US Updates: ట్రంప్ మద్యం ముట్టడు, సిగరెట్ కాల్చడు కానీ...
x

US Updates: ట్రంప్ మద్యం ముట్టడు, సిగరెట్ కాల్చడు కానీ...

అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పై ఆయన తండ్రి ఫ్రెడ్ ప్రభావం చాలా ఎక్కువ. జీవితమంటే గెలవడమనే సూత్రాన్ని ఆయన తండ్రి నుంచే నేర్చుకున్నారు.


అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ చాలా చిన్న వయసు నుంచే రెండు విషయాలు నేర్చుకున్నారు. ఈ ప్రపంచంలో ఉండేవి రెండే రెండు. 1. గెలుపు (కిల్లర్స్) 2. ఓటమి. ఇది ఆయన తండ్రి ఫ్రెడ్ నేర్పిన పాఠం. ట్రంప్ తండ్రి ఓ సంకల్పంతో ముందుకు సాగే రియల్ ఎస్టేట్ డెవలపర్. ఆయన శాసిస్తాడే తప్ప దేబరించడు. బహుశా తండ్రి ప్రభావం కుమారునిపై పడినందువల్లేనే ఏమో ట్రంప్ కూడా అదే తరహాలో వ్యవహరించేవారట. 'ది ఆర్ట్ ఆఫ్ ది డీల్' పుస్తకంలో ట్రంప్ బాల్యం, ఎదిగిన తీరు, ఆయన మనస్తత్వం వంటి అనేక వివరాలు ఉన్నాయి. "ట్రంప్ తండ్రి చాలా క్రూరమైన వ్యక్తి (very brutal guy). కఠినమైన, కష్టపడే మనిషి. భావోద్వేగాలు ఆయనకు పట్టవు" అని ఆ పుస్తకంలో ఉంది.

