దుర్గగుడి భూములపై పాలకమండలి కీలక నిర్ణయం
x

దుర్గగుడి భూములపై పాలకమండలి కీలక నిర్ణయం

ఇంద్రకీలాద్రిపై భక్తులకు డిజిటల్ దర్శనం.


విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసేందుకు దుర్గగుడి పాలకమండలి నడుం బిగించింది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 37 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గగుడి భూములపై పాలకమండలి కీలక నిర్ణయం తీసుకున్నారు.

క్యూలైన్లలో టీవీలు.. దాతల సహకారం
దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండే భక్తులకు విసుగు కలగకుండా, క్యూలైన్లలో అమ్మవారి పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేలా టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం పలువురు దాతలు టీవీలను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చైర్మన్ తెలిపారు. ఆలయ ప్రాంగణంతో పాటు క్యూలైన్ల పొడవునా ఈ టీవీలు అందుబాటులోకి రానున్నాయి.
అన్యాక్రాంతమైన భూములపై నజర్
అమ్మవారికి ఉన్న 234 ఎకరాల భూములపై పాలకమండలి ప్రత్యేక దృష్టి సారించింది. కొన్ని చోట్ల భూములు అన్యాక్రాంతమైనట్లు, మరికొన్ని చోట్ల కౌలు చెల్లించడం లేదని గుర్తించారు. ఈ భూములను పరిరక్షించి, సక్రమంగా కౌలుకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించారు.
గంజాయి బ్యాచ్‌పై పటిష్ఠ చర్యలు
కనకదుర్గానగర్‌లోని మరుగుదొడ్లను గంజాయి బ్యాచ్‌లు వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చైర్మన్ వెల్లడించారు. ఇకపై ఆలయ పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిఘాను మరింత పటిష్ఠం చేస్తామని హెచ్చరించారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈవో శీనానాయక్ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్త లడ్డూ పోటు, అన్నదానం భవనాలను ప్రారంభించనున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఒక ప్రముఖ ఆసుపత్రితో ఎంవోయూ (MoU) కుదుర్చుకోబోతున్నారు. పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు.
Read More
Next Story