అక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్న భారత్..
x

అక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్న భారత్..

భారత్- మాల్దీవులలో మోహరించిన తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. చివరి బ్యాచ్ సైనికులు స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.


మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మెయిజ్జు విధించిన మే 10 గడువుకు ముందే భారత్ తన సైన్యాని మాలే నుంచి విరమించుకుంది. దీనిపై భారత్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

చైనా అనుకూల నాయకుడిగా ముద్రపడ్డ మొయిజ్జు ఆది నుంచి భారత వ్యతిరేకిగానే పేరుపొందాడు. ఇప్పటికే ‘ఇండియా అవుట్’ పేరిట క్యాంపెన్ ప్రారంభించి ఆ దేశ పార్లమెంట్ లో పూర్తి అధికారం సాధించిన అతను.. ఎన్నికల సమయంలోనే మాల్దీవుల్లో ఉన్న 90 మంది భారత సైనికులను తిరిగి పంపిస్తానని వాగ్ధానం చేశాడు. దీనిపై భారత ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.
మాల్దీవుల్లో ఉన్న చివరి బ్యాచ్ భారత సైనికులను స్వదేశానికి రప్పించినట్లు భారత ప్రభుత్వ ప్రతినిధి హీనా వలీద్ ధృవీకరించారు, భారత సైనికుల సంఖ్యను మాత్రం ఆమె ధృవీకరించలేదు. రాష్ట్రపతి కార్యాలయ ప్రధాన ప్రతినిధి Sun.mv న్యూస్ పోర్టల్‌తో విషయం మాత్రం చెప్పారు. సైనికుల సంఖ్య వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఆమె తెలిపారు.
భారతదేశం గతంలో బహుమతిగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిర్వహించడానికి భారత సైనిక సిబ్బంది మాల్దీవులలో ఉన్నారు. వీరిలో 51 మంది సైనికులను సోమవారం స్వదేశానికి తరలించినట్లు మాల్దీవుల ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అధికారిక పత్రాలను ఉటంకిస్తూ మాల్దీవులలో 89 మంది భారతీయ సైనికులు ఉన్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మే 10లోపు మిగిలిన భారత సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్, మాల్దీవులు అంగీకరించాయి.
గురువారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, మొదటి, రెండవ బ్యాచ్‌ సైనిక బృందాలు భారత్ కి తిరిగి వచ్చారని, మూడు భారతీయ విమానయాన ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహించడానికి "ఇప్పుడు సమర్థులైన భారతీయ సాంకేతిక సిబ్బందిని నియమించడం జరిగింది" అని అన్నారు.
మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్‌లో పర్యటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆయన గురువారం విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ భద్రతా సమస్యలపై వారు "విస్తృతమైన చర్చలు" జరిపారు, ద్వీప దేశంలో భారత్ సైనికులను మోహరించడం, వాటిని తిరిగి వెనక్కి పంపమని అధ్యక్షుడు పట్టుబట్టడంతో రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
మాల్దీవులు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి కీలకమైన పొరుగు దేశం మరియు మోదీ ప్రభుత్వం 'సాగర్' (ఈ ప్రాంతంలోని అందరికీ భద్రత, వృద్ధి) 'నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ' వంటి దాని కార్యక్రమాలలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది.
మాల్దీవులకు భారీగా తగ్గిన టూరిస్టులు..
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించిన సందర్భంగా అక్కడ జరిగిన సంఘటనలు, ప్రకృతి అందాలను సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో మాల్దీవుల మంత్రులు అనవసరంగా స్పందించి నోరు పారేసుకున్నారు.
దీనిపై భారతీయులు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తూ మాల్దీవులకు బుక్ చేసుకున్న తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. మాల్దీవుల ఎకానమీ మొత్తం టూరిజం పైనే ఆధారపడి ఉంది. అంతకుముందు మాల్దీవులను సందర్శించే టూరిస్టుల జాబితాలో భారతీయులు ముందు వరుసలో ఉండగా వివాదం తరువాత ఆరో స్థానానికి పడిపోయారు.
ఏకంగా 45 శాతం మేర పర్యాటకులు భారత్ నుంచి తగ్గిపోయారు. దీనిపై అక్కడి హోటల్ సమాఖ్య, విదేశీ రాయబార శాఖలు ఎంత ప్రయత్నించిన ఇక్కడి నుంచి పర్యాటకులను రప్పించలేకపోతున్నారు. ఇప్పటికి కూడా అక్కడి వెళ్లే భారతీయులు దాదాపు సంవత్సరం నుంచి ఆరు నెలల క్రితం టికెట్లు బుక్ చేసుకున్నావారే కావడం గమనార్హం. కొత్తగా ఎటువంటి బుకింగ్స్ రాకపోవడంతో వారంతా కంగారుపడుతున్నారు. దీనికి బదులుగా భారతీయులు ఎక్కువగా అండమాన్, లక్షద్వీప్ లో సేదతీరుతున్నారు.
Read More
Next Story