
ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న యుద్ధ నౌకల విన్యాసాలు
విశాఖ తీరంలో ఐఎఫ్‌ఆర్ అదరహో!
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లో మధురానుభూతులను విశాఖ వాసులకు బుధవారం కలిగింది.
మనలో ఎవరైనా ఒకట్రెండు యుద్ధనౌకలను చూసినా ఔరా! అని మురిసిపోతాం. అలాంటిది అరవై డెబ్భై వార్ షిప్‌లు మన కళ్లెదుటే దర్శనమిస్తే? ఆ ఊహే ఒక అద్భుతంగా ఉంటుంది. ఆ అనుభూతే మధురంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో అలాంటి మధురానుభూతే విశాఖ వాసులకు బుధవారం కలిగింది. ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఇందుకు సాగరతీరం వేదికైంది.
ఐఎన్‌ఎస్ సుమేధ నుంచి ఐఎఫ్‌ఆర్‌ను సమీక్షిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఐఎఫ్‌ఆర్‌ను సమీక్షించిన రాష్ట్రపతి ముర్ము,,
పదేళ్లకోసారి జరిగే ఐఎఫ్‌ఆర్‌కు ఈ ఏడాది విశాఖపట్నం అతిథ్య నగరమై సంగి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఐఎఫ్‌ఆర్ సాగరతీరంలో బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఐఎఫ్‌ఆర్‌కు ముఖ్య అతిథిగా హాజరైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం పది గంటలకు తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఐఎన్‌ఎస్ సుమేధ యుద్ధనౌకలో ప్రయాణించారు. ఆ నౌక నుంచే ఆమె రెండు గంటలకు పైగానే ఆమె ఐఎఫ్‌ఆర్‌ను సమీక్షించారు. ఆమెతో పాటు నౌకాదళ ప్రధానాధికారి దినేష్ కె.త్రిపాఠి, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, నావికాదళ ఉన్నతాధికారులు ఉన్నారు. ఆరు వరుసల్లో నిలిపిన 71 యుద్ధనౌకల్లోని నావికాదళ సిబ్బంది నుంచి రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగారు. ఆయా యుద్ధనౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, జలాంతర్గాముల విశిష్టత, అది ఏ దేశానికి చెందినది తదితర వివరాలను నేవీ అధికారులు మైక్ ద్వారా వివరించారు. ఆ నౌకలు ఐఎన్‌ఎస్ సుమేధను సమీపించే సరికి రాష్ట్రపతి వారికి అభివాదం చేశారు. ఈ ఫ్లీట్ రివ్యూకు వివిధ దేశాల నుంచి వచ్చిన 400 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
భారత అతిపెద్ద విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్
పాల్గొన్న యుద్ధనౌకలు, విమానాలు ఇవీ..
ఈ ఐఎఫ్‌ఆర్‌లో వివిధ దేశాలకు చెందిన 19 విదేశీ యుద్ధనౌకలు, ఇండియన్ నేవీకి చెందిన 45 వార్ షిప్‌లు, మరో ఏడు కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధక నౌకలు వెరసి 71 వరకు పాల్గొన్నాయి. సిందూర్ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఈ ఐఎఫ్‌ఆర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో పాటు భారత యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ చెన్నై, విశాఖపట్నం, ముంబై, మైసూర్, ఐఎన్‌ఎస్ రాణా, రణ్‌వీర్, తరఖాన, తమల్, నీలగిరి, హిమగిరి, ఉదయగిరి తదితర నౌకలు ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్నాయి. ఇంకా జలాంతర్గాములు ఐఎన్‌ఎస్ సింధుకీర్తి, సింధుకేసరి. సిం«ద్‌ఘోష్, కోస్ట్‌గార్డ్ షిప్‌లు, అత్యాధునిక పీ8ఐ నిఘా విమానం, మిగ్ 29–కే జెట్ ఫైటర్లు, డార్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సీకింగ్, చేతక్ హెలికాప్టర్లు నీలి సంద్రంలో తమ అందచందాలను, ప్రతిభా పాటవాలను అద్భుతంగా ప్రదర్శించాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పైకి మిగ్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు, యుద్ధ విమానాల విన్యాసాలు ఎంతగానో అలరించాయి.
విక్రాంత్ నుంచి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు
ఐఎఫ్‌ఆర్ ఎంతో సంతోషాన్నిచ్చిందిః రాష్ట్రపతి ముర్ము
ఐఎఫ్‌ఆర్ ముగిసిన అనంతరం రాష్ట్ర్రపతి ద్రౌపది ముర్ము నావికులనుద్దేశించి ఐఎన్‌ఎస్ సుమేధ డెక్‌పై నుంచి ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే? విశాఖపట్నం అనే సముద్రతీర మహానగరంలో ఈ గౌరవప్రదమైన ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. భారతదేశం ఒక సముద్ర వారసత్వం కలిగిన దేశం. శతాబ్దాలుగా మన సముద్ర మార్గాలు వాణిజ్యానికి, సంస్కృతికి, భద్రతకు ప్రధాన ఆధారంగా నిలిచాయి. ఈ రోజు మన ముందున్న ఈ విశాఖ నౌకాదళ విన్యాసం భారత నావికాదళ శక్తి, సాంకేతిక నైపుణ్యం, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తోంది. ఇండియన్ నేవీ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటమే కాకుండా సముద్ర మార్గాల ద్వారా భద్రత, మానవతా సహాయ కార్యక్రమాలు, విపత్తు సహాయక చర్యల్లోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ‘సురక్షిత సముద్రం–సమృద్ధి భారత్’అనే లక్ష్యంతో మన నౌకాదలం నిరంతరం కృషి చేస్తోంది.
ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా పేరేడ్ సెయిల్స్ దృశ్యం
సముద్ర భద్రతకు సహకారం అవసరం..
ఈ ఫ్లీట్ రివ్యూ కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది అంతర్జాతీయ స్నేహసంబంధాలకు ప్రతీక కూడా. వివిధ దేశాల నౌకాదళాలు పాల్గొనడం ద్వారా ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ తత్వాన్ని మనం ఆచరణలో చూపిస్తున్నాం. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర దోపిడీ నియంత్రణ వంటి అంశాల్లో అంతర్జాతీయ సహకారం అత్యవసరం. మన యువతకు, ముఖ్యంగా విశాఖపట్నం వంటి తీరప్రాంతాల్లో పెరుగుతున్న విద్యార్థులకు ‘భారత నౌకాదళం స్ఫూర్తిదాయకం.
ఐఎఫ్‌ఆర్‌లో మాల్దీవుల కోస్ట్‌గార్డ్ షిప్ హురావీ
క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం.. ఇవే మన నావికుల విశేష లక్షణాలు. ఈ సందర్భంగా దేశ సేవలో అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి నౌకాదళ సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. వారి కుటుంబాలకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా భారతదేశ సముద్ర శక్తి మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి, భద్రత, సహకారం కోసం మన దేశం ముందంజలో నిలవాలని ఆశిస్తున్నాను’ అని రాష్త్రపతి ముర్ము తన ప్రసంగాన్ని ముగించారు.
Next Story

