
హైదరాబాద్ వస్తున్నారా, అయితే ఈ రూట్లు ఫాలోకండి!
ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సంక్రాంతి సంబరం ముగిసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు తిరుగు ముఖం పట్టారు. రోడ్లపై రద్దీ పెరుగుతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్‌హెచ్- 65పై రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు..
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.
మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.
నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
నల్లగొండ - మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు
కోదాడ- హుజూర్ నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.
ఎన్‌హెచ్ 65 (విజయవాడ-హైదరాబాద్) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్.
గుంటూరు నుంచి వస్తుంటే ఇలా చేయండి...
సంక్రాంతి కానుకగా విజయవాడ వెస్ట్ బైపాస్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా పెదఅవుటుపల్లి వరకు నిర్మించిన రహదారిని అధికారులు ఒకవైపు అందుబాటులోకి తెచ్చి వాహనాలను అనుమతించారు.
చెనై, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు.. కాజా టోల్‌గేట్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్‌లోకి వచ్చి.. గొల్లపూడి మీదుగా చిన్నఅవుటపల్లి వరకు వెళ్లి, అక్కడ ఏలూరువైపు హైవేలోకి చేరుకొని వెళ్లిపోవచ్చు. ఇప్పటికే గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కాజా వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఏలూరువైపు వెళ్లొచ్చు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఈ బైపాస్‌లో గొల్లపూడి వద్ద విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి చేరుకొని హైదరాబాద్ వైపు వెళ్లిపోవచ్చు. దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాల్లో ఏలూరు, హైదరాబాద్ వెళ్లే వాహనాలేవీ.. విజయవాడ నగరంలోకి రావాల్సిన అవసరం ఉండదు.
అయితే ఈ వెస్ట్ బైపాస్‌లో గొల్లపూడి వైపు నుంచి వచ్చే వాహనాలకు మాత్రం ప్రస్తుతం కాజా వరకు వచ్చేందుకు అవకాశం లేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. గొల్లపూడి వైపు నుంచి వచ్చేటప్పుడు కృష్ణా నదిపై వంతెన, సీడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత మంగళగిరి-మందడం రోడ్డులోకి చేరుకొని సచివాలయం, హైకోర్టు వైపు వెళ్లొచ్చు.
Next Story

