
ఏప్రిల్ 1 నుంచి చైనా సీసీటీవీలకు గుడ్‌బై
భారత మార్కెట్‌లో దేశీయ కంపెనీల దూకుడు..
దేశంలో సీసీటీవీ నిఘా రంగంలో పెను మార్పు చోటుచేసుకోబోతుంది. కేంద్రం నిబంధనలను కఠినతరం చేయడంతో ఏప్రిల్ 1 నుంచి చైనా తయారీ సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలు మార్కెట్‌లో దాదాపు కనిపించవు.
ఇంటర్నెట్‌కు అనుసంధానమైన కెమెరాల ద్వారా డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనల ప్రకారం, ప్రతి సీసీటీవీ పరికరం STQC (Standardisation Testing and Quality Certification) ధృవీకరణ పొందాలి. పరికరంలో వాడే చిప్‌సెట్, సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ, రిమోట్ యాక్సెస్‌పై పరీక్షలు తప్పనిసరి చేశారు. దాంతో చైనా కంపెనీలు ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయి. ఫలితంగా చైనా కంపెనీలకు భారత్‌లో తలుపులు మూసుకున్నట్లే.
ఇక ఈ పరిస్థితిని తమకు మంచి అవకాశంగా భావిస్తున్నాయి దేశీయ కంపెనీలు. సీపీ ప్లస్, క్యూబో, ప్రామా, మ్యాట్రిక్స్, స్పర్ష్ వంటి భారతీయ బ్రాండ్‌లు మార్కెట్‌లో తమ వాటాను వేగంగా పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం సీసీటీవీ మార్కెట్‌లో 80 శాతం కంటే ఎక్కువ వాటా దేశీయ తయారీదారులదే.
అయితే ఈ మార్పుతో తయారీ ఖర్చులు కూడా పెరిగాయి. చైనా భాగాలపై ఆధారపడకుండా ఉండటంతో, ముడిసరుకు వ్యయం 15-20 శాతం వరకు పెరిగినట్లు అంచనా.
మొత్తం మీద, ఈ నిర్ణయం భారత నిఘా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్తోంది. భద్రతా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, దేశీయ తయారీ రంగానికి ఇది పెద్ద ఊతమవుతోంది.

