయక పాత్ర"
ఉక్రెయిన్‌పై మాస్కో దండయాత్ర ప్రారంభమైన తరువాత భారత ప్రధాని మొదటిసారిగా రష్యా పర్యటనకు వెళ్లారు. ఇది వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ సంబంధాలను కలిగి ఉందని చెప్పవచ్చు. భవిష్యత్ లో భారత్- రష్యా సంబంధాలు మరింత మెరుగుపడాలని తాను అభిలాషిస్తున్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు భారతీయులకు ఎంతో మేలు చేకూర్చడానికి ఉపయోగపడతాయని మోదీ అన్నారు. శాంతియుత, సుస్థిరమైన ప్రాంతం కోసం దేశం “సహాయక పాత్ర” పోషించాలని కోరుకుంటోందని ప్రధాని చెప్పారు.
Read More
Next Story