
హైకోర్టుకు కోటి సంతకాల పోరాటం..ప్రభుత్వానికి కీలక నోటీసులు
కూటమి ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర ఉత్తర్వుల కోసం అనుబంధ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల భవిష్యత్తు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. "వైద్యం పేదవాడికి హక్కు.. అది వ్యాపారం కాకూడదు" అంటూ కూటమి ప్రభుత్వ పీపీపీ (PPP) విధానాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల సామాన్యులకు వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ఈ పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాష్ట్రంలోని 17 వైద్య కళాశాలలు ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని, ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదని పిటిషనర్ కోరారు.
పిటిషన్‌లోని ప్రధాన అంశాలు
వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిల్ (PIL) దాఖలు చేశారు. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదని కోరారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఈ కాలేజీలు ఏర్పాటయ్యాయని, ప్రైవేటీకరణ వల్ల ఆ లక్ష్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వానికి భారం కాకుండా గత ప్రభుత్వం అప్పట్లోనే స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించిందని కోర్టుకు తెలిపారు. కొన్ని సీట్లను డొనేషన్ పద్ధతిలో కేటాయించి, ఆ నిధులను ఆసుపత్రుల అభివృద్ధికి వాడే విధానం ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపట్టిన టెండర్ల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర ఉత్తర్వుల కోసం అనుబంధ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము సేకరించిన కోటి సంతకాలను ప్రజాభిప్రాయంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కౌంటర్ దాఖలు చేయండి
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, గతంలో ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఎస్‌ఐడీసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ లను ప్రతివాదులుగా చేర్చారు.
Next Story

