
తిరుపతికి హై స్పీడ్ కనెక్టివిటీ
ఏపీ రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగంగా రైల్వే వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త రైలు మార్గాలు, హై స్పీడ్ కారిడార్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రయోజనాలపై ముఖ్యమంత్రి పలు ప్రతిపాదనలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.
హై స్పీడ్ కారిడార్లకు తిరుపతి అనుసంధానం
ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించిన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్లపై సీఎం చర్చించారు. ముఖ్యంగా బెంగళూరు-చెన్నై హై స్పీడ్ కారిడార్‌ను ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి కనెక్ట్ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే విశాఖ-విజయవాడ మధ్య హై స్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హై స్పీడ్ రైళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్
రాష్ట్ర ప్రజల చిరకాల కోరికైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమయ్యేలా తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. దీంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఏపీ రైల్వే ముఖచిత్రాన్ని మార్చే కీలక ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు సందర్శించే శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రైలు సౌకర్యం కల్పించేలా హైదరాబాద్-శ్రీశైలం-మార్కాపురం మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించాలని కోరారు. దీనితో పాటు, ఐటీ కారిడార్లను అనుసంధానిస్తూ విజయవాడ-బెంగళూరు మధ్య తిరుపతి మీదుగా కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం.. అక్కడ వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వడంతో పాటు రైలు బోగీ నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారనున్న సరకు రవాణా కారిడార్లపై (Freight Corridors) కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపేలా ఇటార్సీ-విజయవాడ మార్గంతో పాటు, ఏపీలోని పోర్టులను అనుసంధానిస్తూ ఖరగ్‌పూర్-చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా రాయలసీమ రైతులను ఆదుకునేలా తాడిపత్రి ప్రాంతం నుంచి ముంబై పోర్టుకు అరటి ఎగుమతుల కోసం 50 శాతం రాయితీతో ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని విన్నవించారు.
వెనుకబడిన ప్రాంతాలకు కనెక్టివిటీ రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలను రైలు మార్గాలతో అనుసంధానించడమే లక్ష్యంగా కొత్త ప్రతిపాదనలను సీఎం కేంద్రం ముందు ఉంచారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ కొత్త రైల్వే లైన్లు వెన్నెముకగా మారుతాయని, వీటిని కేంద్ర మంత్రి సానుకూలంగా పరిశీలిస్తారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

