
ఇండోర్ భగీరత్‌పురాలో ఇంటింటి సర్వే..
కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి గుర్తించి ఆసుపత్రులకు తరలిస్తున్న మున్సిపల్ సిబ్బంది..
మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్(Indore)లో కలుషిత తాగునీటి సరఫరా(Water contamination)కు కారణం ఇంకా బయటపడలేదు. అయితే భగీరత్‌పురాలోని ప్రధాన వాటర్ పైపులైన్‌లోకి సెప్టిక్ ట్యాంక్ నీళ్లు చేరడం వల్ల తాగునీరు కలుషితమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కలుషిత నీరు తాగి ఇప్పటికే వందల సంఖ్యలో స్థానికులు వాంతులు,విరేచనాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 354 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 205 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. 149 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో 20 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. ఆరుగురు చనిపోయారని ప్రాధమిక సమాచారం. ఇంకా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.
ఇంటింటి తనిఖీలు..
మరో వైపు మున్సిపల్ అధికారులు ఇంటింటి సర్వే మొదలుపెట్టారు. 5వేల ఇళ్లను తనిఖీ చేశారు. అతిసార లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలను తెలుసుకుంటున్నారు. తేలికపాటి లక్షణాలున్న 65 మందిని గుర్తించి మందులు ఇచ్చామని, 15 మందిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించామని మున్సిపల్ ప్రజారోగ్య వైద్య విభాగం తెలిపింది.
ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా..
భగీరత్‌పురాతో పరిసర ప్రాంత వాసులకు సురక్షిత నీరు అందించేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంచినీళ్ల ట్యాంకర్లను పంపుతోంది. తిరిగి తాము చెప్పేదాకా కుళాయి నీళ్లను ఎవరు తాగొద్దని విజ్ఞప్తి చేశారు. కొంతమంది స్థానికులు మినరల్ వాటర్‌ను కొని తాగుతున్నారు.