డోనాల్డ్ ట్రంప్ ను 13 ఏళ్ల వయస్సులో సైనిక పాఠశాలకు పంపాలని తండ్రి నిర్ణయించారు. లీడర్ షిప్ లక్షణాలు నేర్చుకోవాలన్నా, ఇతరులను మించి ఆధిపత్యం సాధించాలన్నా ఆర్మీస్కూల్ ఓ పెద్ద ప్రయోగశాల అనేది ట్రంప్ తండ్రి ఫ్రెడ్ అభిప్రాయం. ట్రంప్ ఆ స్కూలుకు పోనంటే కూడా కుదరదని తెగేసి చెబుతాడు. స్కూల్లో చేరిన రోజే ఎవరో విద్యార్థి ట్రంప్ ముఖం మీద గుద్దుతాడు. అలా మొదలైన ఆయన స్కూలు జీవితం ఆ తర్వాత ఆస్కూల్లో తానే నాయకుడయ్యే స్థాయికి చేరుకుంటారు. సైనిక్ స్కూలు ట్రంప్ కి అనేక పాఠాలు నేర్పింది. అవే తన భవిష్యత్ కి పునాదులు వేసినట్టు ట్రంప్ చెప్పకనే చెబుతారు. ఒకప్పుడు తోటి విద్యార్థులతో చెంపదెబ్బలు తిన్న ట్రంప్ ఆ తర్వాత ఎంతో ఆరితేరాడు. తన క్లాస్‌మేట్స్‌పై అరిచే స్థాయికి చేరాడు. మిగతా వారందర్నీ పక్కకుతోసేసి హాస్టల్ మొత్తాన్ని గడగడలాడించే స్థితికి వచ్చారు. ఉక్కు పిడికిలితో హాస్టల్ ను ఏలారు. "పిల్లలు మాట విననప్పుడు వాళ్లను కొట్టే సంస్కృతి సైనిక్ స్కూల్లో ఉండేది. దాన్నే విద్యార్థులూ నేర్చుకున్నారు" అని ట్రంప్ క్లాస్‌మేట్ శాండీ మెకింతోష్ చెప్పారు. ట్రంప్ తీరు చాలామంది విద్యార్థులకు నచ్చేది కాదు. చాలా మంది ఎగతాళి చేసేవారు. స్కూలు జీవితంలోనే అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం వల్ల నాయకత్వ లక్షణాలు అబ్బాయన్నది ఆయన సహచరుల మాట. పోటీ ఉన్నప్పుడే నాయత్వ పటిమ రాటుదేలుతుంది. ఇతర పిల్లలు ట్రంప్ ను ఇష్టపడకపోయినా, గేలి చేసినా ఆయన మాత్రం పోటీ నుంచి తప్పుకునే వారు కాదు. మొండి పట్టుదల ఆయనకు చిన్న తనం నుంచే ఉంది.
ఫ్రెడ్ కోరుకున్నది అదే. జీవితానుభవ పాఠాలకు సైనిక్ స్కూలు అనుకూలవైందన్నది ఆయన అభిప్రాయం. "డోనాల్డ్ తండ్రి తన పిల్లలకు ప్రత్యేకించి మగపిల్లలకు నేర్పిన పాఠం ఏమిటంటే.. ఇది జీవితం, ఇక్కడ గెలుపే ప్రధాన. పోటీపడండి, గెలవండి, కిల్లర్‌గా ఉండండి" అని అనేవారు. "గెలవడానికి మీరు ఏమి చేయాలో అది చేయండి" అనే సూత్రమే ట్రంప్ ను రెండోసారి అమెరికా అధ్యక్షుణ్ణి చేసింది.
డోనాల్డ్ ట్రంప్ కి తన తల్లి మేరీతో ప్రత్యేక అనుబంధమేమీ లేదు. ట్రంప్‌కు రెండున్నరేళ్ల వయసపుడే ఆమె జబ్బునపడ్డారు. మంచం పట్టారు. చిన్నతనంలోనే ఆయన తల్లి నుంచి దూరం అయ్యారు. అందువల్ల తండ్రీ, మేనత్తల పెంపకంలోనే ట్రంప్ పెరిగాడు. తండ్రి ప్రభావమే ట్రంప్ పై ఎక్కువగా ఉండేది. అదే ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
సైనిక స్కూల్లో చేరడం వల్లనో ఏమో ఆయనకు ఎటువంటి దుర అలవాట్లు అబ్బలేదు. ట్రంప్ ఇప్పటికీ మద్యం ముట్టరు. సిగరెట్ కాల్చరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన ఎదురులేని వ్యక్తి. అమెరికాలోని ప్రధానమైన అన్ని రాష్ట్రాల డౌన్ టౌన్లలో 100 లేదా అంతకుమించి అంతస్తులున్న భవనాలు ఆయన సొంతం. సొంత విమానాలు, హెలికాఫ్టర్లు మొదలు అద్భుత ప్యాలెస్ లు ఉన్నా ఆయన మాత్రం మద్యం, ధూమపానానికి దూరంగా ఉంటారు. "మా నాన్న అలా నేర్పి ఉంటారు" అన్నది ట్రంప్ మాట.
1992 నవంబర్‌ నుంచీ వరుసగా జరిగిన 8 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెజ్‌ జోసెఫ్‌ బైడన్‌ సహా ఐదుగురు నాయకులు ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. వారిలో ముగ్గురు బిల్‌ క్లింటన్, జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ (జూనియర్‌ బుష్‌), బరాక్‌ ఎచ్‌ ఒబామా రెండేసి సార్లు వరుసగా ఎన్నికల్లో గెలిచారు. ఒక్కొక్కసారి గెలిచిన ఇద్దరు– డొనాల్డ్‌ ట్రంప్‌ (78), జో బైడన్‌ (82). ఈ ఇద్దరిలో ట్రంప్‌ రెండో ప్రయత్నంలో ఓడిపోగా ఇప్పుడు మూడోసారి గెలిచారు. 1946లో జన్మించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ వయసు ఇప్పుడు 78 ఏళ్లు. మూడు పెళ్లిళ్లు. ఐదుగురు సంతానం.


Read More
Next Story