ఎవరికైనా కష్టం వచ్చిందంటే.. అయ్యో! అలా అయిందా పాపం? అంటూ విలవిల్లాడిపోతారు. వారి కష్టంలో పాలు పంచుకోవడానికి తాపత్రయ పడతారు. వారు సన్నిహితులైతే తోబుట్టువులా, ఓ కుటుంబ సభ్యుడిలా, ఓ ప్రాణ స్నేహితుడిలా ఓదారుస్తారు. వారి గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపుతారు. అది తన కింద పనిచేసే ఉద్యోగి అని కూడా చూడరు. భేషజం అస్సలు చూపరు. ఆ సమయంలో వారికి ఓదార్పునివ్వడమే ఆయనకు తెలుసు. విలువలకు, నిజాయితీకి, నీతికి ప్రాణమిస్తారు. జర్నలిజంలో ఎవరికైనా ఉద్యోగం పోయిందని తెలిస్తే.. `ఫలానా చోట ఖాళీ ఉంది. అక్కడ చేస్తాడేమో అడగండి` అంటూ ఉదారతను చాటతారు. ఇవన్నీ టీకే లక్ష్మణరావు గారికే సొంతం. ఆయన గురించి నాకు తెలిసినవి కొన్నే. నాకు తెలియని గొప్ప విషయాలు ఆయనలో ఇంకెన్ని ఉన్నాయో! అందుకే ఆయన లక్ష్మణరావు కాదు.. సలక్షణరావు అనడమే సముచితంగా ఉంటుంది.
మహా మనీషి లక్ష్మణరావు..
నా వరకు నాకు లక్ష్మణరావు గారు ఓ మహా మనిషి. కాదు కాదు.. మనీషి! ఆయనతో నా అనుబంధానికి 24 ఏళ్లు. అది 2002వ సంవత్సరం. అప్పట్లో నేను వార్త దినపత్రికకు విశాఖపట్నంలో స్టాఫ్ రిపోర్టరుగా ఉన్నాను. రెండేళ్ల నా చిన్న కుమారుడు వైజాగ్‌లో చికిత్స చేయిస్తున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లో నన్ను శ్రీకాకుళం జిల్లా పాలకొండకు బదిలీ చేయడంతో వెళ్లి చేరాను. ఆ పరిస్థితుల్లో నన్ను మళ్లీ వైజాగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయమని కోరితే మేనేజిమెంట్ కుదరదంది. అప్పటికే మా బాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరో చెబితే తెలుసుకున్నారాయన. (అప్పటికి ఆయనతో నాకు అంతగా పరిచయం లేదు) అంతే.. లక్ష్మణరావు గారే స్వయంగా వార్త అధినేత గిరీష్ సంఘీ గారిని కలిసి నా పరిస్థితిని వివరించారు. మానవత్వంతో స్పందించి బదిలీ చేయమని కోరడంతో మూడు నెలలకే మళ్లీ నన్ను వైజాగ్ బదిలీ చేశారు. లక్ష్మణరావు గారి కృషితోనే నేను మళ్లీ వైజాగ్ రాగలిగాను.
నన్ను వెన్నుతట్టి ..ప్రోత్సహించి..
