
పవన్ కల్యాణ్ పాలనా వైఫల్యం చెందారా?
ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం ఇచ్చేందుకు తమ వద్ద నిధులు లేవని చెప్పటం పంచాయతీరాజ్ శాఖ అసమర్థతా? పవన్ కల్యాణ్ పాలనా వైఫల్యమా? అనే చర్చ ఏపీలో మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 20 నెలలుగా ZPTC, MPTC సభ్యులకు గౌరవ వేతనాలు చెల్లించకపోవడం పాలనా వైఫల్యంగా కొందరు వర్గీకరిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన స్థానిక ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ శాఖ అధికారులు 'బడ్జెట్ లేకపోవడం' అంటూ మెమో దాఖలు చేయడం ఆర్థిక నిర్వహణలోని లోపాలను బట్టబయలు చేసింది. 2025 ఆగస్ట్‌లో సీపీఎం నేతలు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 1,121 కోట్లు విడుదల చేయాలంటూ పవన్ కళ్యాణ్‌కు లేఖ రాయడం, అలాగే 2024 నవంబర్‌లో రూ. 750 కోట్లు పంచాయతీలకు విడుదల చేస్తామని ప్రకటించినా ఆచరణలో ఆలస్యం కనిపిస్తోంది. ఇది గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చకుండా, ఉద్యోగులు, ప్రతినిధుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు సూచిస్తోంది. 2025 డిసెంబర్‌లో శాఖలో సంస్కరణలు అనౌన్స్ చేసినా, సాలరీ హైక్‌లు ఆర్థిక స్థిరత్వం వచ్చిన తర్వాతే అంటూ వాయిదా వేయడం పాలనా అసమర్థతను మరింత బలపరుస్తోంది.
విపక్షాల ఆరోపణలు ముమ్మరం
మరోవైపు, ఈ సమస్యను రాజకీయ వైఫల్యంగా మరికొందరు చూస్తున్నారు. ముఖ్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్నికైన స్థానిక ప్రతినిధులు ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ కి చెందిన వారు కావడం వల్ల ఉద్దేశపూర్వకంగా నిధులు అడ్డుకోవడంగా ఆరోపణలు వస్తున్నాయి. 2025 ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ గత ప్రభుత్వాన్ని పంచాయతీ ఫండ్స్ మిస్యూజ్ అంటూ విమర్శించినా, తన శాఖలోనే ఆర్థిక సమస్యలు పేరుకుపోవడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2024 జూలైలో పవన్ కల్యాణ్ తన సాలరీ తీసుకోకుండా ఉండటం, డిపార్ట్మెంట్‌లో డెబిట్స్ ఉన్నాయంటూ చెప్పడం కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతల లోపాన్ని సూచిస్తోంది. ఒకవైపు భారీ ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, గ్రాస్‌రూట్ ప్రతినిధులకు కనీస వేతనాలు ఇవ్వలేకపోవడం రాజకీయ ప్రతీకారానికి సంకేతమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పవన్ కల్యాణ్ రాజకీయ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా గ్రామీణ వర్గాలపై దృష్టి సారించినట్లు చెప్పుకుంటున్నా, ఈ వివాదం కూటమి ప్రభుత్వానికి భవిష్యత్ ఎన్నికల్లో అసంతృప్తిని పెంచవచ్చు.
20 నెలలుగా గౌరవ వేతనం ఇవ్వటం లేదు
గత 2024 జూన్ నుంచి 20 నెలలుగా ZPTC, MPTC సభ్యులకు గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కొందరు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై వాదనలు వినిపిస్తూ ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ‘ప్రజా ప్రతినిధులకు జీతాలు చెల్లించలేని ప్రభుత్వం, అమరావతిలో రూ. 1,750 కోట్లతో విగ్రహాలు నిర్మించడం హాస్యాస్పదం’ అంటూ పిటిషనర్లు కోర్టులో వాదించడం, కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతల లోపాన్ని సూచిస్తోంది. రాజకీయంగా చూస్తే ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మధ్య సమన్వయ లోపాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఒకవైపు భారీ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుండగా గ్రామీణాభివృద్ధి శాఖలోని స్థానిక ప్రతినిధులకు కనీస గౌరవ వేతనాలు కూడా ఇవ్వలేకపోవడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశం.
