చెవిరెడ్డికి బెయిల్..వైసీపీ సంబరాలు
x

చెవిరెడ్డికి బెయిల్..వైసీపీ సంబరాలు

ఈ కేసులో ఆయనతో పాటు నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా న్యాయస్థానం ఊరటనిచ్చింది.


అక్రమ మద్యం కేసులో గత ఏడున్నర నెలలుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో ఆయనతో పాటు నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా న్యాయస్థానం ఊరటనిచ్చింది. సరిగ్గా 226 రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో సిట్ అధికారుల అరెస్టుతో మొదలైన ఈ హైడ్రామాలో.. జైలు గోడల మధ్య అనారోగ్య సమస్యలతో పోరాడుతూ వచ్చిన చెవిరెడ్డికి ఈ తీర్పు ఒక భారీ ఊరటగా మారింది. అంతేకాకుండా అటు పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపింది.

ఏడు నెలల పోరాటం..

వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని, అందులో చెవిరెడ్డి పాత్ర ఉందంటూ గత ఏడాది జూన్ 17న బెంగళూరులో సిట్ (SIT) అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 226 రోజుల పాటు ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం కావాలనే తనను ఇబ్బందులకు గురిచేస్తోందని చెవిరెడ్డి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కూడా ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని మొదటి నుంచి గట్టిగా వాదిస్తూ వస్తోంది.

సిట్ అభియోగాలు..వైకాపా వాదన

ఈ కేసులో సిట్ (SIT) మోపిన అభియోగాలు అత్యంత సంచలనంగా మారాయి. మద్యం డిస్టిలరీల నుంచి కొల్లగొట్టిన వేల కోట్ల సొత్తును ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుకున్నారని, ఆ డబ్బే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు చేరిందని సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో చెవిరెడ్డిని కర్త, కర్మ, క్రియగా అభివర్ణిస్తూ ఆయన్ని ఏ-38గా, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఏ-39గా నిందితుల జాబితాలో చేర్చింది.

అయితే, ఈ ఆరోపణలను వైఎస్సార్‌సీపీ అంతే ధీటుగా తిప్పికొట్టింది. అసలు కుంభకోణానికే ఆస్కారం లేని చోట, కేవలం రాజకీయ కక్షతోనే కట్టుకథలు అల్లారని ఆ పార్టీ వాదిస్తోంది. అక్రమంగా కేసులు బనాయించి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ చెవిరెడ్డిని 226 రోజుల పాటు జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టారని, ఇదంతా కూటమి ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ క్రీడ అని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, ప్రభుత్వ ఆరోపణలకు న్యాయస్థానంలోనే సమాధానం దొరికిందని వైకాపా నేతలు భావిస్తున్నారు.

నేడు విడుదలయ్యే అవకాశం

హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చెవిరెడ్డి అభిమానులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆయనకు ఉపశమనం లభించడంతో చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read More
Next Story