కళ్లెదుటే కాలిబూడిదైన బొలెరో డ్రైవర్!
x

కళ్లెదుటే కాలిబూడిదైన బొలెరో డ్రైవర్!

తెల్లవారుజామున ప్రశాంతంగా ఉన్న నంద్యాల-అమరావతి జాతీయ రహదారి ఒక్కసారిగా డ్రైవర్ ఆర్తనాదాలతో దద్దరిల్లింది


చీకటి విడిపోకముందే ఆ హైవేపై మృత్యువు మంటల రూపంలో కాటేసింది. తెల్లవారుజామున ప్రశాంతంగా ఉన్న నంద్యాల-అమరావతి జాతీయ రహదారి ఒక్కసారిగా డ్రైవర్ ఆర్తనాదాలతో దద్దరిల్లింది. రంగారెడ్డిపల్లె వద్ద జరిగిన ఈ భీకర ప్రమాదం స్థానికులను హతాశులను చేసింది.
క్షణాల్లో చుట్టుముట్టిన మంటలు
తుని నుంచి అనంతపురం వెళ్తున్న బొలెరో వాహనం.. రంగారెడ్డిపల్లె సమీపంలో వేగంగా వెళ్తూ ముందున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ ఎంత దారుణంగా ఉందంటే.. ఢీకొన్న మరుక్షణమే బొలెరో ఇంజిన్ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ స్వామి (50) స్టీరింగ్ వెనుక ఇరుక్కుపోయారు.
బయటపడదామని ప్రయత్నించినా..
మంటలు వేగంగా క్యాబిన్‌లోకి వ్యాపిస్తున్నా, కాళ్లు స్టీరింగ్ కింద ఇరుక్కుపోవడంతో స్వామి బయటకు రాలేకపోయారు. కళ్లెదుటే మంటలు దరి చేరుతున్నా, ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటం ఫలించలేదు. వాహనం డోర్లు జామ్ అయిపోవడం, చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ అగ్ని కీలల్లోనే ఆయన సజీవ దహనమయ్యారు. సమీపంలోని వారు అక్కడికి చేరుకునే లోపే బొలెరో పూర్తిగా అగ్నిగోళంలా మారిపోయింది.
మృత్యు ఒడి నుంచి తృటిలో..
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న మరో వ్యక్తి కందిపల్లి జయరామిరెడ్డికి కాలం కలిసి వచ్చింది. మంటలు వ్యాపించకముందే ఆయన ఎలాగోలా వాహనం నుంచి బయటకు దూకేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఆయన, తన కళ్ల ముందే సహచరుడు మంటల్లో కాలిపోతుంటే ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
పోలీసుల ఎంట్రీ
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే డ్రైవర్ స్వామి పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంగా మిగిలారు. రాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఢీకొట్టిన ఆ గుర్తు తెలియని వాహనం ఏది? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More
Next Story