
పెట్రోల్ పై టాక్స్ తగ్గింది సరే, జనానికి ఉపయోగమేంటీ?
డీలర్లకు తప్ప కస్టమర్లకు పెద్దగా ఉపయోగం ఉండదా!
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సామాన్య వినియోగదారుడికి ఏమి లాభం ఉంటుందన్న విషయం ఇంకా స్పష్టత రాలేదు. బంకుల వద్ద ధరల్లో తక్షణ ఉపశమనం ఏమి ఉండబోదనే వాదనలున్నాయి. చమురు విక్రయ సంస్థల (ఓఎంసీ) నష్టాలను పూడ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించింది. గతంలో లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి బదిలీ కావడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకోవడానికి, చమురు సంస్థల ఆర్థిక రికవరీకి సహాయపడటానికే ఈ సుంకాల కోత ఉపయోగపడనుంది.
నయారా ఎనర్జీ ధరలు ఎందుకు పెరిగాయి?
దేశంలో ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపై ధరల భారాన్ని మోపింది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన సేకరణ ఖర్చులను భర్తీ చేసేందుకు పెట్రోల్ లీటరుకు రూ.5 పెంచింది. డీజిల్ లీటరుకు రూ.3 పెంచింది. రోస్‌నెఫ్ట్ మద్దతు గల ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన 6,967 ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ పెంపును అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉండే వ్యాట్ వ్యత్యాసాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.5.30 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించగా.. డీజిల్‌పై రూ.10ని పూర్తిగా తొలగించిందని ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ పేర్కొంది.
Next Story

