
గవర్నమెంట్ క్లాస్-4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ ఏకగ్రీక ఎన్నిక
ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి నిరంతరం కృషి చేసిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. "ప్రభుత్వ పెద్దల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. దీంతో కూటమి ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలకు శ్రీకారం చుట్టింది" అని పేర్కొన్నారు. 2025 అక్టోబర్ 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాలతో సమావేశమై కొన్ని హామీలు ఇచ్చారని, అవి ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని చెప్పారు. దీపావళికి ఒక డీఏ, సంక్రాంతికి దాదాపు 1000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ గవర్నమెంట్ 4వ తరగతి ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాల్గవ తరగతి ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశం ఆదివారం గుంటూరులోని శ్రీనివాస భవన్‌లో జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎస్ మల్లేశ్వరరావు మూడోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా, టి చెన్నప్ప ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు.
ఉద్యోగులు రెండేళ్లు కోల్పోయిన 12వ పీఆర్‌సీని తక్షణమే ప్రకటించాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. అన్ని కేటగిరీల ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన వేల కోట్ల బకాయిలలో చనిపోయినవారు, రిటైర్డ్ ఉద్యోగులు, మెడికల్ బిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. "కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరాలి" అని కోరారు.
ఎన్నికల అధికారిగా ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సురేష్ వ్యవహరించారు. నూతన కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ మల్లేశ్వరరావు (గుంటూరు), ప్రధాన కార్యదర్శి టి చెన్నప్ప (అనంతపురం), అసోసియేట్ ప్రెసిడెంట్ ఇ మద్దిలేటి (కర్నూలు), కోశాధికారి ఎస్.వి. కృష్ణారావు (కృష్ణా), గౌరవ అధ్యక్షుడు ఇ సుబ్రమణ్యం (చిత్తూరు)తో పాటు రాష్ట్ర కార్యదర్శులు ఇద్దరు, ఒక ప్రచార కార్యదర్శి, ఒక కార్యనిర్వాహక కార్యదర్శి, నలుగురు ఉపాధ్యక్షులు సహా మొత్తం 13 మంది సభ్యులు ఉన్నారు.
సమావేశంలో రాష్ట్ర జేఏసీ నాయకులు కె. సంగీతరావు, బి. కిశోర్‌కుమార్, టి. నాగేశ్వరరావు, ఏపీ జేఏసీ అమరావతి మహిళా కమిటీ చైర్‌పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, గుంటూరు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి.ఏ. కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

