ఐఎఫ్‌ఆర్‌ వేళ.. స్వచ్ఛ విశాఖ ఇలా..!
x
టీఎస్సార్‌ కాంప్లెక్స్‌లో షాపు ముందు వేసిన చెత్త

ఐఎఫ్‌ఆర్‌ వేళ.. స్వచ్ఛ విశాఖ ఇలా..!

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐఎఫ్‌ఆర్, మిలాన్, ఐయాన్స్‌కు సిద్ధమైన విశాఖలో జీవీఎంసీ నిర్లక్ష్యం ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుతోంది.


పై ఫోటోలను చూశారా? ఆ చెత్త పోగులు ఎక్కడో అనుకుంటున్నారా? కానే కాదు.. విశాఖ నడిబొడ్డులో.. అదీ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు అత్యంత సమీపంలోని ఓ వాణిజ్య సముదాయంలో.. నగరంలో చెత్త సర్వసాధారణమే అనుకోవచ్చు. నిజమే.. ఇప్పుడలా అనుకోవడానికి వీల్లేదు. విశాఖకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టే మూడు అంతర్జాతీయ వేడుకలకు వైజాగ్‌ వేదికైంది. ఈ ఘనమైన వేడుకల కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ విదేశాల నుంచి 400 మందికి పైగా అతిరథ మహారథులు విశాఖకు విచ్చేస్తున్నారు. అందుకోసం దాదాపు రెండు నెలల నుంచి విశాఖ నగరాన్ని అందంగా తీర్చి దిద్దుతున్నారు. రోడ్లను శుభ్రం చేస్తున్నారు. రోడ్డు పక్కన బతికే చిరు వ్యాపారులను ఇదివరకే ఏరి పారేశారు. వారు ఏర్పాటు చేసుకున్న షెడ్లు/దుకాణాలను ప్రొక్లెయిన్లతో నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. సిటీ బ్యూటిఫికేషన్‌ పేరిట డివైడర్లకు రంగులు బాగున్నా మళ్లీ సరికొత్తగా వేస్తున్నారు. రోడ్ల వెంబడి గోడలపై అందమైన బొమ్మలు వేస్తున్నారు. ఇలా రూ.వందల కోట్లను మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు.


ఐఎఫ్ఆర్ జరిగే వైజాగ్ బీచ్ రోడ్ లో ఎంగిలి ఆకుల సోయగం

ఐఎఫ్‌ఆర్‌కు అతిరథ మహారథులు వస్తున్న వేళ..

నగరంలో ఈనెల 16 నుంచి 25 వరకు పది రోజుల పాటు ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌), మల్టీలాటరల్‌ నేవల్‌ ఎక్సర్‌సైజెస్‌ (మిలాన్‌), ఇండియన్‌ ఓషన్‌ నేవల్‌ సింపోజియం (ఐయాన్స్‌) సిటీ పెరేడ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 18న జరిగే ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనడానికి సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం విశాఖ విచ్చేస్తున్నారు. ఇంకా సుమారు 50 దేశాలకు చెందిన అతిథులు, ఆయా రక్షణశాఖల ప్రతినిధులు వస్తున్నారు. ఈ అతిథులు విశాఖ సహా, సమీపంలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా జీవీఎంసీ సిబ్బంది, అధికారుల తీరు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి స్టేషన్‌ రోడ్డుకు వెళ్లే దారిలో కుళ్లిన చెత్త ఇలా..

నడిబొడ్డున 3,4 రోజులుగా..

విశాఖ ద్వారకానగర్‌ బస్‌ కాంప్లెక్స్‌ నుంచి 150 మీటర్ల దూరంలో రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారికి ఆనుకుని టీఎస్‌ఆర్‌ (టౌన్‌ సర్వీస్‌ రిజర్వాయరు) వాణిజ్య సముదాయం ఉంది. ఆ సముదాయంలో కొన్ని మూతపడ్డ షాపుల బయట, రోడ్డుపైన నిల్వ ఉన్న ఆహారం, ఇతర చెత్తను అక్కడే పడేస్తున్నారు. దీంతో ఆ దారిన వెళ్లే వారికి అల్లంత దూరం నుంచే దుర్గంధం వెదజల్లుతోంది. అయినా జీవీంఎసీ సిబ్బందికి అదేమీ కనిపించలేదు. ఆ పక్కనే బంగారం, వస్త్ర దుకాణాలు, జ్యూస్‌ షాపులు ఉన్నాయి. మూడు నాలుగు రోజుల నుంచి అక్కడే నిల్వ ఆహారాన్ని చెత్తను డంప్‌ చేస్తున్నారని, సోమవారం రాత్రి కూడా మరికొంత తెచ్చి వేశారని సమీపంలో షాపులకు కాపలాగా ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధికి చెప్పాడు. అక్కడకు చేరువలోనే ఉన్న జీవీఎంసీ స్వీపర్‌ను ప్రశ్నించగా.. రోడ్లను తుడవడమే తప్ప చెత్తను తొలగించే పని తమది కాదని తేల్చి చెప్పాడు. (కంపు కొడుతున్న అక్కడి చెత్త పోగుల ఫోటోలను ఈ ప్రతినిధి మంగళవారం ఉదయం 6.40 గంటల సమయంలో తీసినవి)

ముక్కున వేలేసుకుంటున్నారు..

ఆ షాపుల సముదాయానికి ఆనుకుని ఉన్న రోడ్డు మీదుగా గంటకు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడకు దూరం నుంచే వీరు ముక్కు మూసుకుంటూ వెళ్తున్నారు. విశాఖ మహా నగరంలో అంతర్జాతీయ వేడుకలు జరుగుతున్న వేళ స్వచ్ఛ విశాఖలో జీవీఎంసీ నిర్లక్ష్యాన్ని కళ్లారా చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
Read More
Next Story