
డీటీని పెళ్లి చేసుకున్నాడని రాళ్లతో కొట్టి చంపారు
పెళ్లయిన కొన్ని గంటలకే రక్తపు మడుగులో వరుడు.
ఏడడుగులు నడిచారు.. నూరేళ్లూ కలిసుండాలని మొక్కుకున్నారు.. కానీ ఆ దేవుడు దీవించినా, కన్నవారే కాలయములై విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో కులాంతర వివాహం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ద్వారపూడి శివారు వేములపల్లిలో జరిగిన ఈ దారుణ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక ఉన్నత అధికారిణి (డిప్యూటీ తహసీల్దార్) మనసుపడి చేసుకున్న పెళ్లి, ఆమె జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని యువతి సోదరులు రాళ్లతో కొట్టి చంపారు.
ప్రేమ పీటల నుంచి.. కాటి కాలవ వరకు
జెడ్ మేడపాడ గ్రామానికి చెందిన సంధ్య డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె వేములపల్లికి చెందిన బట్టల వ్యాపారి సూర్య ప్రకాష్ రావును గత కొంతకాలంగా ప్రేమిస్తున్నారు. కులాలు వేరైనా, మనసులు కలిశాయని భావించిన ఈ జంట, పెద్దలను ఒప్పించలేక అన్నవరం సత్యదేవుని సన్నిధిలో గురువారం వివాహం చేసుకున్నారు. పెళ్లి పీటల మీద ఎంతో సంతోషంగా కనిపించిన ఆ జంటను చూడలేకపోయారు సంధ్య కుటుంబ సభ్యులు.
అర్ధరాత్రి రాళ్లతో వేట.. అడ్డువచ్చిన చెల్లెలి ముందే దారుణం
పెళ్లయిన కొద్ది గంటలకే.. కొత్త జంట వేములపల్లికి చేరుకోగా, అప్పటికే అక్కడ కాపుగాచిన సంధ్య అన్నదమ్ములు మృగాల్లా విరుచుకుపడ్డారు. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీశారన్న కక్షతో సూర్య ప్రకాష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. సంధ్య కళ్లముందే ఆమె అన్నదమ్ములు రాళ్లతో సూర్య ప్రకాష్‌ను బాదారు. తీవ్ర గాయాలైన సూర్య ప్రకాష్ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు వదిలాడు. తాళి కట్టిన భర్తను కాపాడుకునేందుకు సంధ్య చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.
పోలీసుల అదుపులో నిందితులు
సమాచారం అందుకున్న వెంటనే మండపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విచక్షణ కోల్పోయి దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వేములపల్లి, జెడ్ మేడపాడ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదువుకున్న వారు, సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సైతం ఇలాంటి దాడులకు గురికావడం సామాజిక విజ్ఞుల ఆందోళనకు దారితీస్తోంది.
Next Story

