“సభ వ్యక్తిగత అభిప్రాయాలతో కాదు..నిబంధనలతోనే నడుస్తుంది”
x

“సభ వ్యక్తిగత అభిప్రాయాలతో కాదు..నిబంధనలతోనే నడుస్తుంది”

లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా..


Click the Play button to hear this message in audio format

లోక్‌సభ స్పీకర్‌ను తొలగించాలనే తీర్మానం వీగిపోయిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా తొలిసారి స్పందించారు. గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ సభ వ్యక్తిగత అభిప్రాయాలతో కాకుండా నిబంధనల ప్రకారమే నడుస్తుందని స్పష్టం చేశారు. లోక్‌సభ నిబంధనల ప్రకారం సభ కార్యక్రమాలు జరుగుతాయని, ఏ సభ్యుడు అంగీకరించినా లేదా అంగీకరించకపోయినా ఆ విధానం అలాగే కొనసాగుతుందని తెలిపారు. సభను నిష్పక్షపాతంగా, నిజాయితీగా నిర్వహించేందుకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.

సభ్యులకు ధన్యవాదాలు..

స్పీకర్ పదవి ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని ఓం బిర్లా అన్నారు. తనపై జరిగిన చర్చలో విశ్వాసం ఉంచిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అనుకూలంగా మాట్లాడినవారికే కాదు, వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలిపిన సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. “సభ ఇప్పటివరకు నిబంధనల ప్రకారమే నడుస్తోంది. భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుంది. నా బాధ్యతలను పూర్తి నిజాయితీతో నిర్వర్తిస్తాను,” అని ఆయన చెప్పారు.

ఇక బడ్జెట్ సమావేశాల మొదటి విడత ఫిబ్రవరి 13న ముగిసింది. రెండో ధపా మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది.

మాట్లాడే హక్కుపై స్పష్టత..

గత రెండు రోజుల చర్చలో కొంతమంది సభ్యులు ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన బిర్లా, సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే హక్కు ఉన్నప్పటికీ అది నిబంధనల ప్రకారం ఉండాలని చెప్పారు. “ప్రధాని అయినా, ఏ మంత్రి అయినా స్పీకర్ అనుమతి లేకుండా మాట్లాడలేరు. సభలో ఎవరూ తమకు నచ్చిన సమయంలో మాట్లాడే హక్కు లేదు. స్పీకర్ అనుమతించినప్పుడు మాత్రమే మాట్లాడాలి,” అని ఆయన స్పష్టం చేశారు.

మైక్‌లపై వచ్చిన ఆరోపణలు..

సభలో సభ్యుల మైక్‌లను కావాలనే ఆఫ్ చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై కూడా బిర్లా స్పందించారు. “మైక్‌ను ఆన్ చేయడానికి లేదా ఆఫ్ చేయడానికి నా దగ్గర స్విచ్ ఉండదు. స్పీకర్ అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే సభ్యుడి మైక్ ఆన్ అవుతుంది,” అని ఆయన వివరించారు.

2019 నుంచి లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగుతున్న ఓం బిర్లా, సభ్యులకు సభలో మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని మరోసారి గుర్తుచేశారు.

Read More
Next Story