
NO-CONFIDENCE | రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాసం?
రాజ్యసభ ఛైర్మన్, ఇండియా కూటమి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. డిసెంబర్ 9న రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్‌కి విపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.
రాజ్యసభ ఛైర్మన్, విపక్షాల ఇండియా కూటమి(INDIA Alliance) మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. డిసెంబర్ 9న రాజ్యసభలో ఛైర్మన్(RAJYA SABHA CHAIRMAN) జగదీప్ ధన్కడ్(JAGADEEP DHANKAR)కి విపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో జగదీప్ ధన్కడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి నిర్ణయించిట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ధన్కడ్ ను ఆ పదవి నుంచి తొలగించే ఈ తీర్మానానికి నోటీసు ఇవ్వాలంటే కనీసం 50 మంది సభ్యులు సంతకాలు పెట్టాలి. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పిటిఐ వార్త సంస్థ పేర్కొంది.
విపక్ష పార్టీల సభ్యులకు రాజ్యసభ ఛైర్మన్ ధన్కడ్ మాట్లాడేందుకు అసలు అవకాశం ఇవ్వకుండా ఆయనే ప్రభుత్వపాత్ర పోషిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఆగస్టులోనే 50 మంది సంతకాలతో నోటీసు తయారు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఆ నోటీసునే ఇస్తారా లేక కొత్తగా అవసరమైన సంతకాలను సేకరిస్తారా అనే దానిపై స్పష్టత రాలేదు. ధన్కడ్ కి "మరో అవకాశం" ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC), సమాజ్‌వాదీ పార్టీ, AAP, ఇతర ఇండియా కూటమి పార్టీల మద్దతుతో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) కింద విపక్షాలు ఈ మేరకు నోటీసు ఇవ్వవచ్చు. ఈ ఆర్టికల్ వైస్ ప్రెసిడెంట్‌ను తొలగించే ప్రక్రియకు సంబంధించింది. నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల లోపల చర్చకు చేపట్టాలి.
మరోవైపు పార్లమెంటు ఉభయ సభలు సోమవారం ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే డిసెంబర్ 10వ తేదీకి వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలకు సోమవారం అంతరాయం కలగడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఆసియా-పసిఫిక్ డెమోక్రటిక్ లీడర్స్ ఫోరమ్ (ఎఫ్‌డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ నాయకులకు సంబంధాలు ఉన్నాయని, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నుంచి ఎఫ్డీఎల్-ఏపీకి ఆర్థిక సాయం అందుతోందని సభా నాయకుడు జెపి నడ్డా ఆరోపించడంతో సభలో గొడవ మొదలైంది. ఆ తర్వాత ఆ వివాదం తారాస్థాయికి చేరింది. ఎఫ్‌డిఎల్-ఎపి, బిలియనీర్ జార్జ్ సోరోస్ మధ్య సంబంధాలు ఉన్నాయని నడ్డా ఆరోపించారు. ఈ ఆరోపణనను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
ఈ ఆరోపణలపై చర్చకు బిజెపి సభ్యులు పట్టుబట్టారు. విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ఎందుకు నిరసన తెలుపుతున్నారో చెప్పాలని చైర్మన్ ధన్కడ్ విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య దేశ భద్రతతో ముడిపడి ఉందని, తక్షణమే చర్చించాలని పలువురు బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు వాదించారు. అయితే అదానీ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు అధికార పక్షం వేసిన ఎత్తుగడగా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ, ఇండియా కూటమి సభ్యుల మధ్య ఈ వ్యవహారమై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణల నుంచి దృష్టి మరల్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సభ్యుడు రమేష్ ఆరోపించారు. విపక్ష సభ్యులు కూడా అధికార పక్ష బీజేపీ సభ్యులతో పరస్పరం వాదనలకు దిగారు. విపక్ష సభ్యులు మాట్లాడేందుకు రాజ్యసభ ఛైర్మన్ అనుమతి ఇవ్వలేదు. ఈ తీరుపై విపక్షాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్కడ్ (Jagdeep Dhankar)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రాజ్యసభలోని 'ఇండియా' (INDIA) కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తీర్మానంపై ఇంతవరకూ 50 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు కూడా చెబుతున్నారు. రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలుస్తోంది. ''అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) సిద్ధమైంది. 50 మంది ఎంపీలు కూడా సంతకాలు చేశారు. దీనిపై చర్చలు సైతం జరుగుతున్నాయి'' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో మాట్లాడేందుకు తమకు సమయం కేటాయించే విషయంలో జగ్‌దీప్ ధన్‌ఖఢ్ వివక్ష చూపుతున్నారని, తాము మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారని విపక్ష నేతల అభియోగంగా ఉంది. కేవలం అధికార పక్షం (ట్రెంజరీ బెంచ్) మాట్లాడేందుకే అవకాశం ఇచ్చి, విపక్ష నేతలకు ఏమాత్రం సమయం ఇవ్వక పోవడమే కాకుండా వారికి క్లాస్ తీసుకుంటారని వారు ఆరోపిస్తున్నారు.