విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
x

విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య; 161 మంది ప్రయాణికులు సురక్షితం..


Click the Play button to hear this message in audio format

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో శనివారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఉదయం 10.29 గంటలకు ఎమర్జెన్సీ ప్రకటించగా, విమానం 10.54 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో సురక్షితంగా ల్యాండ్ అయింది.

విమానంలో మొత్తం 161 మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండ్ అయిన వెంటనే విమాన సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

కాగా ఈ విమానం ఇండిగోది కాదని సమాచారం. టర్కీకి చెందిన కోరెండన్ ఎయిర్‌లైన్స్ నుంచి వెట్-లీజ్ పద్ధతిలో తీసుకున్న బోయింగ్ 737 విమానమని నివేదికలు వెల్లడించాయి. తాత్కాలిక అవసరాల కోసం ఇండిగో ఇలాంటి విమానాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోరెండన్ ఎయిర్‌లైన్స్ నుంచి ఐదు బోయింగ్ 737 విమానాలను ఇండిగో ఉపయోగిస్తోంది.

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్ నుంచి ఫుకెట్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య ఎదుర్కొంది. ముందుభాగం చక్రాలు దెబ్బతినడంతో విమానం రన్‌వేపై నిలిచిపోయి, విమానాశ్రయ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

అలాగే గత నెలలో స్పైస్‌జెట్‌కు చెందిన విమానం లేహ్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజిన్ లోపం తలెత్తడంతో తిరిగి ఢిల్లీకి మళ్లింది. పైలట్ల అప్రమత్తతతో ఆ విమానం కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది.

మొత్తంగా వరుసగా జరుగుతున్న ఈ సాంకేతిక లోపాలు విమానయాన భద్రతపై మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.

Read More
Next Story