జనసేన ఆఫీసుముందే పెట్రోల్ పోసుకుంటా: అరవ శ్రీధర్ బాధితురాలు
x

జనసేన ఆఫీసుముందే పెట్రోల్ పోసుకుంటా: అరవ శ్రీధర్ బాధితురాలు

మీ ఇంట్లో అమ్మాయిలకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా? అంటూ పవన్‌ కళ్యాణ్‌ను నిలదీసింది.


జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితురాలు మరోసారి సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు. గత మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడుతున్నా, పార్టీ పరంగా గానీ, ప్రభుత్వం పరంగా గానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నిస్తూ ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సక్సెస్ ఫుల్ గా మోసం చేశారు.. బాధితురాలి ఆవేదన
నన్ను మీరంతా కలిసి చాలా సక్సెస్ ఫుల్ గా మోసం చేశారు అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు అన్యాయం చేసిన వ్యక్తి నిస్సిగ్గుగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతుంటే, జనసేన పార్టీ సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. మూడు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా, త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టి రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు నివేదిక ఎందుకు బయటపెట్టలేదని ఆమె నిలదీశారు. తప్పు మీ వైపు ఉంది కాబట్టే నివేదికను తొక్కిపెట్టారని ఆమె ఆరోపించారు.
కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత ఘాటుగా ఉన్నాయి. రేపు మీ కుటుంబాల్లోని అమ్మాయిలకు ఇలాగే జరిగితే.. మా పార్టీ వాడే కదా అని ముడుచుకుని కూర్చుంటారా? వారిపై అత్యాచారాలు జరిగినా ఇలాగే వదిలేస్తారా? అంటూ ఆమె ఆక్రోశం వెళ్లగక్కారు. ఒక సామాన్య మహిళకు అన్యాయం జరిగితే స్పందించని కమిటీలు ఎందుకని ఆమె ప్రశ్నించారు.
ఆత్మహత్య హెచ్చరిక.. జనసేన ఆఫీస్ వద్ద నిరసన
న్యాయం జరగకపోతే తాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని బాధితురాలు హెచ్చరించారు. నాకు అన్యాయం చేయాలని చూస్తే, జనసేన పార్టీ కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని చనిపోతాను అని ఆమె అల్టిమేటం జారీ చేశారు. పార్టీ వేసిన త్రిసభ్య కమిటీ కేవలం కాలయాపన కోసమేనని, దోషిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.
ఇరకాటంలో జనసేన
మహిళా భద్రత గురించి నిత్యం మాట్లాడే పవన్ కళ్యాణ్, తన సొంత పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై ఇంతవరకు కఠిన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. బాధితురాలు నేరుగా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ మాట్లాడటంతో, ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story