కదన రంగానికి ఐఎన్‌ఎస్‌ తారాగిరి సై!
x
ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్న ఐఎన్‌ఎస్‌ తారాగిరి

కదన రంగానికి ఐఎన్‌ఎస్‌ తారాగిరి సై!

యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ తారాగిరి భారత నావికాదళంలో సేవలందించేందుకు సర్వసన్నద్ధమైంది.

భారత నావికాదళ పటిష్టానికి ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఇండియన్‌ నేవీ అమ్ముల పొదిలో చేరేందుకు మరో యుద్ధనౌక సిద్ధమవుతోంది. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంగా విధులు నిర్వహించనున్న ఈ వార్‌ షిప్‌ పేరు ఐఎన్‌ఎస్‌ తారాగిరి. శుక్రవారం విశాఖపట్నంలో లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ నౌక విశేషాలాలివీ!


ఐఎన్‌ఎస్‌ తారాగిరి ఫైల్‌ ఫోటో

నీలగిరి శ్రేణిలో నాలుగవది..
ఐఎన్‌ఎస్‌ తారాగిరి నౌక నావికాదళానికి చెందిన నీలగిరి తరగతి స్టెల్త్‌ గైడెడ్‌ క్షిపణి ఫ్రిగేట్‌లలో నాలుగవది. దీనిని అధికారికంగా ప్రాజెక్టు–17 ఆల్ఫా ప్రిగేట్‌ (పి–17ఎ)గా వర్గీకరించారు. ఈ యుద్ధనౌకను ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ నిర్మించారు. 2020 సెప్టెంబర్‌ 10న ఈ నౌక నిర్మాణాన్ని పూర్తి చేసి కేవలం రెండేళ్లలోనే అంటే.. 2022 సెప్టెంబర్‌ 11న జల ప్రవేశం చేయించారు. మజగావ్‌ డాక్‌ నిర్మించిన మూడవ ప్రాజెక్టు 17ఎ–తరగతి నౌక అయిన ఈ తారాగిరిని నవంబరు 28, 2025న భారత నావికాదళానికి అప్పగించారు. తొలుత దీనిని 2025 ఆగస్టు నాటికి, ఆ తర్వాత అదే ఏడాది డిసెంబరు నాటికి సేవల్లోకి ప్రవేశపెట్టాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది. కాగా యుద్ధనౌక తారాగిరిని మొదట ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించాలని యోచించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఏప్రిల్‌ 3 (ఎల్లుండి)కి షెడ్యూల్‌ చేశారు.
రక్షణమంత్రి చేతుల మీదుగా..
ఐఎన్‌ఎస్‌ తారాగిరి యుద్దనౌకను భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభిస్తారు. ఇందుకోసం ఆయన శుక్రవారం విశాఖపట్నం వస్తున్నారు. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇకపై ఈ తారాగిరి యుద్దనౌక తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం కేంద్రంగా తన విధులు నిర్వహిస్తుంది. ఇక్కడ నుంచే కదనరంగంలోకి దూకుతుంది.
తారాగిరి పేరు ఎక్కడిదంటే?..
భారతదేశంలోని ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉన్న తారాగిరి పర్వతం పేరును ఈ యుద్ధనౌక తారాగిరికి పెట్టారు. 1980–2013ల మధ్య భారత నావికాదళం సేవల్లో ఉన్న లీండర్‌ క్లాస్‌ ఫ్రిగేట్‌ అయిన ఐఎన్‌ఎస్‌ తారాగిరి పేరును రెండోసారి దీనికి పెట్టారు.
ఐఎన్‌ఎస్‌ తారాగిరి ప్రత్యేకతలివీ..
నీలగిరి క్లాస్‌ గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్‌ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ తారాగిరి. ఇది 6,670 టన్నుల బరువును తీసుకెళ్లగలుగుతుంది. 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు ఉంటుంది. గంటకు 28 నాట్స్‌ (52 కి.మీల) వేగంతో ప్రయాణిస్తుంది. ఈ నౌకలో 32 విమాన విధ్వంసక క్షిపణులు, 8 బ్రహ్మోస్‌ నౌకా విధ్వంసక క్షిపణులు, 8 భూమిపై దాడి చేసే క్రూయిజ్‌ క్షిపణులు, 76 ఎంఎం నావికా ఫిరంగి, ఏకే 630 తుపాకులు ఉంటాయి. అంతేకాదు.. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధానికి అవసరమైన రెండు ట్రిపుల్‌ టార్పెడో ట్యూబ్‌లు (వరుణాస్త్ర), ఆర్బీయూ–6000 జలాంతర్గామి వ్యతిరేక రాకెట్‌ లాంఛర్లు (72 రాకెట్లు), హెచ్‌ఏఎల్‌ ధృవ్‌/సీకింగ్‌ ఎంకే 42బీ హెలికాప్టర్లు ఉంటాయి. ఈ ఐఎన్‌ఎస్‌ తారాగిరి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయి సముద్ర కార్యకలాపాలను నిర్వహించగలుగుతుంది. ఈ నౌక శత్రువుల రాడార్లకు చిక్కని అధునాతన స్టెల్త్‌ సాంకేతికతతో, మెరుగైన ఆయు వ్యవస్థలతో రూపొందించబడింది. ఇది భారత నౌకాళ బలాన్ని, సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.
ఇప్పటికే చేరిన ఉదయగిరి, హిమగిరి..
భారత నావికాదళంలోకి నీలగిరి శ్రేణిలో మొదటి నౌకను గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం గత ఆగస్టులో మరో రెండు నీలగిరి శ్రేణి యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ హిమగిరి చేరాయి. ఈ నౌకలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విశాఖపట్నంలో నేవీలోకి ప్రవేశపెట్టారు. భారత నావికాదళ చరిత్రలో ఒకేసారి రెండు యుద్దనౌకలను ప్రవేశపెట్టడం అదే తొలిసారి. వీటికి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, హిమాలయాల్లోని హిమగిరి పర్వతాల పేర్లను పెట్టారు.
Read More
Next Story