
మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణకు 'హనుమాన్' ప్రాజెక్ట్
సమగ్ర వ్యూహాలు, సాంకేతికతలు, సమాజిక సహకారం ద్వారా మానవ-వన్యప్రాణి ఘర్షణల నివారణ సాకారమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో ఏనుగులు, పులులు వంటి జంతువులతో ఘర్షణలు తగ్గించడానికి ఫెన్సింగ్ వ్యవస్థలు, ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరికలు, డ్రోన్ పర్యవేక్షణ వంటి ఆధునిక సాధనాలు విజయవంతమవుతున్నాయి. ఉదాహరణకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ 'హనుమాన్' ప్రాజెక్ట్ లాంటి కార్యక్రమాలు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, గ్రామస్థాయి శిక్షణ, పరిహార వ్యవస్థల ద్వారా ప్రజలు, జంతువుల రక్షణను సమతుల్యం చేస్తున్నాయి. అయితే అటవీ నష్టం, జనాభా పెరుగుదల వంటి మూల కారణాలను పరిష్కరించకపోతే ఇది సవాలుగా మారుతుంది. కాబట్టి పర్యావరణ సమతుల్యత, స్థానిక సమాజాల భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాలు కలిసి పనిచేస్తే మాత్రమే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుంది.
హనుమాన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండె
మానవులు, వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణలను నివారించి రెండు వర్గాల సంరక్షణకు హామీ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ 'హనుమాన్' (హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్) ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజల రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడమే కాకుండా వన్యప్రాణుల సంరక్షణను కూడా బలోపేతం చేయనుంది. ‘ఇటీవల కాలంలో వన్యప్రాణుల దాడుల వల్ల పంటలు, పశువులు, మానవ భద్రతకు ముప్పు పెరిగింది. ఈ సమస్యలను తగ్గించడానికి హనుమాన్ ప్రాజెక్ట్‌ను సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ పద్ధతులతో రూపొందించాం’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ కింద 93 ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, 7 అంబులెన్స్‌లు సిద్ధం చేశారు. వీటితో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లో నాలుగు వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్లు, 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సేవలందిస్తాయి. ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, గిరిజన సహాయకులు, పారా వెటర్నరీలు ఉంటారు. గ్రామ స్థాయిలో 'వజ్ర' (వన్య జీవి రక్షక్) బృందాలను ఏర్పాటు చేసి, వారికి రెస్క్యూ కిట్లు, శిక్షణ అందిస్తున్నారు. ఇది స్థానిక సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించడానికి సహాయపడుతుంది.
సర్పాల గురించి వివరిస్తున్న అటవీ శాఖ అధికారులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ-వన్యప్రాణి సంఘర్షణల్లో నష్టపోయినవారికి పరిహారాలను పెంచారు. మరణాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు, గాయాలకు రూ.2 లక్షలకు పెంచారు. పశువుల నష్టానికి మార్కెట్ విలువ ఆధారంగా చెల్లిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,107 కేసుల్లో రూ.4 కోట్ల పరిహారం చెల్లించారు. చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్యను పరిష్కరించడానికి కర్ణాటక సహకారంతో 4 కుంకీ ఏనుగులను తీసుకొచ్చి 8 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు.
అధునాతన సాంకేతికతలను ఉపయోగించి వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడానికి ఏఐ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. అటవీ సరిహద్దుల్లో ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా హనుమాన్ డిజిటల్ యాప్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లను కూడా లాంఛనంగా ప్రారంభించారు. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
‘వన్యప్రాణుల సంరక్షణ చేస్తూనే ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే హనుమాన్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. అటవీ శాఖ అధికారులు, ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థల సేవలను పవన్ ప్రశంసించారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పీవీ చలపతిరావు పాల్గొన్నారు.

