
బెజవాడలో ’గన్‘ కలకలం..పోలీసులపైనే కాల్పులకు యత్నం
దుండగుడు తెలంగాణకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం విజయవాడ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బస్టాండ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ఒక భయానక దృశ్యం వెలుగులోకి వచ్చింది. నగరంలోని హోటళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక సాయుధ దుండగుడు ఏకంగా అధికారులపైనే తుపాకీ గురిపెట్టి కాల్పులకు తెగబడటం బెజవాడలో పెను సంచలనం సృష్టించింది. సాంకేతిక లోపం వల్ల బుల్లెట్ పేలక పోవడం వల్ల, ట్రిగ్గర్ నొక్కినా గన్ ఛాంబర్‌లోకి రాకపోవడంతో పోలీసులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డారు.
కార్డన్ సెర్చ్‌లో అనూహ్య పరిణామం
విజయవాడ పోలీసులు, ప్రత్యేక ఈగల్ విభాగం అధికారులు కలిసి బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో కార్డన్ సెర్చ్ (తనిఖీలు) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక గదిని తనిఖీ చేస్తుండగా, అక్కడున్న వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద దాచుకున్న 9 MM పిస్టల్‌ను తీసి పోలీసులపైకి గురిపెట్టాడు. ఎవరూ ఊహించని విధంగా అతడు ట్రిగ్గర్ నొక్కడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ప్రాణాలకు తెగించి పట్టుకున్న పోలీసులు
దురదృష్టవశాత్తూ పిస్టల్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా బుల్లెట్ బయటకు రాలేదు. తన ప్రయత్నం విఫలం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. అయితే, ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించిన పోలీసులు, ఈగల్ అధికారులు అతడిని వెంటాడి, చాకచక్యంగా బంధించారు. నిందితుడి నుంచి పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కుట్ర కోణంలో దర్యాప్తు
నిందితుడిని తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని వెంటనే టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించి విచారణ ముమ్మరం చేశారు. అసలు అతడు విజయవాడకు ఎందుకు వచ్చాడు? మారణాయుధమైన గన్ అతడికి ఎక్కడ దొరికింది? నగరంలో ఎవరినైనా హతమార్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి కుట్ర పన్నాడా? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.
నడిరోడ్డుపై భయానక దృశ్యం.. వణికిపోయిన విజయవాడ
విజయవాడ నగరంలో అత్యంత రద్దీగా ఉండే బస్టాండ్ పరిసరాల్లో, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సమయంలో ఇలాంటి ఘటన జరగడం సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే ఒక దుండగుడు తుపాకీ గురిపెట్టడం చూసి స్థానికులు ఒక్కసారిగా వణికిపోయారు. హోటల్ గదుల్లో మారణాయుధాలతో అపరిచితులు తలదాచుకోవడం బెజవాడ వాసుల్లో అభద్రతా భావాన్ని కలిగించింది.
పోలీసుల హై అలర్ట్ .. నిఘా కట్టుదిట్టం
ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నగరంపై ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతల దృష్ట్యా బస్టాండ్, రైల్వే స్టేషన్ , లాడ్జీల పరిసరాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రతి హోటల్ , లాడ్జీలో వచ్చే పర్యాటకుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డన్ సెర్చ్‌లను ముమ్మరం చేస్తూ, అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచుతామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Next Story

