
విశాఖలో భారీ పేలుడు..3 కిలోమీటర్ల మేర దద్దరిల్లిన నగరం
నివాసాల మధ్య బాణసంచా గుట్టలతో భయంతో వణికిన నగరవాసులు.
విశాఖపట్నం జీవీఎంసీ 89వ వార్డు మహాత్మా ఆదర్శనగర్‌లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా సంభవించిన పేలుడు శబ్దంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానిక శ్మశానవాటిక సమీపంలో బాంబుల శివగా పిలవబడే డి.శివకృష్ణకుమార్ అద్దెకు తీసుకున్న ఇంట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల అనుమతి లేకుండా, ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇక్కడ బాణసంచా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న జరగనున్న ఉత్సవాల కోసం భారీగా నిల్వ ఉంచిన మందుగుండు సామాగ్రి ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ఘోరం జరిగింది.
మూడు కిలోమీటర్ల మేర వినిపించిన శబ్దం
ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో మొదట దట్టమైన పొగలు వచ్చి, క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా బాంబు పేలుళ్లను తలపించేలా భారీ శబ్దాలు వినిపించాయి. ఈ పేలుళ్ల ధాటికి శివకృష్ణ అద్దెకు ఉంటున్న ఇంటి గోడలు ముక్కలై పక్కనే ఉన్న రేకుల షెడ్లపై పడ్డాయి. ఆ ధాటి ఎంత తీవ్రంగా ఉందంటే.. దాదాపు 3 కిలోమీటర్ల మేర పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న ఇళ్ల గోడలు పగుళ్లిచ్చాయి, శ్లాబ్‌లు దెబ్బతిన్నాయి. ఒక మహిళపై శ్లాబ్ పెచ్చులు పడి గాయపడటంతో ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
పరారీలో నిందితుడు.. పోలీసుల వేట
ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎగిసిపడటంతో ఇంట్లోని వస్తువులు, ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మర్రిపాలెం నుంచి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన అనంతరం బాణసంచా నిల్వ చేసిన శివ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

