
సీఎస్‌ను నాలుగు రోజులు జైల్లో ఉంచితే అందరూ దార్లోకి వస్తారు
ఆదేశాల దిక్కారంపైన ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ప్రభుత్వ అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం చరిత్రలో నిలిచిపోయే రీతిలో నిప్పులు చెరిగింది. ప్రజలకు, కక్షిదారులకు న్యాయం చేయలేనప్పుడు ఇక న్యాయస్థానాలు ఎందుకని, కోర్టులను మూసివేయడం మంచిదని అత్యున్నత ధర్మాసనం అత్యంత ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్‌ను నాలుగు రోజులు జైల్లో ఉంచితేనే అధికారులందరూ దార్లోకి వస్తారని జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మల ధర్మాసనం అభిప్రాయపడింది.
ఏఐ (AI) ని అడిగినా అర్థం తెలిసేదిగా
గ్రూప్-1 ప్రధాన పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులను వెంటనే నాన్ ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని కోర్టు ఈ నెల 11న ఆదేశించింది. అయితే, నిబంధనల్లో నాన్ ఫోకల్ అనే పదానికి నిర్వచనం లేదని ప్రభుత్వం సాకులు చెప్పడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ పదానికి అర్థం తెలియకపోతే నిఘంటువు చూడాలి, లేదా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ని అడిగినా చెప్పేది కదా.. అని ఎద్దేవా చేసింది. ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కు తెలిసిన విషయం సీఎస్‌కు తెలియకపోవడం వెనుక ఆ అధికారులతో కుమ్మక్కయ్యారనే అనుమానం కలుగుతోందని ధ్వజమెత్తింది.
వ్యవస్థ ప్రతిష్టపై రాజీ పడబోం
సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోతే, కింది స్థాయి ఉద్యోగులకు న్యాయ వ్యవస్థపై ఏం గౌరవం ఉంటుందని ధర్మాసనం నిలదీసింది. మేము ఉన్నది ప్రజలకు న్యాయం చేయడానికి, వ్యవస్థ ప్రతిష్టను కాపాడటానికే.. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పింది. అధికారుల మొండి వైఖరి వల్ల సామాన్య ప్రజలు న్యాయంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బదిలీలు చేయాల్సిందే.. లేదంటే హాజరు తప్పదు
కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులను సమర్థించేందుకు తాపత్రయ పడవద్దని అడ్వొకేట్ జనరల్‌కు సూచించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ, ఆలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సీఎస్‌ను ఆదేశించింది. ఆదేశాలు అమలు చేస్తేనే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని, లేనిపక్షంలో మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
Next Story

