
అమరావతిలో ముందు రాయితీలు... ఆ తరువాతే నిర్మాణాలు
రాజధాని పరిధిలో మాలక్ష్మి వన్ హోటల్ ప్రాజెక్టు కు ప్రభుత్వం ముందే రాయితీలు... పనులు ఎప్పుడో!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యాటక హబ్‌గా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చర్చనియాంశమవుతున్నాయి. ముఖ్యంగా మందడం పరిధిలో ఏర్పాటు చేయబోతున్న 'మాలక్ష్మి వన్' హోటల్ ప్రాజెక్టుకు పనులు ప్రారంభం కాకముందే భారీ రాయితీలు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. డబుల్ ట్రీ బై హిల్టన్ బ్రాండ్ కింద రూ.330 కోట్ల పెట్టుబడితో నిర్మాణం చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు ద్వారా 372 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే ప్రభుత్వం ఎందుకు ఇంత తొందరపడుతోంది? ఈ హోటల్ యజమానులు ఎవరు? ఇలాంటి ప్రశ్నలు పలువురిలో ఉత్కంఠ రేపుతున్నాయి.
ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అకాసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోరిక మేరకు జీవో నెం.14 జారీ చేశారు. ఇందులో 100 శాతం ఎస్‌జిఎస్‌టి తిరిగి చెల్లింపు (కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 12 ఏళ్లు, సొంత భూమి కావడంతో మరో ఏడాది కలిపి మొత్తం 13 సంవత్సరాలు), మొత్తం పెట్టుబడిలో 10 శాతం (గరిష్టంగా రూ.25 కోట్లు) రాయితీ (ఐదు వార్షిక వాయిదాల్లో), స్టాంప్ డ్యూటీ పూర్తి మినహాయింపు, ఐదేళ్లపాటు పారిశ్రామిక రేట్లకు విద్యుత్ సరఫరా, విద్యుత్ సుంకం రీయింబర్స్‌మెంట్ వంటివి ఉన్నాయి. ఇవి 2024-29 ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీలో భాగం.
ఎందుకు ఇంత రిస్క్?
ప్రభుత్వం ఈ రాయితీలు ముందుగా ప్రకటించడానికి ప్రధాన కారణం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి, అమరావతిని ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మార్చడం. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024-29 ప్రకారం హోటల్స్, రిసార్ట్స్ వంటి ప్రాజెక్టులకు 'ఇండస్ట్రీ స్టేటస్' ఇచ్చి, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. ఇలాంటి రాయితీలు ఇతర ప్రాజెక్టులకు కూడా ఇచ్చారు. ఉదాహరణకు దస్‌పల్లా అమరావతి హోటల్స్, సదరన్ గ్లోబ్ హోటల్స్, వీఎస్‌కే హోటల్స్ వంటివి. ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి, ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లు పెరగడం వంటి లాభాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పనులు ప్రారంభం కాకముందే రాయితీలు ఇవ్వడం వల్ల రిస్క్ ఉందని విమర్శకులు అంటున్నారు. ప్రాజెక్టు పూర్తి కాకపోతే ప్రజాధనం వృథా అవుతుందని ఆందోళన ప్రజల్లో ఉంది.
హోటల్ యజమానులు ఎవరు?
ఈ ప్రాజెక్టు అకాసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మాణం చేపట్టబోతోంది. ఇది మాలక్ష్మి ఇన్‌ఫ్రా వెంచర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, 100 శాతం సబ్‌సిడరీ కంపెనీ. మాలక్ష్మి ఇన్‌ఫ్రా వెంచర్స్ డైరెక్టర్లు సందీప్ మండవ (మేనేజింగ్ డైరెక్టర్), తేజస్విని యార్లగడ్డ, వెంకట కామ దీక్షితులు వంటి వారు. సందీప్ మండవ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడు. నారెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తేజస్విని యార్లగడ్డ చరిత్రకారిణి, హైదరాబాద్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్, సామాజిక చరిత్రపై పీహెచ్‌డీ చేశారు. అకాసియా డైరెక్టర్లలో రావుల శశి, అజయ్ కుమార్ వీరమాచనేని వంటి వారు ఉన్నారు. రావుల శశి 21 కంపెనీలతో సంబంధం కలిగి ఉన్నారు. అజయ్ కుమార్ ఇన్‌ఫ్రా, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో 7 కంపెనీలతో అనుబంధం కలిగి ఉన్నారు.
ఈ ప్రాజెక్టు 2018లో అమరావతి అథారిటీ తీర్మానం నెం.234/2018 ప్రకారం మహాలక్ష్మి ఇన్‌ఫ్రా వెంచర్స్‌కు భూమి కేటాయించారు. 2025 ఆగస్టు 25న పేరును అకాసియాగా మార్చి జీవో నెం.869 జారీ చేశారు. ప్రభుత్వం ఈ చర్యలతో అమరావతిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చాలనుకుంటోంది. కానీ విమర్శకులు మాత్రం పారదర్శకత లోపం, అనవసర రిస్క్ అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు ఎలా సాగుతాయో చూడాలి.

