రాజకీయాలకతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల ప్రకటనను స్వాగతిస్తున్నామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామి రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటిని సద్వినియోగం చేసుకుందాం అంటూనే, “రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన ప్రయోజనం లేదు” లేదా “పోలవరం–నల్లమలతోనే సీమ సస్యశ్యామలం” వంటి ప్రకటనలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న సందర్భంలో ఆదివారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటిని సద్వినియోగం చేసుకుందాం లాంటి ప్రకటనలు గత ప్రభుత్వంలో కూడా వచ్చినప్పటికీ కార్యాచరణ లేకపోయిందని గుర్తు చేస్తూ, ఈసారి అయినా రెండు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ జరుగుతుందని బొజ్జా ఆశాభవం వ్యక్తపరిచారు.
శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాలను కఠినంగా అమలు చేయకుండా గోదావరి జలాలను ఎటు మళ్లించినా రాయలసీమకు ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని నిరంతరం దిగువకు వదిలే విధానాన్ని తక్షణమే నిలిపివేసి, నాగార్జునసాగర్‌కు కేటాయించిన నీటితో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలనే నిబంధనను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మిగిలిన నీటిని శ్రీశైలంలో నిల్వ ఉంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ అవసరాలకు వినియోగించాలన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో పూడిక కారణంగా ఇప్పటికే సుమారు 90 టీఎంసీల నిల్వ సామర్థ్యం తగ్గిందని, భవిష్యత్‌లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంతో పూడిక నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. నికర జలాల హక్కులు ఉన్న తుంగభద్ర దిగువ కాలువ (ఎల్ ఎల్ సి ), కేసీ కెనాల్, తెలంగాణలోని ఆర్డీఎస్ ప్రాజెక్టు స్థిరీకరణ కోసం గుండ్రేవుల రిజర్వాయర్ డిపిఆర్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు పొందిన విషయాన్ని గుర్తు చేస్తూ, రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు కీలకమైన ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందేందుకు అవసరమైన అనుబంధ పనులకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు, కుంటల పునరుద్ధరణ అత్యంత కీలకమని పేర్కొంటూ, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక నిధులను రాయలసీమలోనే పూర్తిగా వినియోగించాలని డిమాండ్ చేశారు. ఈ నిధులను “పోలవరం - నలమల సాగర్”, “పూర్వోదయ”, తదితర ప్రాజెక్టులకు మళ్లించడం సరికాదని స్పష్టం చేశారు.
“రాయలసీమ ఎత్తిపోతల పథకం వలన ప్రయోజనం లేదు” లేదా “పోలవరం–నల్లమలతోనే సీమ సస్యశ్యామలం” వంటి ప్రకటనలను పక్కనబెట్టి, ముందుగా శ్రీశైలం విధి విధానాల అమలు, గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందేలాగా అనుబంధ సాగునీటి పనులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి బొజ్జా దశరథ రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు యర్రం శంకర్ రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, మహేశ్వరరెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.