బంగ్లాదేశ్‌లా భారత్‌కూ జీరో సుంకం ..
x

బంగ్లాదేశ్‌లా భారత్‌కూ జీరో సుంకం ..

బంగ్లాదేశ్ తరహాలోనే అమెరికా మార్కెట్‌లో భారత వస్త్రాలకూ జీరో సుంకం ఉంటుందన్న కేంద్ర వాణిజ్య మంత్రి ..


Click the Play button to hear this message in audio format

అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్‌కు ఇచ్చినట్లే భారత్‌కూ వస్త్రాలపై జీరో సుంకం (Zero Duty) విధించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అమెరికా పత్తి లేదా మానవ నిర్మిత ఫైబర్‌తో తయారు చేసే వస్త్రాలకు ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పారు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మెరుగైన నిబంధనలు పొందిందన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గోయల్ ఖండించారు. “భారత్‌కూ అదే వెసులుబాటు కల్పించారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైన తర్వాత స్పష్టత వస్తుంది” అని విలేకరులతో అన్నారు. పార్లమెంట్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాహుల్‌పై విమర్శలు కూడా చేశారు గోయల్.


SBI రీసెర్చ్ ఏమంటోంది?

SBI పరిశోధన నివేదిక ప్రకారం..అమెరికా భారత్‌ నుంచి సుమారు 7.5 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను దిగుమతి చేసుకుంటోంది. బంగ్లాదేశ్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్‌కు అమెరికా పత్తితో తయారు చేసిన వస్త్రాలకు జీరో సుంకం నిబంధన ఇవ్వడం భారత ఎగుమతిదారులకు పోటీగా మారే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.


భారత వస్త్ర రంగంపై ప్రభావం..

భారత వస్త్ర ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్. మొత్తం ఎగుమతుల్లో దాదాపు 30 శాతం అక్కడికే వెళ్తాయి. ఇటీవల అమెరికా సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో భారత ఎగుమతిదారులకు లాభం కలిగింది. కానీ బంగ్లాదేశ్ కూడా తన సుంకాలను 19 శాతానికి తగ్గించుకోవడంతో ఆ ప్రయోజనం కొంత తగ్గింది.


జీరో డ్యూటీ నిబంధనపై ఆందోళన..

బంగ్లాదేశ్ అమెరికా పత్తిని ఉపయోగించి తయారు చేసిన వస్త్రాలకు జీరో సుంకం ఇవ్వడం ఆందోళనగా మారింది. దీనివల్ల బంగ్లాదేశ్ వస్త్రాలు అమెరికా మార్కెట్‌లో తక్కువ ధరకు అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్‌కు ప్రధాన పత్తి సరఫరాదారుల్లో ఒకటిగా ఉండటంతో, ఈ మార్పులు భారత ఎగుమతిదారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి సౌకర్యం భారత్‌కూ లభిస్తే దేశీయ వస్త్ర రంగానికి ఊరట లభిస్తుందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

Read More
Next Story