
పేదల ప్రాణాలు బలి తీసుకున్న అక్రమ షెడ్ల మందుల ‘ఫ్యాక్టరీ’
వేట్లపాలెం గాయం... రాష్ట్రానికి హెచ్చరిక!
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌కు ఒక్కటే లైసెన్స్. 2026 మార్చి 31 వరకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్. కానీ... పొలాల్లో ‘ఏడు ప్రాంతాల్లో షెడ్లు’ వేసి మందులు (ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్) తయారు చేస్తున్నారు. ఇది పూర్తి అక్రమం. బాణసంచా తయారీకి కఠిన నిబంధనలు ఉన్నా అనుమతులు లేకుండా ఓపెన్ ఫీల్డ్‌లో షెడ్లు నిర్మించి, 50 మంది కార్మికులు (ఎక్కువ మంది మహిళలు) పని చేయించారు. భోజనానికి వెళ్లిన కొందరు కార్మికులు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు.
తయారీ కేంద్రంలో 4 షెడ్లు (మిక్సింగ్ యూనిట్, డ్రైయింగ్, మేకింగ్, ముడిసరకు నిల్వ) ఉండి, వాటిలో రెండుచోట్ల మాత్రమే నలుగురు చొప్పున కూలీలు ఉండాలి. తయారైన బాణసంచాను అక్కడ నిల్వ ఉంచకూడదు. దాదాపు ఎకరన్నర విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రంలో ఏడు షెడ్లుండగా, పేలుడు ధాటికి నాలుగు నేలమట్టమయ్యాయి. మిగతావి దెబ్బతిన్నాయి. బాణసంచా నిల్వలు భారీగా ఉండడం వల్లే తీవ్రత పెరిగింది.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం. గోదావరి కెనాల్ పక్కన పచ్చని వరి పొలాల మధ్య ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ కేంద్రం. ఫిబ్రవరి 28, 2026 మధ్యాహ్నం 2 గంటల సమయం. ఒక్కసారిగా భారీ పేలుడు. ఆకాశాన్ని చీల్చే శబ్దం. 5 కిలోమీటర్ల మేర వినిపించిన ఆ ధ్వని... పక్కనే ఉన్న పాఠశాల స్లాబ్‌లకు పగుళ్లు. మంటలు ఆకాశం అంటుకున్నాయి. పొగ దట్టంగా కమ్మేసింది. మృతదేహాలు, శరీర భాగాలు పొలాల్లో చెల్లాచెదురుగా పడి... ఆ ప్రాంతం భయానక యమపురి అయిపోయింది.
ఈ ఘోరం అక్రమ సంపాదన ఫలితం!
ఇంత భారీ స్థాయిలో అక్రమ తయారీ జరుగుతుంటే... రెవెన్యూ, పోలీసు, లేబర్, ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ఎందుకు తెలియదు? స్థానికులు చెబుతున్న ప్రకారం “వారు వాహనాలు కూడా షెడ్ల వద్దకు చేరే అవకాశం సరిగా లేదు. పొలాల మధ్యన ఉండటం వల్ల సమయానికి చేరుకునే అవకాశం లేకుండా పోయింది” అని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కొందరు అధికారులు ‘‘బల్లకింద చేతులు పెట్టి’’ గుర్తింపు లేని షెడ్లను వెలిగించార బాధిత కుటుంబాల వారు బోరుమంటున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు... అవినీతి ఫలితం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నలుగురు అధికారులు సస్పెండ్
సీఎం చంద్రబాబు స్వయంగా ఘటనా స్థలం సందర్శించి, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వెంటనే ‘‘నలుగురు అధికారులను సస్పెండ్’’ చేశారు. సస్పెన్ష్ కు గురైన వారిలో...
RDO (Revenue Divisional Officer): S. మల్లిబాబు
DSP (Deputy Superintendent of Police): మనీష్ దేవరాజ్
జిల్లా లేబర్ అధికారి (District Labour Officer): P. శ్రీనివాస్
ఫైర్ అధికారి (Fire Officer): సాయికృష్ణ రాజేష్
‘బంధనలు ఉల్లంఘించిన వారెవరైనా వదిలిపెట్టేది లేదు. యజమాని ఆస్తులు జప్తు చేసి బాధితులకు అప్పగిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు. యజమాని ‘అడపా నాని (అడబాల వీరబాబు)’ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు.
మృతులు... ఎస్సీ, బీసీ పేద కుటుంబాలే!
