Encounter | భార్యతో చలపతి సెల్ఫీ..కోటి రూపాయల రివార్డుకు అదే కారణం..
x

భార్య అరుణతో చలపతి (selfie)

Encounter | భార్యతో చలపతి సెల్ఫీ..కోటి రూపాయల రివార్డుకు అదే కారణం..

మూడు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న చలపతి ఫొటో భద్రతా బలగాలను ఎలా దొరికింది?


మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్‌ చలపతి (62) తన కదలికల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. ఆ కారణంగానే భద్రతా బలగాలకు అతని గురించిన సమాచారం ఎక్కడా దొరకలేదు. మూడు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న చలపతి.. భద్రతా బలగాలకు ఎలా ఉంటాడో తెలిసింది మాత్రం 2016లో. అది కూడా తన భార్యతో తీసుకున్న సెల్ఫీ వల్ల.. అదే సెల్ఫీ ఫొటో ఆధారంగానే చలపతిని పట్టి ఇచ్చిన వారికి రూ. కోటి రివార్డు కూడా ప్రకటించారు.

పీడబ్ల్యూజీ భావజాలానికి ఆకర్షితుడై..

ఏపీలోని చిత్తూరు జిల్లా మాటెంపాయిపల్లి గ్రామానికి చెందిన చలపతి.. 1970 చివర్లో సీపీఐ పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. 1980లో ఇంటర్మీడియట్‌ చదువును మధ్యలోనే వదిలేసి.. శ్రీకాకుళం వెళ్లి పీడబ్ల్యూజీలో చేరాడు. తొలుత ఉద్దానం ప్రాంతంలో పనిచేసిన చలపతి.. చాలా తక్కువ సమయంలోనే పార్టీ సభ్యుడి నుంచి డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా (DCM) ఎదిగాడు. 2000 డిసెంబరులో స్పెషల్ జోనల్‌ కమిటీ మెంబర్‌గా ప్రమోట్ అయిన చలపతి.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్‌ కమిటీ (AOB-SZC) రాష్ట్ర మిలిటరీ కమిషన్‌లో స్థానం సంపాదించాడు. గురిల్లా యుద్ధ వ్యూహాలు, సైనిక ప్రణాళికలపై సరైన అవగాహన ఉండడంతో దళంలో మిగతా వారి కంటే చాలా త్వరగా ప్రమోట్ అయ్యాడు. కొన్ని దాడుల కోసం సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ చలపతి ప్రణాళికపై ఆధారపడేది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో మూడు దశాబ్దాలకు పైగా పలు దాడులను స్కెచ్ వేసింది కూడా చలపతే అన్న ఆరోపణలున్నాయి.

ఒక్క సెల్ఫీతో..

చలపతి ఎలా ఉంటాడో తెలుసుకోడానికి భద్రతా బలగాలకు చాలా ఏళ్లు పట్టింది. 2016 మేలో వారికి అతని గురించి కీలక సమాచారం దొరికింది. విశాఖపట్నంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు స్మార్ట్‌ఫోన్‌లో చలపతి, తన భార్య అరుణతో తీసుకున్న సెల్ఫీ(selfie)లభించింది.

అడవుల్లో నివసించే సమయంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోనల్‌ కమిటీ (AOBSZC) డిప్యూటీ కమాండర్‌ అరుణ అలియాస్‌ చైతన్య రవితో చలపతి సన్నిహితంగా ఉండేవాడు. కొంతకాలానికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం దళంలో తెలియడంతో ఏడాది పాటు చలపతిని సస్పెండ్‌ చేశారు. 2012లో జరిగిన సాంకేతిక తప్పిదం కారణంగా ఒక మావో చనిపోవడంతో చలపతికి డిమోషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పనిచేస్తున్న చలపతిపై రూ. 1 కోటి రివార్డ్‌ ఉన్న విషయం తెలిసిందే.

చలపతి(Chalapati) కొంతకాలంగా మోకాళ్ల నొప్పి, స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్నాడని సమాచారం. ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనానికి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ప్రథమ చికిత్స కేంద్రాల్లో గుట్టుగా చికిత్స పొందినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లా కుల్హాడీఘాట్‌ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter)లో మావోయిస్టు (Maoist) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి అలియాస్‌ చలపతి అలియాస్‌ జయరాం(62) మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 15 మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో 8 మందిని గుర్తించారు. చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒడిశాలో మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్, స్పెషల్‌ జోనల్‌ కమిటీ(ఎస్‌జడ్‌సీ) సభ్యుడు గుడ్డూ ఉన్నారు. ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

Read More
Next Story