మహారాణిలా చూసుకుంటానని మధ్యలోనే వదిలేశాడు
x

మహారాణిలా చూసుకుంటానని మధ్యలోనే వదిలేశాడు

పురిటి బిడ్డను దూరం చేసి భార్యను గెంటేశాడు.


నన్ను పెళ్లి చేసుకుంటే మహారాణిలా చూసుకుంటా.. అపారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి అంటూ నమ్మబలికాడు. ఆ మాయమాటలకు మోసపోయిన ఆ యువతి కన్నవారిని కాదనుకుని మరీ అతడిని చేరింది. కానీ, తీరా పెళ్లయ్యాక ఆ ప్రేమ కాస్తా పగగా మారింది. పురిటి బిడ్డను దూరం చేయడమే కాకుండా, ఇప్పుడు ఆమెను ఇంటి నుంచి గెంటేసి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ప్రేమించి పెళ్లి.. కన్నవారికి దూరం
అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన గాయత్రి (23) బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న సమయంలో, రాజశేఖర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మదనపల్లెలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్, తన ప్రేమాభిషేకాలతో ఆమెను నమ్మించాడు. గాయత్రి తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించినప్పటికీ, కన్నవారిని ఎదిరించి మరీ రాజశేఖర్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో 2024 డిసెంబర్ 4న బన్నేరుగట్టలోని ఓ ఆలయంలో రాజశేఖర్‌ను వివాహం చేసుకుంది. దిన్నెమీదపల్లిలో వీరి కాపురం కొన్నాళ్ల పాటు సజావుగా సాగింది.
బిడ్డ మరణంపై అనుమానాలు.. కడచూపుకు నోచుకోని తల్లి
గాయత్రి గర్భం దాల్చిన తర్వాత ఏడు నెలలకే పురిటి నొప్పులు రావడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందింది. కోలుకున్నాక తన బిడ్డ ఏాడని ప్రశ్నించగా, బిడ్డ చనిపోయాడని భర్త నిర్దయగా చెప్పాడు. కనీసం కన్నబిడ్డ కడచూపు కూడా చూసుకోనివ్వకుండా వ్యవహరించిన తీరుపై గాయత్రి కంటతడి పెట్టింది. ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత కొద్దిరోజులకే పుట్టింటికి పంపించివేసిన రాజశేఖర్, అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేశాడు.
అత్తారింటి ముందు గేటు వేసి అవమానం
భర్తలో వచ్చిన మార్పును గమనించిన గాయత్రి, గత ఫిబ్రవరిలో కన్నవారితో కలిసి అత్తారింటికి వెళ్లగా, ఆమెను లోపలికి రానివ్వకుండా గేటు వేసి అవమానించారు. తనను వదిలించుకుని రాజశేఖర్‌కు మరో పెళ్లి చేసే ప్రయత్నాల్లో అత్తమామలు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం కోసం దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించిన గాయత్రి, తనకు తన భర్త కావాలని, జరిగిన అన్యాయంపై విచారణ జరపాలని కోరుతోంది.
Read More
Next Story