
ఉద్యోగుల 7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
వారసత్వంగా వచ్చిన బకాయిలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న తరహా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల ప్రస్తుత స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. గతంలో తాను ఇచ్చిన ఆదేశాల మేరకు బిల్లుల విడుదల ప్రక్రియ ఏ దశలో ఉందో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల ఖాతాల్లోకి భారీగా నిధులు
సమీక్షలో భాగంగా, ఉద్యోగులకు ఊరటనిచ్చేలా మొత్తం రూ. 7,358 కోట్ల మేర పెండింగ్ బిల్లుల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిలో భాగంగా ఇప్పటికే రూ. 1,848 కోట్ల ప్రావిడెంట్ ఫండ్ (PF) బకాయిలను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (GLI) కింద 4,793 మందికి రూ. 76 కోట్లు చెల్లించామని వెల్లడించారు. తల్లికి వందనం పథకం తర్వాత ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులు, పోలీస్ శాఖకు ప్రయోజనం
రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గ్రాట్యుటీ బకాయిల కింద రూ. 3,411 కోట్లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ నిమిత్తం రూ. 1,800 కోట్లు విడుదల చేసే ప్రక్రియ తుది దశలో ఉందని అధికారులు తెలిపారు. వీటితో పాటు పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవ్‌ల కోసం రూ. 223 కోట్ల బిల్లులను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు. నిధుల లభ్యతను బట్టి దశల వారీగా అన్ని రకాల పెండింగ్ బిల్లులను పరిష్కరించాలని చంద్రబాబు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.
గత ప్రభుత్వ వేధింపులపై చర్చ, చిన్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సొంత సొమ్మును ఇతర అవసరాలకు మళ్లించడం, తమ నిధుల కోసం ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించిన ఉదంతాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. మరోవైపు, ప్రభుత్వానికి మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ. 614 కోట్ల బకాయిలు చెల్లించామని అధికారులు వివరించారు. బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో పెద్ద కాంట్రాక్టర్ల కంటే, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ప్రత్యేకంగా ఆదేశించారు.
Next Story