ఉద్దేశ్య పూర్వకంగా చేసిందేనా?
శాఖ కమిషనర్ హైకోర్టులో దాఖలు చేసిన మెమోలో ‘‘డ్జెట్ లేకపోవడంతో గౌరవ వేతనాలు చెల్లించలేకపోయాం... కొంచెం సమయం ఇస్తే చెల్లిస్తాం’’ అంటూ పేర్కొనడం ప్రభుత్వం ఆర్థిక అసమర్థతను బహిర్గతం చేసింది. కానీ రాజకీయ కోణంలో ఇది మరింత లోతుగా పరిశీలిస్తే... గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు (ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ తరపున గెలిచినవారు)కు ఉద్దేశపూర్వకంగా నిధులు అడ్డుకోవడంగా కనిపిస్తోందనే విమర్శలు వచ్చాయి. విపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయి. ‘‘కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ అనుకూలవర్గాలను దెబ్బతీయడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటోంది’’ అనే విమర్శలు ఉన్నాయి. ఇది రాజకీయ ప్రతీకారానికి సంకేతమా? లేక నిజంగానే ఆర్థిక సంక్షోభమా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
స్థానిక ప్రజా ప్రతినిధుల డిమాండ్
పిటిషనర్లలో ఒకరైన ZPTC సభ్యురాలు లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘ప్రభుత్వం విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు చేస్తుంది, కానీ మాకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదంటే ఏమిటి ఈ దౌర్భాగ్యం? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే స్పందించాలి’’ అని హెచ్చరించారు. మరో MPTC సభ్యుడు రామకృష్ణారెడ్డి ‘‘ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగమవుతున్నాయా?’’ అంటూ ప్రశ్నించడం, ప్రభుత్వం పారదర్శకత లోపాన్ని సూచిస్తోంది. రాజకీయంగా చూస్తే పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధిని 'చేసి చూపిస్తాను' అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, శాఖ అధికారులు కోర్టులో 'డబ్బులు లేవు' అంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఆయన రాజకీయ ఇమేజ్‌కు దెబ్బతీస్తోంది. జనసేన పార్టీ అధినేతగా ఆయన గ్రామీణ వర్గాలపై దృష్టి సారించినట్లు చెప్పుకుంటున్నా, ఈ సంఘటన ఆయన నిర్వహణా సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.
ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తోందా?
మరోవైపు కోర్టుల ప్రక్రియలోనూ రాజకీయ కోణం కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. న్యాయవాదులు కొందరు ‘‘ప్రభుత్వం కోరితే సమయం ఇస్తుంది, అదే ఇతరులు కోరితే కనీస సమయం ఇవ్వటం లేదు’’ అంటూ ఆరోపిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని న్యాయవ్యవస్థపై రాజకీయ ప్రభావాన్ని సూచిస్తుందా? అనే అనుమానాలు కలుగజేస్తోంది. లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ఉద్యోగులు, పెన్షనర్లకు సమయానికి చెల్లింపులు చేయలేకపోతున్న ప్రభుత్వం, వేల కోట్లతో రోడ్లు వేస్తున్నామంటూ ప్రకటనలు చేయడం, రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ గ్రాస్‌రూట్ స్థాయి సమస్యలను నిర్లక్ష్యం చేస్తోంది.
విపక్షాలకు ఆయుధం
వచ్చే వారం హైకోర్టు విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వివాదం కూటమి ప్రభుత్వంపై విపక్షాలకు మరిన్ని ఆయుధాలు అందిస్తోంది. వైఎస్సార్‌సీపీ నేతలు ‘ఇది ప్రజలకు ద్రోహం’ అంటూ ఆరోపిస్తుండగా కూటమి నేతలు మౌనం వహిస్తున్నారు. రాజకీయంగా ఇది 2029 ఎన్నికల ముందు గ్రామీణ వర్గాలలో అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయకపోతే, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు తప్పవని జడ్పీటీసీ, ఎంపీటీసీలు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య కాకుండా రాజకీయ వైఫల్యానికి అద్దం పట్టినట్లుంది.

