‘‘భారత మూలాలున్న వివేక్ కు ఓటు వేయాలనిపించలేదు’’
x

‘‘భారత మూలాలున్న వివేక్ కు ఓటు వేయాలనిపించలేదు’’

ఓహియో గవర్నర్ అమీ ఆక్టన్ విజయం వెనకాల ప్రవాస భారతీయులు


లతా శ్రీనివాసన్

అమెరికాలో భారతీయ మూలాలున్న వివేక్ రామస్వామికి సొంత వర్గం నుంచే ఆశించిన మద్దతు లభించలేదు. ఒహియో గవర్నర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ 52 శాతం ఓట్లతో విజయం సాధించగా, రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి 44 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో అమీ ఆక్టన్ విజయం కంటే కూడా.. భారతీయ మూలాలున్న వివేక్‌ను కాదని, భారతీయ అమెరికన్లు ఆమెకు ఎందుకు మద్దతిచ్చారన్న అంశం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

ఒహియోలో నివసిస్తున్న భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ కార్యకర్త లతా శ్రీనివాసన్ ఈ విషయంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివేక్ రామస్వామి భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో దక్షిణాసియా ఓటర్లను తమవైపు తిప్పుకోవడం డెమోక్రటిక్ పార్టీకి మొదట్లో సవాలుగా మారిందని ఆమె వివరించారు. అయితే ఒకే దేశానికి చెందిన మూలాలు ఉన్నంత మాత్రాన రాజకీయంగా ఒకే అభిప్రాయంతో ఉండాల్సిన అవసరం లేదని ఓటర్లకు వివరించినట్లు తెలిపారు.

అభ్యర్థి పూర్వీకులు, వారసత్వం కంటే ఆయన అనుసరించే రాజకీయ విధానాలు, విలువలే ముఖ్యమని ప్రచారం చేశారు. భారతీయ సమాజం విద్య, సైన్స్, పరిశోధన, మెరుగైన వైద్య సదుపాయాలు, హెచ్‌1బీ వంటి వలస విధానాలు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తుందని లతా శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ అంశాలకు డెమోక్రటిక్ పార్టీ, అమీ ఆక్టన్ మద్దతుగా ఉన్నారని, వివేక్ రామస్వామి మాత్రం ట్రంప్‌కు చెందిన MAGA రాజకీయాలకు దగ్గరగా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

కరోనా సమయంలో గుర్తింపు.. రాజకీయాల్లోకి అడుగు

అమీ ఆక్టన్ రాజకీయ ప్రయాణం మొదట్లో అంత సులభంగా సాగలేదు. 2025లో ఒహియో గవర్నర్ పదవికి పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో ఎక్కువకాలం కొనసాగలేరని చాలామంది భావించారు.

వైద్యురాలైన అమీ ఆక్టన్ గతంలో ఒహియో రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు ఇచ్చిన సూచనలు, భరోసా కల్పించే ప్రసంగాలతో ఆమె విస్తృత గుర్తింపు పొందారు. అయితే అదే సమయంలో ఆమెకు వ్యతిరేకత కూడా ఎదురైంది. భౌతిక దూరం, మాస్కుల నిబంధనలను వ్యతిరేకిస్తూ కొన్ని తీవ్రవాద భావాలున్న వర్గాలు నిరసనలకు దిగాయి.



మరోవైపు అప్పటి రిపబ్లికన్ ప్రభుత్వం కొన్ని ఆదేశాలపై సంతకాలు చేయాలని ఆమెపై ఒత్తిడి తెచ్చింది. కానీ తన వైద్య వృత్తి ప్రమాణాలకు, మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరించలేనని భావించిన అమీ ఆక్టన్ చివరకు తన పదవికి రాజీనామా చేశారు.

ఈ నిర్ణయంపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోలేక, తనకు, కుటుంబానికి వచ్చిన బెదిరింపులకు భయపడి ఆమె పదవి నుంచి తప్పుకున్నారని కొందరు భావించారు. దీంతో ఆమె నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తాయి. డెమోక్రటిక్ పార్టీలోని కొందరు నేతలు కూడా ఆమె బలమైన అభ్యర్థి కాదని అభిప్రాయపడ్డారు.

అయితే అమీ ఆక్టన్‌ను ప్రత్యక్షంగా కలిసిన తర్వాత ఆమె ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, తెలివితేటలు తనను ఆకట్టుకున్నాయని లతా శ్రీనివాసన్ తెలిపారు. దీంతో ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

దక్షిణాసియా ఓటర్లపై ప్రత్యేక దృష్టి

అమీ ఆక్టన్ ప్రచారంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు వివిధ జాతులు, మతాలకు చెందిన ప్రజలను కలుపుకొని వెళ్లడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దక్షిణాసియా, ఆఫ్రికన్ అమెరికన్, హిస్పానిక్ వర్గాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు.

ఒహియో డెమోక్రటిక్ పార్టీ, 'దే సీ బ్లూ ఒహియో', 'సౌత్ ఏషియన్స్ ఫర్ అమెరికా' సంస్థలతో కలిసి లతా శ్రీనివాసన్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దక్షిణాసియా ఓటర్లకు ఫోన్ కాల్స్ చేసి అమీ ఆక్టన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇలా ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో వివేక్ రామస్వామి ప్రచార బృందం ఒక వివాదాస్పద ప్రకటనను విడుదల చేసింది. అమీ ఆక్టన్ వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా ఆమె తల్లితో ఉన్న సంబంధాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రకటన రూపొందించారు. దశాబ్దాలుగా తల్లితో సంబంధాలు లేని అమీ ఆక్టన్‌ను అబద్ధాలకోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

వ్యక్తిగత జీవితంపై దాడి.. రామస్వామికి ఎదురుదెబ్బ

కోర్టు పత్రాల ప్రకారం, అమీ ఆక్టన్ చిన్నతనంలో ఉన్నప్పుడు ఆమె సవతి తండ్రి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెను, ఆమె సోదరుడిని తల్లి సంరక్షణ నుంచి తొలగించారు.

