మోదీ- బైడెన్ మధ్య చర్చకు వచ్చిన కీలక విషయాలేంటీ?
x

మోదీ- బైడెన్ మధ్య చర్చకు వచ్చిన కీలక విషయాలేంటీ?

భారత్ - అమెరికా మధ్య కొన్ని కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు ఇరుదేశాల సంయుక్త ప్రకటన తెలియజేసింది. ముఖ్యంగా డ్రోన్ల డీల్, ఐరాసలో శాశ్వత సభ్యత్వంతో పాటు..


భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో దైపాక్షిక చర్చలు జరిగాయి. వీరి మధ్య ప్రధానంగా మూడు బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయనున్న డ్రోన్ డీల్, కొత్త సెమీకండక్టర్ పరిశ్రమల స్థాపన, ఐరాస భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం, స్వచ్చమైన ఇంధన సరఫరా గొలుసులు వంటి కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. సమావేశాల అనంతరం క్వాడ్ సదస్సు జరగనుంది.

డ్రోన్ ఒప్పందం
భారత్, అమెరికా నుంచి దాదాపు మూడు నుంచి నాలుగు బిలియన్ డాలర్ల వ్యయంతో 31 ఎంక్యూ 9బీ స్కై గార్డియన్, సీ గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. దీనికి సంబంధించిన చర్చలు ట్రంప్ హయాంలోనే ప్రారంభమైన ఒప్పందం మాత్రం ఇంకా పూర్తికాలేదు. చైనాతో సరిహద్దు వెంబడి నిఘా పెంచేందుకు 16 స్కై గార్డియన్స్, 15 సీ గార్డియన్స్ - ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేసే ప్రక్రియలో భారత్ సిద్ధమైంది. కొన్ని నివేదికల ప్రకారం నిఘా, దాడులకు సంబంధించి ఇవి కీలకంగా ఉపయోగపడనున్నాయి.
గత ఏడాది జూన్‌లో రక్షణ మంత్రిత్వ శాఖ జీ టూ జీ ఫ్రేమ్ వర్క్ కింద ఉపరితల క్షిపణులు, లేజర్-గైడెడ్ బాంబులతో కూడిన సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి తన ప్రణాళికను ఖరారు చేసింది. యుఎస్ డిఫెన్స్ కంపెనీ జనరల్ అటామిక్స్ నుంచి కొనుగోలు చేయబోయే డ్రోన్‌లు అధిక-ఎత్తులో 40 గంటలకు పైగా అన్ని రకాల వాతావరణంలో ఎగురుతాయి. నిశ్శబ్ధంగా శత్రు భూభాగంలోని చొచ్చుకుని పోతాయి.
'ఫలవంతమైన చర్చలు'
ఇరువురు నేతలు " ఫలవంతమైన" చర్చలు జరిపారని, పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించే మార్గాల గురించి చర్చించారని, ముఖ్యంగా ఇండో -ఫసిఫిక్ ప్రాంతాల మధ్య జరుగుతున్న మిలిటరీకరణ గురించి ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారని సమావేశం తర్వాత భారత్ - యుఎస్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది.
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న మోదీకి శనివారం (సెప్టెంబర్ 21) డెలావేర్‌లోని గ్రీన్‌విల్లేలోని తన నివాసంలో అధ్యక్షుడు జో బైడెన్ సాదరస్వాగతం పలికారు. అక్కడ ఇద్దరు నేతలు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ద్వైపాక్షిక చర్చలు జరిగిన సభలోకి మోదీని తీసుకువెళుతుండగా బైడెన్ చేయి పట్టుకున్నారు.
" భారత్‌తో యునైటెడ్ స్టేట్స్ భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలంగా, సన్నిహితంగా, డైనమిక్‌గా ఉంది. ప్రధాని మోదీ, మేము కూర్చున్న, చర్చలు జరుపుతున్న ప్రతిసారీ, కొత్త సహకార రంగాలను కనుగొనడం చూసి మా సామర్థ్యాలకు మేమే ఆశ్చర్యపోతున్నాం. ఈ రోజు కూడా భిన్నంగా లేదు " అని బైడెన్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
ఈ చర్చల సందర్భంగా ఇరువురు నేతలు పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే మార్గాలపై చర్చించారని, ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు అంతకు మించి ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్ పర్యటన.. పొలాండ్ పర్యటనపై ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగష్టులో ఉక్రెయిన్ లో పర్యటించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశసించారు. యుద్ధ ప్రాంతాలలో పర్యటించి మానవతావాదానికి మద్ధతును అందించినందుకు ప్రశంసించారు. అలాగే దశాబ్దాల తరువాత ఓ భారత ప్రధాని తొలిసారిగా పొలాండ్ లో పర్యటించడాన్ని కూడా అభినందించారు.
ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం..
కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఐరాసలో మార్పులు చేయాలని, అందులో భాగంగా భారత్ శాశ్వత సభ్యత్వం ఇవ్వాడానికి అమెరికా మద్ధతు ఇస్తుందని ప్రకటించింది. ప్రపంచ సంస్థలను సంస్కరించే కార్యక్రమాలకు US మద్దతు ఇస్తుందని సమావేశంలో బైడెన్ చెప్పారు. ఇరు దేశాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, పౌర సమాజాలు పరస్పరం సహకరించుకుని అత్యున్నత శిఖరాలకు చేరాలని ఇరువురు నేతలు అభిలాషించారు.
యుఎస్-ఇండియా ప్రధాన రక్షణ భాగస్వామ్యాన్ని "ప్రపంచ భద్రత- శాంతికి మూలస్తంభం"గా మార్చిన పురోగతిని కూడా వారు ప్రశంసించారు. పెరిగిన కార్యాచరణ సమన్వయం, సమాచార భాగస్వామ్యం, రక్షణ పారిశ్రామిక ఆవిష్కరణల ప్రయోజనాలను హైలైట్ చేశారు. మరింత సురక్షితమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తును నిర్మించడానికి యుఎస్-భారత భాగస్వామ్యం చాలా ముఖ్యమైనదని వారు చెప్పారు.
సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ ప్లాంట్
కీలకమైన సాంకేతిక రంగాలలో వ్యూహాత్మక సహకారాన్ని మరింత లోతుగా విస్తరించడంలో ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (iCET) విజయాన్ని ఇరువురు నాయకులు ప్రశంసించారు. అలాగే సురక్షితమైన సరఫరా గొలుసులను నిర్మించడానికి తమ ఆలోచనలతో సమానంగా ఉన్న భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
కొత్త సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్‌ను స్థాపించడానికి వాటర్‌షెడ్ ఏర్పాటును మోదీ - బిడెన్ ప్రశంసించారు, ఇది ఇండియా సెమీకండక్టర్ మిషన్ మద్దతుతో పాటు భారత్ సెమీ, త్రీఆర్‌డిటెక్ యుఎస్ స్పేస్ ఫోర్స్ మధ్య వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యం ద్వారా ప్రారంభించబడుతుంది.
ఉమ్మడి అంతరిక్ష మిషన్
2025లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి NASA - ISRO చేసిన మొదటి ఉమ్మడి ప్రయత్నం పురోగతిని కూడా వారు స్వాగతించారు. సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఐడియాల షేరింగ్ ను కూడా వారు ప్రశంసించారు. వ్యూహాత్మక సహకారం పెంపొందించుకుని ఉమ్మడి ఆవిష్కరణలను మరింతగా పెంచే అవకాశాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. భారత్ ఇంధన అవసరాలు తీర్చే క్లీన్ ఎనర్జీ మిషన్ కు యూఎస్ తన సహకారం అందిస్తుందని బైడెన్ ప్రభుత్వం హమీ ఇచ్చింది.
ధన్యవాదాలు తెలిపిన మోదీ..
ఈ సమావేశంలో, భారత్-అమెరికా భాగస్వామ్యానికి ఊతమివ్వడంలో బైడెన్ చేసిన అసమానమైన కృషికి మోదీ తన ప్రశంసలను తెలియజేశారు. జూన్ 2023లో అమెరికా పర్యటనను, సెప్టెంబరు 2023లో జి-20 లీడర్స్‌ సమ్మిట్‌ కోసం ప్రెసిడెంట్‌ బైడెన్‌ మన దేశంలో పర్యటనను గుర్తుచేసుకున్న మోదీ, ఈ పర్యటనలు భారత్‌-అమెరికా భాగస్వామ్యానికి మరింత చైతన్యాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అందించాయని అన్నారు.
"డెలావేర్‌లోని గ్రీన్‌విల్లేలో ఉన్న తన నివాసంలో నాకు ఆతిథ్యమిచ్చినందుకు అధ్యక్షుడు బిడెన్‌కు ధన్యవాదాలు. మా చర్చలు చాలా ఫలవంతమయ్యాయి. ఈ సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించే అవకాశం మాకు లభించింది" అని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఉన్నారు. US బృందంలో విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా వ్యవహారాల అధ్యక్షుడి సహాయకుడు TH జేక్ సులైవన్, భారత్ లో US రాయబారి ఎరిక్ గార్సెట్టి ఉన్నారు.
అధ్యక్షుడు జో బైడెన్ తన స్వస్థలమైన విల్మింగ్టన్‌లో నిర్వహించే వార్షిక క్వాడ్ సమ్మిట్ ఇండో-పసిఫిక్‌లో సహకారాన్ని పెంపొందించడానికి, ఉక్రెయిన్, గాజాలో వివాదాలకు శాంతియుత పరిష్కారాలను కనుగొనే మార్గాలను అన్వేషించడానికి కొత్త కార్యక్రమాల శ్రేణిని రూపొందించాలని భావిస్తున్నారు.


Read More
Next Story