వార్త దినపత్రికలో ఉండగా 2005లో నీటి సమస్యపై నేను రాసిన కథనానికి అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఆ అవార్డును హైదరాబాద్‌లో అందుకున్నాను. ఆ కార్యక్రమానికి అవార్డును ఇచ్చే జెనీవా ప్రతినిధులతో పాటు గిరీష్ సంఘీ గారు కూడా హాజరయ్యారు. అవార్డు తీసుకున్నాక నన్ను ట్యాంక్ బండ్‌లోని వార్త హెడ్డాఫీసుకు రప్పించి అక్కడ మరోసారి సన్మానించారు. అప్పుడు గిరీష్ సంఘీ గారికి లక్ష్మణరావు గారు ఇలా గుర్తు చేశారు. `సార్.. నేను ఈ కోటేశ్వరరావు గారి ట్రాన్స్‌ఫర్ గురించే మీతో చెప్పాను. పాలకొండ నుంచి వైజాగ్ ట్రాన్స్‌ఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే చేశారు.` అంటూ లక్ష్మణరావు గారు ఎంతో ఆనందంతో చెప్పిన విషయాన్ని మరిచిపోలేను. వార్త నుంచి సాక్షిలో చేరాక కూడా ఆయనతో నా ప్రయాణం కొనసాగింది. ఆయన సాక్షిలో మఫిసిల్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు నేను రాసిన కథనాలను ఎంతగానో మెచ్చుకునే వారు. ఫోన్ చేసి మరీ అభినందించే వారు. అందులో తనకేమి నచ్చిందో కూడా చెప్పేవారు. అలా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. సాక్షిలో పని చేస్తుండగా 2013లో నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హైదరాబాద్‌లో అప్పటి నెట్‌వర్క్ ఇనా్చార్జి ఒకాయన నా పట్ల అమానవీయంగా ప్రవర్తించడాన్ని తెలుసుకున్న లక్ష్మణరావు గారు ఎంతగానో నొచ్చుకున్నారు. బాధపడ్డారు. నాకు ఓదార్పునిచ్చారు. ఇప్పటివరకూ నా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూనే ఉన్నారాయన. గతంలో కొన్ని నెలల క్రితం లక్ష్మణరావు గారబ్బాయి పెళ్లికి హైదరాబాద్ వెళ్లాను. ఇంటి నుంచి కల్యాణ మండపానికి మేమిద్దరం పక్కపక్కనే కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లాం.
మంచి కథనాలను మెచ్చుకునే లక్షణం..
లక్ష్మణరావు గారిలో నాకు కనిపించే మంచి లక్షణాల్లో మరొకటేమిటంటే.. ఏ జర్నలిస్టయినా మంచి కథనాన్ని రాసినా, మంచి హెడ్డింగ్ పెట్టినా మెచ్చుకోవడం. అలాంటివి నాతో పంచకుకున్న సందర్భాలెన్నో. వార్త, సాక్షిల్లోనే కాదు.. నేను సాక్షి నుంచి వచ్చాక "ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్"కు రాస్తున్న కథనాలకూ ఫోన్ చేసి మరీ అభినందించడాన్ని మరిచిపోలేను. దాదాపు నెల రోజుల నుంచి మా మధ్య ఫోన్లు లేవు. అప్పుడప్పుడు ఆయనకు ఫోన్ చేయాలనుకున్నా ఎందుకో చేయలేకపోయాను. లక్ష్మణరావు గారి ఆరోగ్యం బాగులేదన్న సంగతి నాకు తెలియదు. ఇంతలోనే గత మంగళవారం పిడుగులాంటి వార్త.. లక్ష్మణరావు గారు ఇక లేరని సోషల్ మీడియాలో చూశాక గుండె పగిలినట్టయింది. నా శ్రేయోభిలాషి.. గురు సమానులు, కష్టాల్లో పాలుపంచుకునే మహా మనిషి దూరమయ్యారన్న వాస్తవం నన్ను, మా కుటుంబ సభ్యులను ఎంతగానో బాధిస్తోంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని, వైకుంఠ/ ముక్కోటి ఏకాదశి పర్వదినాన అందరినీ దుఃఖసాగరంలో ముంచి స్వర్గ లోకానికేగిన లక్ష్మణరావు గారికి సద్గతులు ప్రాప్తించాలని ఆ దేవుడిని వేడుకుంటూ.. `ఏకాశి మరణం.. ద్వాదశి దహనం` అంటారు. అలాంటి మరణాన్ని దక్కించుకున్న లక్ష్మణరావు గారు ధన్యులు.. పుణ్యాత్ములు.. లక్ష్మణరావు గారికి అశృనయనాలతో..
( ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో టీ కే లక్ష్మణరావు గారి సంతాపసభ సందర్భంగా)