ఈ కుటుంబ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ రూపొందించిన ప్రకటన కోసం వివేక్ రామస్వామి ప్రచార బృందం ఏకంగా నాలుగు మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అయితే ఈ ప్రకటన రాజకీయంగా వివాదాస్పదమైంది. సొంత రిపబ్లికన్ పార్టీలో కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒహియో రిపబ్లికన్ గవర్నర్ మైక్ డివైన్ సైతం ఈ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అమీ ఆక్టన్ రాజకీయ విధానాలను విమర్శించకుండా, ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకోవడం వివేక్ ప్రచారానికి ప్రతికూలంగా మారింది. ప్రత్యర్థిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో విడుదల చేసిన ప్రకటన చివరకు రామస్వామికే ఎదురుదెబ్బగా పరిణమించింది.

మరోవైపు అమీ ఆక్టన్‌కు దేశవ్యాప్తంగా మద్దతు పెరిగింది. ఒహియోతో పాటు అమెరికాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆమె ప్రచారానికి భారీగా విరాళాలు అందాయి. అయితే ప్రకటన వివాదం ఒక్కటే ఆమెకు విజయాన్ని అందించలేదని లతా శ్రీనివాసన్ పేర్కొన్నారు. అమీ ఆక్టన్ ప్రసంగాలు విన్న ప్రజలు ఆమె తెలివితేటలను, ప్రజల పట్ల చూపించే శ్రద్ధను గుర్తించారని వివరించారు.

అమీ ఆక్టన్ వ్యక్తిగత జీవితంలోనూ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. పేదరికంలో పెరిగిన ఆమె ఒక దశలో తన తమ్ముడితో కలిసి గుడారంలో నివసించాల్సి వచ్చింది. చిన్నతనంలో ఎదుర్కొన్న ఈ పరిస్థితులే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమస్యలను అర్థం చేసుకోవడానికి దోహదపడ్డాయని లతా శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

ఒహియోకు తొలి మహిళా గవర్నర్

చివరకు ఎన్నికల ఫలితాల్లో అమీ ఆక్టన్ 52 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. వివేక్ రామస్వామికి 44 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విజయంతో ఒహియో చరిత్రలో గవర్నర్‌గా ఎన్నికైన తొలి మహిళగా అమీ ఆక్టన్ గుర్తింపు పొందారు.

అయితే గతంలో నాన్సీ హొల్లిస్టర్ 11 రోజుల పాటు గవర్నర్‌గా పనిచేశారు. 1998-99లో అప్పటి గవర్నర్ జార్జ్ వోయినోవిచ్ రాజీనామా చేసి సెనేట్‌కు వెళ్లిన సందర్భంలో ఆమె ఈ బాధ్యతలు నిర్వహించారు. కానీ ఎన్నికల ద్వారా ఒహియో గవర్నర్‌గా విజయం సాధించిన తొలి మహిళ అమీ ఆక్టన్ కావడం విశేషం.

జాతి కాదు.. రాజకీయ విధానాలే ప్రాతిపదిక!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన పరాజయానికి ఇరాన్ యుద్ధం సహా అనేక అంశాలు కారణమయ్యాయని లతా శ్రీనివాసన్ విశ్లేషించారు. అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ విధానాలు కూడా ప్రజల్లో ఆ పార్టీకి మద్దతు పెరగడానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

అన్ని జాతులు, వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు కల్పించడం, మహిళల పునరుత్పత్తి స్వేచ్ఛను గౌరవించడం, మతం-ప్రభుత్వ వ్యవస్థల మధ్య స్పష్టమైన విభజన, ప్రజాస్వామ్య సంస్థలను పరిరక్షించడం వంటి అంశాలకు డెమోక్రటిక్ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని ఆమె వివరించారు.

అలాగే పేదలకు సామాజిక భద్రత, ప్రభుత్వ పాఠశాలలకు నిధులు, చట్టబద్ధమైన వలసదారులకు స్వాగతం, సైన్స్, పరిశోధనలకు ప్రోత్సాహం వంటి విధానాలు తన రాజకీయ విలువలకు దగ్గరగా ఉన్నాయని తెలిపారు.

రాజకీయాల్లో ఓటు వేయడం అనేది వ్యక్తిగత అనుబంధం ఆధారంగా తీసుకునే నిర్ణయం కాదని, తాము ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నామో దానికి అనుగుణంగా అభ్యర్థిని ఎన్నుకోవడమని లతా శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.

అందుకే భారతీయ మూలాలున్న వ్యక్తి అనే ఒక్క కారణంతో వివేక్ రామస్వామికి మద్దతివ్వాల్సిన అవసరం లేదని, అభ్యర్థి రాజకీయ విధానాలు, విలువలు, ప్రజల పట్ల ఆయన అనుసరించే వైఖరిని బట్టి ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని ఆమె వివరించారు. ఒహియో ఎన్నికల ఫలితం ఈ రాజకీయ చర్చకు మరోసారి తెరతీసింది.


Read More
Next Story