’పోలవరం కోసం నిద్రలేని రాత్రులు గడిపా‘
x

’పోలవరం కోసం నిద్రలేని రాత్రులు గడిపా‘

2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనేది లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు.


పోలవరం కోసం నిద్రలేని రాత్రులు గడిపానని, ప్రస్తుతం పోలవరం మెయిన్ డ్యాం దాదాపు పూర్తి అయిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరి 15 నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని, ఎంబాంక్‌మెంట్ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-2 పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆయ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (జనవరి 7, 2026) పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఉదయం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన, ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. గతంలోనే డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి అయ్యింటే... రూ.440 కోట్లతోనే నిర్మాణం జరిగేది. ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి అయ్యేది. 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టుకు చాలా నష్టం జరిగింది. డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా కూడా నాటి ప్రభుత్వం దానిని గుర్తించడానికి చాలా సమయం తీసుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఆరేడేళ్లు జాప్యం అయింది. జాప్యం కావడం వల్ల ఖర్చులు పెరిగాయి. డయాఫ్రం వాల్ నిర్మాణానికి అదనంగా రూ.1000 కోట్ల భారం పడిందన్నారు.

పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశామన్నారు. పునరావాసం కోసం అవసరమైన భూ సేకరణ కూడా త్వరితగతిన చేపట్టాలని సూచించాం. అతిపెద్ద ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ ఏర్పాటు చేయబోతున్నాం. పోలవరం కుడి, ఎడమ కాలువలు... టన్నెళ్ల ద్వారా కనెక్టివిటీ పెంచుతాం. ఎడమ కాలువ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. విశాఖ వరకు పోలవరం నీళ్లను తీసుకెళ్తాం. విశాఖ, అనకాపల్లి జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం. అలాగే పోలవరం కాలువల ద్వారా పారే గోదావరి జలాలతో దారి పొడుగునా ఉన్న మైనర్ ఇరిగేషన్, చెక్ డ్యాంలను నింపుతూ వెళ్తామన్నారు.

పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేయగలిగామని, తద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందించగలిగామన్నారు. గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకువెళ్లాం... అక్కడ నీటిని పొదుపు చేసి సీమకు కృష్ణా జలాలు వెళ్లేలా చేశాం. దీని వల్ల రాయలసీమకు నీటిని తరలించడం సాధ్యమైంది. ఉద్యాన రంగం అభివృద్ధి చెందుతోంది. రాయలసీమలో రిజర్వాయర్లు అన్నింటినీ నింపాం. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు అన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలనేది లక్ష్యమన్నారు. ఐదేళ్ల కాలంలో గత ప్రభుత్వం కేవలం 2 శాతం పనులు మాత్రమే పూర్తి చేసింది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం 72 శాతం పనులు పూర్తి చేసిందన్నారు.

పట్టిసీమ ప్రాజెక్టుపై విమర్శలు చేశారు. పట్టిసీమ లేకుంటే రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. పోలవరం పూర్తి కావాలి. నదులు అనుసంధానం చేయాలి. కరువు రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. ఇది నా కల అంటూ సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గోదావరిలో ముంచేసింది. నిద్రలేని రాత్రులు గడిపా. అంతగా పోలవరం ప్రాజెక్టు నా మనస్సుకు దగ్గరగా ఉంది. అంటూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.

Read More
Next Story