
విజయవాడలో హైటెక్ లూటీ..5.28 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు
ఈ భారీ స్కామ్ వెనుక ఉన్నది అంతర్రాష్ట్ర ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
విజయవాడ నగరంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సెస్ బ్యాంక్ (Axis Bank) శాఖలను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అత్యంత చాకచక్యంగా భారీ దోపిడీకి పాల్పడ్డారు. పక్కా స్కెచ్‌తో బ్యాంక్ వెరిఫికేషన్ సిస్టమ్‌నే సవాల్ చేస్తూ, నకిలీ పత్రాలతో అధికారుల కళ్లు గప్పి ఏకంగా రూ. 5.28 కోట్లకు పైగా నిధులను మాయం చేశారు. ఏలూరు రోడ్, గుణదల, బెంజ్ సర్కిల్ వంటి నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మూడు ప్రధాన బ్రాంచ్‌ల్లో ఈ కుచ్చుటోపీ వ్యవహారం సాగడం ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్నది అంతర్రాష్ట్ర ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నకిలీ అవతారాలు..ఆధార్ కార్డుల నుంచి పే-స్లిప్‌ల వరకు అంతా ఫేక్
ఈ నిందితుల మోసపూరిత పద్ధతులు చూసి దర్యాప్తు అధికారులు సైతం అశ్చర్యపోతున్నారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నట్లుగా నిందితులు నకిలీ పే-స్లిప్‌లు (Pay Slips) సృష్టించి, భారీ ఆదాయం ఉన్నట్లు నమ్మించారు. కేవలం ఆదాయ ధృవీకరణే కాదు, వీరు సమర్పించిన ఆధార్ కార్డులు, అడ్రస్ ప్రూఫ్‌లు కూడా నకిలీవేనని తేలింది. ఈ నకిలీ గుర్తింపులతో బ్యాంక్ ఖాతాలను తెరిచి, వాటికి అనుబంధంగా పొందిన క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కడా అనుమానం రాకుండా రూ. 5,28,19,939 నగదును డ్రా చేసి ఊడ్చేశారు. రియల్ టైం ట్రాకింగ్‌లో దొరక్కుండా ఐపీ అడ్రస్‌లను కూడా మాయం చేసినట్లు తెలుస్తోంది.
రంగంలోకి సైబర్ క్రైమ్ టీమ్
బ్యాంక్ ఖాతాల్లో అసాధారణ లావాదేవీలను గమనించిన ఉన్నతాధికారులు అంతర్గత తనిఖీ నిర్వహించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. సిసిటీవీ ఫుటేజ్, నకిలీ పత్రాల మూలాలు, నిందితుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఇంతటి భారీ స్థాయిలో, మూడు వేర్వేరు బ్రాంచ్‌ల్లో ఎలాంటి ఆటంకం లేకుండా మోసం సాగిందంటే.. బ్యాంక్ లోపలి వ్యక్తుల సహకారం ఏదైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ హైటెక్ దొంగతనం ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Next Story

