
రాజ్యసభలో మాట్లాడుతున్న విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
శాంతి చర్చలకే భారత్ మొదటి ప్రాధాన్యం
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్దంపై కేంద్రమంత్రి స్పందన
పశ్చిమ ఆసియా లో ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. భారత్ శాంతి చర్చలకు , దౌత్యానికి పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు.
ఇరుపక్షాల మధ్య నానాటికి పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో శాంతి, సంభాషణలకు పునః ప్రారంభించాలనేది తమ అభిమతమని ఎస్. జైశంకర్ తెలిపారు. భారత పౌరులు, ఇంధన భద్రత, వాణిజ్యం తమకు అత్యంత ప్రాధాన్యమైనవని ఆయన సోమవారం రాజ్యసభలో చెప్పారు.
ఫిబ్రవరి 28న అమెరికా , ఇజ్రాయెల్ ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సంక్షోభం మొదలైంది. దానికి ప్రతిగా ఇరాన్ గల్ప్ లోని అమెరికా స్థావరాలతో పాటు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది.
“భారత్ శాంతికి మద్దతు ఇస్తుంది. అన్ని పక్షాలు ఉద్రిక్తత తగ్గించి, నియంత్రణ పాటించి, పౌరుల భద్రతను కాపాడాలని కోరుతున్నాం. సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గం” అని ఆయన అన్నారు.
యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల సంక్షేమం , భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్యత అని కూడా ఆయన చెప్పారు. ఇంధన భద్రత , వాణిజ్యం వంటి జాతీయ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమని తెలిపారు.
గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి భారతీయులు ఉపాధి వెతుక్కుంటున్నారు. ఇరాన్‌లో కూడా కొన్ని వేల మంది చదువు లేదా ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు. ఈ కారణంగా ఆ ప్రాంత స్థిరత్వం భారత్‌కు చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్ ప్రాంతం భారత్‌కు ఇంధన సరఫరా చేస్తోంది. అంంతే కాక వాణిజ్యానికి కీలకం. ఈ ప్రాంతంతో భారత్‌కు సుమారు 200 బిలియన్ అమెరికన్ డాలర్ల వాణిజ్యం చేస్తోంది.
ప్రస్తుతం జరిగిన దాడుల నేపథ్యంలో వాణిజ్య నౌకలపై ప్రభావం పడింది. కొంతమంది భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఒక భారతీయ నావికుడి చిరునామా దొరకడం లేదు.
భారత ప్రభుత్వం జనవరి నుంచి ప్రయాణ సూచనలు విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప ఇరాన్‌కు ప్రయాణించవద్దని అప్రమత్తం చేసింది. అక్కడ ఉన్న భారతీయులు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేయాలని సూచించింది.
భారత రాయబార కార్యాలయాలు అక్కడ ఉన్న పౌరులకు సహాయం చేసి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కొంతమంది భారతీయులను అర్మేనియా వంటి పొరుగు దేశాల ద్వారా భారత్‌కు తిరిగి రప్పిస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపు 67,000 మంది భారతీయులు ఆ ప్రాంతం నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ప్రభుత్వం అదనపు వాణిజ్య విమానాలు ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితిని గమనించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియంత్రణ గదిని ఏర్పాటు చేసింది. భారత నావికులకు సహాయం చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ప్రత్యేక బృందాన్ని కూడా రంగంలో దింపింది.
ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, జోర్డాన్ ,ఇజ్రాయెల్ నాయకులతో మాట్లాడారు. అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై వారు భరోసా ఇచ్చారు.
భారత్ అమెరికా , ఇరాన్‌తో కూడా దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫిబ్రవరి 28, మార్చి 5 తేదీలలో చర్చించారు. మార్చి 4న కొన్ని కారణాల వల్ల ఇరాన్ నౌకను కొచ్చి పోర్టులో నిలిపేసారు. భారత్ దీనికి అనుమతి ఇచ్చిందని కూడా ఆయన సభకు తెలిపారు.
ప్రస్తుతం పరిస్థితి అస్థిరంగా ఉంది. అయినప్పటికీ , భారత్ తన ఇంధన భద్రత , ఆర్థిక ప్రయోజనాలను రక్షించేందుకు కట్టుబడి ఉందని కేంద్రమంత్రి అన్నారు.
Next Story

