
నాతో చర్చకు వస్తే మోదీ రాజకీయ జీవితం ముగిసినట్లే: రాహుల్
ప్రధాని మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తనతో బహిరంగ చర్చకు వస్తే మోదీ రాజకీయ జీవితం ముగుస్తుందని సవాల్ విసిరారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ప్రధాని ట్యాప్ చేస్తున్నారని పేర్కొంటూ.. ఈ వ్యవహారంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మరోవైపు, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) అంశంపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నా ఫోన్లోనే ఆధారాలున్నాయి..
కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో శుక్రవారం (నవంబర్ 13) పోస్టు చేసిన ఓ వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు అందులోనే ఉన్నాయని ఆరోపించారు.
"ఆధారాలు ఇక్కడే ఉన్నాయి. ఈ ఫోన్లోనే ఉన్నాయి. నా ఫోన్‌ను ప్రధాని ట్యాప్ చేస్తున్నారని ఆయనకు కూడా తెలుసు" అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
చర్చకు వస్తే అసలు నిజాలు బయటపడతాయి!
ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చకు సిద్ధమంటూ గతంలో విసిరిన సవాల్‌ను రాహుల్ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ చర్చ జరిగితే విదేశీ శక్తుల ప్రభావంతో ఎవరు పనిచేస్తున్నారనే విషయం దేశ ప్రజలకు తెలుస్తుందని అన్నారు.
"ఆయన నాతో ముఖాముఖి చర్చకు వచ్చిన క్షణమే.. విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరు ఉన్నారు? దేశద్రోహి ఎవరు? ఎప్పటి నుంచి అలా వ్యవహరిస్తున్నారు? అనే విషయాలు బయటపడతాయి. నా ఫోన్లోనే ఇందుకు సంబంధించిన వివరాలు రాసుకున్నాను" అని రాహుల్ పేర్కొన్నారు.
మోదీ రాజకీయ జీవితం ముగుస్తుంది: రాహుల్
ప్రధాని తనపై చేస్తున్న ఆరోపణలన్నింటికీ బహిరంగ చర్చలో సమాధానం చెబుతానని రాహుల్ అన్నారు. మోదీ తనతో చర్చకు అంగీకరిస్తే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు.
"నేను పదేపదే చెబుతున్నాను. ప్రధాని మోదీ నాతో చర్చకు వస్తే ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఈ విషయం ఆయనకు తెలుసు.. నాకు కూడా తెలుసు. అయినా ఆయన నన్ను దేశద్రోహి అంటూ ఆరోపిస్తూనే ఉన్నారు" అని రాహుల్ మరో వీడియోలో పేర్కొన్నారు.
మోదీ నాపై దాడి చేయడం తగ్గించారు.. కారణం ఉంది!
దేశద్రోహులు ఎవరు? విదేశీ శక్తుల ప్రభావంతో పనిచేస్తున్నది ఎవరు? అనే విషయాలను ప్రజల ముందు ఉంచాలన్నదే తన ఉద్దేశమని రాహుల్ స్పష్టం చేశారు.
అంతేకాదు.. గతంలో తనపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ స్థాయిలో స్పందించడం లేదని అన్నారు. తనపై దాడి చేయడం తగ్గించారని, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
"ఆయన మనసులో ఏదో భయం ఉంది. అందుకే ఇప్పుడు నా గురించి ఎక్కువగా మాట్లాడటం లేదు. నాపై దాడి చేయడం కూడా తగ్గించారు. దీనికి ఒక బలమైన కారణం ఉంది" అంటూ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
SIR వివాదం నేపథ్యంలో రాజకీయ వేడి..
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ అంశం ప్రస్తుతం బీజేపీ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 6న రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీకి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. తాను ఏ వేదికపైనైనా, ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
రాహుల్ సవాల్‌ను స్వీకరించిన అమిత్ షా..
రాహుల్ గాంధీ సవాల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం స్పందించారు. చర్చకు సిద్ధమేనని చెబుతూనే.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని రాహుల్‌కు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విజ్ఞప్తి చేస్తే ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉందని అమిత్ షా వెల్లడించారు.
దీంతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, SIR వివాదం, ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు రాహుల్ విసిరిన సవాల్.. దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