ఈ విషాదంలో ‘20 మంది’ సజీవ దహనమయ్యారు. వారిలో ఎక్కువ మంది ‘ఎస్సీ (మాదిగ), బీసీ-డి (యాదవ, కొప్పుల వెలమ, తూర్పు కాపు)’ కులాలకు చెందినవారు. పేద కూలీలు. ప్రభుత్వం విడుదల చేసిన మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.
| సీరియల్ నం. | పేరు | వయసు | బంధువు వివరాలు | క్యాటగరీ/కులం | ఊరు |
| 1 | గంధి మంగ | 43 | భర్త: వీరబాబు | BC-D (కొప్పుల వెలమ) | వేట్లపాలెం |
| 2 | వల్లూరి రవి | 35 | తండ్రి: చిట్టిబాబు | SC (మాదిగ) | వేట్లపాలెం |
| 3 | కడింపల్లి కృపమ్మ | - | భర్త: సత్యనారాయణ | - | - |
| 4 | గంపల మంగ | - | భర్త: నాగరాజు గోపి | - | జి.మేడపాడు |
| 5 | గంపల నాగరాజు గోపి | - | - | - | జి.మేడపాడు |
| 6 | బిక్కిన కరుణ సుబ్బారావు | 45 | తండ్రి: కామేష్ | OC (కమ్మ) | వేట్లపాలెం |
| 7 | సాధనాల సత్యవేణి | 44 | భర్త: శ్రీను | BC-D (యాదవ) | వేట్లపాలెం |
| 8 | గోదత నాని | 26 | తండ్రి: రమణ | SC (మాదిగ) | వేట్లపాలెం |
| 9 | తుంపల లోవ | 38 | భర్త: రాము | BC-D (తూర్పు కాపు) | దుర్గానగర్, వేట్లపాలెం |
| 10 | చింతల రమణ | 60 | తండ్రి: అప్పారావు | BC-D (కొప్పుల వెలమ) | - |
| 11 | మండపల్లి చిన్ని | 44 | భర్త: కొండబాబు | SC (మాదిగ) | గుడపర్తి |
| 12 | గోదత మహేష్ | 41 | తండ్రి: అన్నవరం | SC (మాదిగ) | గుడపర్తి |
| 13 | దర్శిపాటి నాని | 38 | తండ్రి: అప్పారావు | SC (మాదిగ) | కుమ్మరి వీధి, సామర్లకోట |
| 14 | ఏడిద సంపత్ కుమార్ | 25 | తండ్రి: పోతురాజు | SC (మాదిగ) | కుమ్మరి వీధి, సామర్లకోట |
| 15 | నుకెళ్ళ దేవి | 45 | భర్త: వెంకటరమణ | BC-B (పద్మశాలి) | వేట్లపాలెం |
| 16 | గోదత వీర వెంకట రమణ | 48 | తండ్రి: సింహాచలం | SC (మాదిగ) | గుడపర్తి |
| 17 | కడింపల్లి ధనరాజు | 55 | తండ్రి: భోగయ్య | SC (మాదిగ) | గుడపర్తి |
| 18 | సాకుమళ్ళ రాఘవ | 50 | భర్త: జగ్గారావు | OC (కాపు) | వేట్లపాలెం |
| 19 | అడబాల శ్రీనివాసరావు | 55 | - | BC-D (తూర్పు కాపు) | వేట్లపాలెం |
| 20 | మాకర రాఘవమ్మ | 55 | భర్త: తాతయ్య | BC-D (తూర్పు కాపు) | - |
గాయపడిన 11 మందిలో 9 మంది పరిస్థితి విషమం
50 శాతం కాలిన వారు కూడా చనిపోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు కప్పా వెంకటలక్ష్మి (వేట్లపాలెం), మోర్తా శ్రీను (పెద్దాపురం), కె.శ్రీను (సామర్లకోట), చిటికెల లక్ష్మి చావుతో పోరాడుతున్నారు.
“ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం కన్నీరు తుడవదు. ఇది మనుషుల జీవితాలతో ఆడుకున్న ఫలితం.” ప్రతి బాధిత కుటుంబానికి రూ. 50వేలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఈ ఘటన కేవలం ఒక పేలుడు కాదు. బాణసంచా పరిశ్రమలో జరుగుతున్న అక్రమాలు, అధికారుల అవినీతి, పేదల జీవితాలతో ఆట ఆడుతున్న లాభాల వేట ఫలితం. వేట్లపాలెం గాయం మానదు... కానీ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేయాలి. అనుమతులు కఠినతరం చేయాలి. అక్రమ షెడ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే... ఇంకా ఎన్ని కుటుంబాల కన్నీరు చూడాల్సి వస్తుందోననే ఆవేదన బాధితుల్లో ఉంది.

