
సినీ పక్కిలో పలాస షాపు యజమానిని కట్టేసి, బంగారం కొట్టేసి..
పోలీసు వేషం, చేతిలో తుపాకులు, లాఠీలు, బేడీలు.. నేరుగా బంగారు దుకాణం షాపులోకి వెళ్లారు...
సినీ పక్కిలో దోపిడీ జరగడం అంటే ఇదేనేమో.. పోలీసు వేషం, చేతిలో తుపాకులు, లాఠీలు, బేడీలు.. నేరుగా బంగారు దుకాణం షాపులోకి వెళ్లారు. మేము పోలీసులం, షాపును తనిఖీ చేయాలన్నారు. నిజమే కాబోలనుకుని ఆ షాపు యజమాని సరేనన్నాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ షాపు యజమానికే సంకెళ్లు, తెచ్చుకున్న సంచుల్లో నగలు, నగదు, అరిస్తే చంపేస్తామని బెదిరింపులు. తాపీగా దోచుకున్నారు. షాపు షట్టర్ లాగి ఎంచక్కా జారుకున్నారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వేంకటేశ్వర జ్యువెలరీలో భారీ చోరీ చోటుచేసుకుంది. 700 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసు వేషం వేసుకున్న 8 మంది దుండగులు మోటారు సైకిళ్లపై వచ్చి దుకాణంలోకి ప్రవేశించారు. యజమాని రామకృష్ణ చేతులకు సంకెళ్లు వేసి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు క్లూస్‌టీమ్‌తో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
తరచూ దొంగతనాలు...
శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన ప్రధాన చోరీ ఘటనలలో, కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో సుమారు ₹60 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, హుండీ నగదు అపహరణకు గురయ్యాయి. మరో ఘటనలో లావేరు మండలంలోని శ్రీ విజయ దుర్గా బంగారు నగల దుకాణంలో ముగ్గురు మహిళలు 3 గ్రాముల బంగారం, 480 గ్రాముల వెండిని దొంగిలించారు.
గత ఏడాది సెప్టెంబర్ లో నరసన్నపేటకు చెందిన పోత్నూరు వెంకట పార్వతీశం గుప్తాను, విశాఖపట్నం నుండి తిరిగి వస్తుండగా డ్రైవర్, మరో వ్యక్తి కలిసి హతమార్చి 1.33 కిలోల బంగారాన్ని దొంగిలించారు.
పోలీసులు ఈ ఘటనలపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Next Story

