భర్త నల్లగా ఉంటే చంపేస్తావా ప్రియాంకా..!
x
భర్తను హత్య చేయించిన ప్రియాంక పురోహిత్

భర్త నల్లగా ఉంటే చంపేస్తావా ప్రియాంకా..!

నువ్వు నల్లగా ఉన్నావు, నాకు తగిన వాడివి కాదు అంటూ తరచూ భర్తతోనే గొడవపడి ఆమె చివరకు అతన్నిహత్యచేయించింది


కట్టుకున్నోడు నల్లంగా ఉన్నాడని చంపించింది ఓ వనిత. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని ధార్ లో జరిగింది. భర్త రంగు నచ్చలేదనే కారణంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి అతడిని కిరాతకంగా హత్య చేయించింది. ఆ తర్వాత దొంగతనంగా నాటకం ఆడింది. అయినా నిజం దాగలేదు. పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడింది. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతోంది.
అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని ధార్‌కి చెందిన 28 ఏళ్ల దేవకృష్ణ పురోహిత్‌ మాసాల దినుసుల వ్యాపారం చేసేవాడు. ఏప్రిల్‌ 7న తన సొంత ఫ్లాట్‌లోనే హత్యకు గురయ్యాడు. శరీరంపైన కత్తితో దాడి చేసిన గాయాలున్నాయి. అయితే, మృతుడి భార్య ప్రియాంక పురోహిత్‌ మాత్రం గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులతో పాటు రూ.3.5లక్షలు దొంగిలించారని, అప్పుడు జరిగిన ఘర్షణలో దుండగులు తన భర్తను హత్య చేశారని పోలీసులకు చెప్పింది.

ఎందుకో పోలీసులు ఆమె మాటల్ని నమ్మలేదు. లోతుగా దర్యాప్తు చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. దేవకృష్ణకు, ప్రియాంక పెళ్లి మామూలు పరిస్థితుల్లో జరిగినట్టు లేదు. పెళ్లికి ముందే గొడవలు జరిగాయి. ఎన్నో వివాదాల మధ్య దేవకృష్ణ, ప్రియాంకకు ఇటీవలే వివాహం జరిగిందని వారి కుటుంబసభ్యులు తెలిపారు. ‘నువ్వు నల్లగా ఉన్నావు. నువ్వు నాకు వద్దు. నీకంటే అందగాడు, ఎర్రగా బుర్రగా ఉండే వాడు నాకు కావాలి’ అని ప్రియాంక తరచూ భర్తతోనే అనేదట. దేవకృష్ణ చెల్లెలు పోలీసులకు ఈ విషయాన్ని చెప్పింది.
దొంగతనంగా డ్రామా..
భార్య ప్రియాంక పురోహిత్ మొదట పోలీసులకు దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.3.5 లక్షలతో పాటు ఆభరణాలు దోచుకుని, భర్తను హత్య చేశారని చెప్పింది. తనను బాధితురాలిగా చూపించుకునేందుకు చేతులు తాళ్లతో కట్టుకుని కథ అల్లింది.
ప్రియాంక తన ప్రియుడు కమలేశ్ తో కలిపి హత్యకు ప్లాన్ వేసింది. కమలేశ్ స్నేహితుడు సురేంద్ర భట్టుకు ఓ లక్ష రూపాయల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చారు.

ఆ ప్లాన్ ప్రకారం.. తలుపులు పగలగొట్టి దొంగతనంలా సీన్ క్రియేట్ చేశారు. నిద్రలో ఉన్న దేవకృష్ణపై దాడి చేసి హత్య చేశారు. విలువైన వస్తువులు మాయం చేసి దోపిడీలా చూపించారు.
పోలీసుల దర్యాప్తు ఎలా?
దర్యాప్తు సమయంలో ఫ్లాట్‌లోనే నగలు దొరకడం పోలీసుల అనుమానాలకు దారి తీసింది. ప్రియాంక చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరకు అసలు కుట్ర బయటపడింది. ప్రస్తుతం ప్రియాంక, కమలేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. సురేంద్ర భట్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చిన్న కారణాలు కూడా ఎంత పెద్ద నేరాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది. కుటుంబ బంధాలను ద్రోహం చేసి నేరానికి పాల్పడితే చివరికి చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమే.
Read More
Next Story