
అటెండర్ పోస్టుకు అంత పోటీయా..ఎక్కడంటే
సర్కారీ కొలువుల కోసం నిరుద్యోగులు పోటీలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏ చిన్న ఉద్యోగం రిక్రూట్ మెంట్ అన్నా వందల సంఖ్యలో పోటీపడుతున్నారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న చిన్న రిక్రూట్ మెంట్ కు ఇలాంటి అనుభవం ఒకటి ఎదురయింది. ఒక అటెండర్ కొలువు కోసం వందల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడ్డారు.
ఇది అటెండర్ పోస్టు లెక్క
జిల్లా మొత్తంలో ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టులు కేవలం నాలుగు. కానీ వీటికి వచ్చిన దరఖాస్తులు ఏకంగా 436. అంటే ఒక్కో అటెండర్ పోస్టు కోసం సుమారు 110 మంది మహిళలు క్యూలో ఉన్నారు. ఒక చిన్న పోస్టుకు ఈ రేంజ్ పోటీ ఉండటం జిల్లాలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది. చదువుకున్న వారు కూడా చిన్నదైనా పర్వాలేదు.. గవర్నమెంట్ ముద్ర ఉంటే చాలు అని భావిస్తుండటమే దీనికి కారణం.
కంప్యూటర్ కొలువులకు భారీ క్రేజ్
చదువుకున్న యువత అత్యధికంగా కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులపై ఆసక్తి చూపారు. కేవలం 12 ఖాళీలు ఉంటే, ఏకంగా 576 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, 10 వృత్తి విద్యా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల కోసం 136 మంది, 7 పార్ట్‌టైమ్ ఉపాధ్యాయ పోస్టుల కోసం 78 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అటు హాస్టల్ పర్యవేక్షణ చూసే 4 వార్డెన్ పోస్టులకు 102 మంది పోటీ పడుతున్నారు.
అటెండర్ నుంచి వాచ్ ఉమెన్ వరకు.. పోటీనే
సామాన్య పోస్టుల విషయంలో పోటీ ఆకాశాన్ని తాకుతోంది. కేవలం 4 అటెండర్ పోస్టుల కోసం ఏకంగా 437 మంది పోటీ పడటం విశేషం. అంటే ఒక్కో పోస్టుకు వంద మందికి పైగా అభ్యర్థులు క్యూలో ఉన్నారు. అలాగే, 7 స్కావెంజర్ పోస్టులకు 197 మంది, 5 చౌకీదార్ పోస్టులకు 93 మంది, 5 వంటి పనివారు పోస్టులకు 154 మంది దరఖాస్తు చేశారు. ఇక ఉన్న ఒక్కే ఒక్క వాచ్ ఉమెన్ పోస్టు కోసం 30 మంది మహిళలు పోటీ పడుతుండటం గమనార్హం.
వైద్య.. వంట విభాగాల్లోనూ అదే జోరు
పాఠశాలల్లో ఆరోగ్య సేవలు అందించే 7 ఏఎన్‌ఎం పోస్టుల కోసం 169 మంది దరఖాస్తు చేయగా, 11 వంటవాళ్ల పోస్టులకు 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాత పరీక్ష లేకుండా కేవలం మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ద్వారానే ఈ ఎంపికలు జరుగుతుండటంతో, ఎవరికి ఆ అదృష్టం దక్కుతుందోనని అభ్యర్థులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
నాయకుల చుట్టూ ప్రొటోకాల్ ప్రదక్షిణలు
మరో వైపు ఈ ఉద్యోగాల కోసం సాగుతున్న సిఫార్సులు చూస్తుంటే ఏదో పెద్ద పొలిటికల్ అపాయింట్‌మెంట్ జరుగుతుందా అన్న భ్రమ కలుగుతోంది. సాలూరు వంటి ప్రాంతాల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉంటే, దాని కోసం పదుల సంఖ్యలో అభ్యర్థులు తమ వెనుక నాయకులను వేసుకుని ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. చిన్న ఉద్యోగమే కదా అని తేలికగా తీసుకోకుండా.. ఎమ్మెల్యేలు, కీలక నేతల నుంచి ఫోన్ కాల్స్ వెళ్లేలా అభ్యర్థులు భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
ఇంటర్వ్యూనే మెయిన్స్ పరీక్ష
రాత పరీక్షలు లేవు. కేవలం ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష) ద్వారానే ఎంపిక. దీంతో అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూనే తమ జీవితాన్ని మార్చే మెయిన్స్ పరీక్షగా భావిస్తున్నారు. మార్కుల కంటే సిఫార్సుల కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో, నేతల కళ్లలో పడటానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.
రూ. 10 వేల నుంచే బిడ్డింగ్ షురూ
మరో వైపు ఈ పోటీని క్యాష్ చేసుకోవడానికి క్షేత్రస్థాయి నాయకులు రంగంలోకి దిగారు. అటెండర్ పోస్టుకు కూడా రూ. 10 వేల నుంచి వసూళ్లు మొదలైనట్లు సమాచారం. నిరుద్యోగ మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని, కొలువు ఇప్పిస్తామనే హామీతో కొందరు నేతలు ఈ బిడ్డింగ్ ప్రక్రియను నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

