నేనే పోటీ నుంచి తప్పుకున్నాను: అన్నామలై
x
అన్నామలై

నేనే పోటీ నుంచి తప్పుకున్నాను: అన్నామలై

కోరుకుంటే ఏ నియోజక వర్గం నుంచైన పోటీ చేయగలన్న బీజేపీ నాయకుడు


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తానని తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. తను పోటీకి సిద్దంగా లేనని, హైకమాండ్ కు ఈ విషయాన్ని నేరుగా చెప్పినట్లు పేర్కొన్నారు. కేరళలో తన ఎన్నికల ప్రచారం మధ్యలోనే అక్కడి నుంచి తిరిగి వచ్చి, శనివారం చెన్నైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన అనంతరం ఆయన స్వయంగా ఈ ప్రకటన చేశారు.

ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల కోసం ఆమోదం నిమిత్తం హైకమాండ్‌కు పంపిన పార్టీ వెలువరించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని, ఈసారి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నామలై తెలిపారు.
"నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని కోర్ కమిటీకి ఇప్పటికే రాతపూర్వకంగా తెలియజేశాను. ఆమోదం కోసం హైకమాండ్‌కు పంపిన అభ్యర్థుల జాబితాలో కూడా నా పేరు లేదు. కాబట్టి, నాకు టికెట్ నిరాకరించబడలేదు," అని ఆయన అన్నారు.
ఒకవేళ ఆయన నిర్ణయించుకుని ఉంటే తమిళనాడులోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి ఉండేవారని, కానీ ప్రస్తుతం తన దృష్టి బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడంపైనే ఉందని ఆయన చెప్పారు.
"నేను రేసులో గానీ, జాబితాలో గానీ లేను. ఈ ఎన్నికల్లో, తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడమే నా పాత్ర. ప్రస్తుతం, ఏప్రిల్ 7 వరకు పుదుచ్చేరి, కేరళలో, ఆ తర్వాత ఏప్రిల్ 23 వరకు తమిళనాడులో ప్రచారం చేసే బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ఇది పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత. నేను ఆ బాధ్యతను నెరవేరుస్తాను," అని కన్నూర్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న తరువాత విలేకరులతో అన్నారు.

ప్రధాని మోదీతో సమావేశం..

మాజీ అధ్యక్షుడి హోదాలో, రాష్ట్ర కోర్ కమిటీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులతో ఈరోజు జరిగే 'క్లోజ్డ్ డోర్ సమావేశానికి' హాజరు కావాలని ఆయనను కోరారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇది ఎన్నికల వ్యూహం చర్చించనుందని, రాష్ట్ర కోర్ కమిటీలో సుమారు 10 మంది సీనియర్ నాయకులు హాజరు కానున్నారని తెలిసింది.

టికెట్ నిరాకరించలేదు..

ఏప్రిల్ 3న విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు ఎందుకు లేదని విమానాశ్రయంలో అడిగిన ప్రశ్నకు అన్నామలై స్పందించారు. "నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని కోర్ కమిటీకి ముందే రాతపూర్వకంగా తెలియజేశాను. అందుకే నాకు టికెట్ రాలేదు. నిజం ఏమిటంటే, నేను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇది మీడియాలో చర్చనీయాంశం అయినందున, నేను ఇక్కడ స్పష్టత ఇస్తున్నాను." అని అన్నారు.
వారం క్రితమే తన నిర్ణయాన్ని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కూడా తెలియజేశానని ఆయన అన్నారు. అలాగే, ఈ విషయాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లకు కూడా తెలియజేశానని అన్నామలై చెప్పారు. తన నిర్ణయాన్ని గౌరవించి, ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం కల్పించినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మోదీతో సమావేశం గురించి ఆయన మాట్లాడుతూ, "ఇది ఎన్నికల సమయంలో జరిగే ఒక సాధారణ చర్చ. నేను దీనిని ప్రధానితో మాట్లాడే అవకాశంగా చూస్తున్నాను." అని అన్నారు.
అంతకుముందు, ఉత్తర కేరళలో తన ప్రచారంలో భాగంగా ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. "రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ 210 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో, నేను ఒక కార్యకర్తగా మన గెలిచే బీజేపీ, ఇతర ఎన్డీఏ అభ్యర్థులందరితో భుజం భుజం కలిపి నిలబడి ప్రచారం చేస్తాను." అని ట్వీట్ చేశారు.
Read More
Next Story