
ప్రజల భూమి బడా కంపెనీల పాలా? ధారాదత్తం ఆపండి: వడ్డే
పరిశ్రమల పేరుతో భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
’ప్రభుత్వమంటే ప్రజల ఆస్తులకు కాపలాదారు మాత్రమే కానీ.. యజమాని కాదు. అభివృద్ధి ముసుగులో లక్షలాది ఎకరాల విలువైన జనాల సొత్తును బడా కంపెనీలకు ధారాదత్తం చేయడం ప్రజాస్వామ్యానికే విఘాతం‘ అంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గుంటూరులోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ భూ కేటాయింపులపై జరిగిన ఈ సభలో.. ప్రభుత్వానికి, కార్పొరేట్ శక్తులకు మధ్య జరుగుతున్న భూ ఒప్పందాల గుట్టును రట్టు చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
పేదల భూములపై పడగ.. 99 ఏళ్ల లీజుపై విమర్శలు
రాష్ట్రంలోని 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని పేదల నుంచి లాక్కుని సోలార్ విద్యుత్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ భూములను కేవలం 99 పైసలకే, 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం ఏమాత్రం సహేతుకం కాదన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని, అక్రమ కేటాయింపులపై తాము వేసిన రిట్ పిటిషన్ ఈ నెల 27న హైకోర్టులో విచారణకు రానుందని ఆయన వెల్లడించారు.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. పెర్ని నాని ఘాటు వ్యాఖ్యలు
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పేర్ని నాని మాట్లాడుతూ.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, ఐదేళ్ల అధికారం ఇస్తే 99 ఏళ్ల పాటు భూములను ఎలా ధారాదత్తం చేస్తారు? అని ప్రశ్నించారు. వేల కోట్ల సబ్సిడీలు, వందలాది ఎకరాలు పొందిన గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి వచ్చే లాభమేంటో ప్రజలకు చెప్పాలన్నారు. విశాఖలో లులు కంపెనీకి 13.74 ఎకరాలను ఉచితంగా ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవదాయ, వక్ఫ్ భూములను సైతం వదలకుండా బడా కంపెనీలకు లీజుకిచ్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
ధరల వ్యత్యాసం.. శ్వేతపత్రం డిమాండ్
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. అమరావతిలో ఆర్‌బీఐకి ఎకరా 4 కోట్లకు అమ్మి, ప్రైవేట్ విద్యా సంస్థలకు మాత్రం 50 లక్షలకే ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి జరిగిన భూ కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారీ భూముల కేటాయింపులు ఉండటం గమనార్హమన్నారు.
క్రోనీ కాపిటలిజం.. రైతుల పోరాటం
శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, సీపీఎం నేత డి. రమాదేవి తదితరులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తన అనుయాయులకు భూములు పంచుతూ క్రోనీ కాపిటలిజాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సామాజిక వేత్త డాక్టర్ కుర్ర వసుంధర మాట్లాడుతూ.. కరేడులో ఇండోసోల్ కంపెనీకి ఇస్తున్న 8,400 ఎకరాల భూమి కోసం రైతులు సంఘటితంగా పోరాడుతున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్‌లో రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story

