యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ ను ఎలా చంపారంటే..
x
యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్

యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ ను ఎలా చంపారంటే..

స్నేహితుడే శ్రీనివాస్ పాలిట యముడా...


సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి మిస్టరీ వీడింది. హత్యేనని తేలింది. వారం రోజులుగా సాగుతున్న ప్రచారానికి తెరపడింది. ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మీద పుస్తకం రాసినందుకు చంపారని, ఎవర్నో బ్లాక్ మెయిల్ చేసినందుకు మట్టుబెట్టారని.. ఇలా రకరకాలుగా వదంతులు వచ్చాయి. ఈనేపథ్యంలో పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేసి అసలు విషయాన్ని నిగ్గు తేల్చారు.
ఇదీ అసలు విషయం...
ఖమ్మం జిల్లా ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

బొగ్గుల శ్రీనివాస్ ఎలియాస్ గొల్ల శ్రీనివాస్ ది నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామం. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు. ఆయనకు ఓ స్నేహితుడు ఉన్నారు. ఆయన పేరు మేకల వేణుమాధవ్ రెడ్డి. ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని పాకాలపాడు గ్రామం. వీరిద్దరూ కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ కళాశాలలో కలిసి చదువుకున్నారు. తర్వాత చాలా సంబంధాలు లేవు. ఇటీవల జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ కలుసుకున్నారు. పరిచయం పెంచుకున్నారు. కలిసి వ్యాపారాలు చేయాలనుకున్నారు.
దానిలో భాగంగా శ్రీనివాస్‌కున్న ‘బొగ్గుల బీబీక్యూ’ జీఎస్టీ లైసెన్స్ వ్యాపారాన్ని పునరుద్ధరించారు. వేణుమాధవ్‌రెడ్డికి సొంత వ్యాపారం ఉంది. దానిపేరు ‘మేకా ప్రాజెక్టు’. ఈ ప్రాజెక్ట్ తో పాటు బొగ్గుల బీబీక్యూ పేరు మీద ఫేక్‌ ఇన్‌వాయిస్‌ ఫైల్‌ చేసి లాభాలు పొందవచ్చని వేణుమాధవ్‌రెడ్డి చెప్పడంతో శ్రీనివాస్‌ ఒప్పుకొన్నారు. తన జీఎస్టీ లైసెన్స్‌ ఉపయోగించుకున్నందుకు లాభాల్లో 50% వాటా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా 2022-25 వరకు జీఎస్టీ ఫైలింగ్‌తో రూ.90 లక్షలు సంపాదించారు.
శ్రీనివాస్‌కు లాభాల్లో రూ.45 లక్షలు రావాల్సి ఉండగా రూ.15 లక్షలు మాత్రమే చెల్లించాడు. ఇది ఫేక్ ఫైలింగ్ అని ప్రభుత్వం గుర్తించి జీఎస్టీ ఫైలింగ్‌లో అవకతవకలపై వేణుమాధవ్‌రెడ్డి, శ్రీనివాస్‌కు జీఎస్టీ విభాగం నోటీసులు జారీ చేసింది. బొగ్గుల బీబీక్యూ లైసెన్సును రద్దు చేసింది. లైసెన్సు పునరుద్ధరణ విషయంలో వారి మధ్య వివాదం మొదలైంది. అది ముదరడంతో శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకునేందుకు వేణుమాధవ్‌రెడ్డి ప్లాన్ చేశారు. ముగ్గుర్ని కిరాయికి కుదుర్చుకున్నారు. పోకల కోటేశ్వరరావు, షేక్‌ అబ్దుల్‌ హఫీజ్, ఎండీ హజ్మత్‌ అలీకి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు సుపారీ చెల్లించాడు.
పోలీసుల కథనం మేరకు.. ఈ నెల 13న వేణుమాధవ్ రెడ్డి బొగ్గుల శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి పెండింగ్‌ డబ్బులు చెల్లిస్తానని, విజయవాడకు వెళ్దామని చెప్పాడు. కారులో పోకల కోటేశ్వరరావుతో కలిసి శ్రీనివాస్‌ను ఎక్కించుకున్నాడు. దార్లో మద్యం తాగారు. శ్రీనివాస్‌ నిద్రలోకి జారుకోగానే ముందస్తు ప్లాన్ ప్రకారం వేచి ఉన్న హఫీజ్, హజ్మత్‌ అలీ వాహనంలోకి ఎక్కారు. ఈ నెల 14న తెల్లవారుజామున నకిరేకల్‌కు వచ్చాక కారును జనగామ వైపు వెళ్లే మళ్లించారు. ఐరన్‌ రాడ్డుతో తలపై బలంగా మోది హత్య చేశారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు కారును పాలేరు రిజర్వాయర్‌లోకి నెట్టి పరారయ్యారు. ఒంటిపై గాయాలు ఉండటంతో మృతిపై శ్రీనివాస్‌ సోదరులు అనుమానాలు వ్యక్తం చేశారు. కూసుమంచి సీఐ ఆధ్వర్యంలో స్పెషల్‌ టీంతో దర్యాప్తు ప్రారంభించి సాంకేతిక, ఇతర సాక్ష్యాల ఆధారంగా నలుగురిని అరెస్టు చేశారు. కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను పరిశీలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది.
Read More
Next Story