సభకు రాకపోతే ’నో వర్క్.. నో పే‘
x

సభకు రాకపోతే ’నో వర్క్.. నో పే‘

ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు


శాసనసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల జవాబుదారీతనంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల పట్ల శాసనవ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై ప్రసంగిస్తూ, ప్రస్తుత రాజకీయాల్లోని కొన్ని అనైతిక పోకడలను ఆయన ఎండగట్టారు.

జీతాలు తీసుకుంటున్నారు.. కానీ సభకు రారు

కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ఒక్క రోజు కూడా హాజరు కాకుండానే, అన్ని రకాల జీతభత్యాలను పొందుతున్నారని అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. సభకు రారు, కనీసం ఒక్క చర్చలోనూ పాల్గొనరు.. కానీ జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇలాంటి అనైతిక ప్రవర్తనను మనం ఎలా సమర్థించగలం అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సభ్యుల తీరు చూస్తుంటే తనకు ఎంతో వేదన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయ్యన్నపాత్రుడు చేసిన కీలక ప్రతిపాదనలు

సభ్యుల వ్యవహారశైలిలో మార్పు రావాలంటే కఠిన నిబంధనలు అవసరమని పేర్కొంటూ ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. సభకు రాని సభ్యులకు జీతాలు నిలిపివేసేలా చట్ట సవరణ చేయాలని ఆయన ప్రతిపాదించారు. పని చేయని వారికి వేతనం పొందే హక్కు ఉండకూడదని స్పష్టం చేశారు. సరిగ్గా పనిచేయని లేదా సభకు హాజరుకాని ప్రజా ప్రతినిధులను వెనక్కి పిలిపించే (రీకాల్ చేసే) హక్కును ప్రజలకు కల్పించాలని సూచించారు. ప్రస్తుతం సభకు రాని సభ్యులపై చర్యలు తీసుకోవడానికి బలమైన నిబంధనలు లేవని, దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజల దృష్టిలో చులకన కావొద్దు

ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తే ప్రజల దృష్టిలో చులకన అవుతారని అయ్యన్న హెచ్చరించారు. శాసనసభ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. ఈ సదస్సులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు.

Read More
Next Story